ఏపీ మండలిలో చైర్మన్‌కు అవమానమా?
ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు శుక్రవారం సభలో మాట్లాడుతూ.. తనను అవమానించారని వ్యాఖ్యానించారు.;
ఏపీ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు శుక్రవారం సభలో మాట్లాడుతూ.. తనను అవమానించారని వ్యాఖ్యానించారు. ఇలా చేయడం సబబు కాదని.. అధికార పక్షం ఇలా చేస్తుందని తాను ఊహించలేదని అన్నారు. అధికార ప్రతిపక్ష సభ్యులు రాజకీయాలు చేసుకోవచ్చని.. కానీ, తనను(చైర్) అవమానించవద్దని వ్యాఖ్యానించారు. దీనిని తాను లైట్ తీసుకున్నా.. సభా సంప్రదాయాలపై గౌరవం ఉంచాలని ఆయన చెప్పారు.
ఏం జరిగింది?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం సహా.. ఇందార్‌పూర్ డెయిరీ, హెరిటేజ్ డెయి రీల మధ్య సంబంధాలపై చర్చించాలని వైసీపీ నాయకులు వరుసగా వాయిదా తీర్మానాలు ఇస్తున్నారు. అయితే.. తిరుమల లడ్డూపై చర్చించేందుకుత మకు అభ్యంతరం లేదని.. కానీ, దీనిని మార్చి 4 లేదా 5 తేదీల్లో చర్చించాలని అధికార పక్షం చెబుతోంది. ఇది పెను వివాదంగా మారి సభకు తీవ్ర అంతరాయం కూడా కలుగుతోంది.
ఇంతలో మండలి సెక్రటరీ నుంచి కొన్నివివరాలు కోరుతూ.. చైర్మన్ లేఖను పంపించారు. దీనిపై ఆయన వివరాలు ఇచ్చారని, కాబట్టి దీనిపై సమాధానం చెబుతామంటూ.. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఓ పత్రా న్ని సభలో చూపించారు. అయితే.. అసలు తనకే తెలియకుండా మండలి సెక్రటరీ లేఖ ఎలా ఇస్తారని, దానిపై తన సంతకం ఎవరు చేశారని.. ఇలా మంత్రి స్వయంగా తనకు తెలియకుండానే ప్రకటించడం ఏంటని చైర్మన్ మోషేన్‌రాజు ప్రశ్నించారు. దీంతో శుక్రవారం సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
మరోవైపు.. లడ్డూపై చర్చ అంటే వైసీపీ సభ్యులు పారిపోతున్నారని, భయపడుతున్నారని టీడీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిగా మీరే భయపడుతున్నారంటూ.. వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. పోడియంను చుట్టుముట్టి.. నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళం మధ్య మండలిని చైర్మన్ వాయిదా వేశారు. దీంతో బయటకు వచ్చిన వైసీపీ సభ్యులు ఫ్లెక్సీలు పట్టుకుని ఇటు మండలి, అటు అసెంబ్లీ ముందు.. నిరసన వ్యక్తం చేశారు.