వైఎస్సార్ చంద్రబాబు సరసన జగన్...!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ రాజకీయాలలో ఒక రికార్డు సృష్టించారు. అదేంటి అంటే అయిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పనిచేయడం

Update: 2024-03-16 01:30 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీ రాజకీయాలలో ఒక రికార్డు సృష్టించారు. అదేంటి అంటే అయిదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా పూర్తి కాలం పనిచేయడం. ఇందులో వింత ఏముంది అని అంతా అనుకోవచ్చు. కానీ ఏపీ వరకూ చూస్తే అది వింత విశేషమే అని చెప్పకతప్పదు. ఎందుకంటే 1973లో ఉమ్మడి ఏపీలో జలగం వెంగళరావు పూర్తి కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంటే ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నిక కాలం వరకూ అన్న మాట.

ఆ తరువాత మళ్లీ వైఎస్సార్ మాత్రమే ఆ ఘనత సాధించారు. ఆయన 2004 మేలో సీఎం అయితే 2009 ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకూ సీఎం గా చేశారు. తిరిగి ఆయనే రెండవమారు సీఎం గా ఎన్నిక అయ్యారు. ఆ ముందూ తరువాత వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అంతా ఏడాదికి ఒకరు వంతున పనిచేసి దిగిపోయిన వారే.

ఇక 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా అయిన ఎన్టీయార్ 1984లో నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటుతో దిగిపోయారు. తిరిగి 1985 లో రెండవసారి సీఎం అయిన ఆయన పూర్తి కాలం అధికారంలో ఉండకుండా ఆరు నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి 1989 పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఎన్నికలకు వెళ్లారు. ఓడిపోయారు.

ఇక 1989లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముగ్గురు సీఎం లు మారారు. 1994లో ఎన్టీయార్ మూడవసారి అధికారంలోకి వచ్చినా ఎనిమిది నెలలు మాత్రమే పనిచేశారు. చంద్రబాబు వెన్నుపోటు కారణంగా ఆయన అధికారం కోల్పోయారు. మొత్తంగా ఏడున్నరేళ్ల పాటు ఎన్టీయార్ సీఎం గా పనిచేసినా పూర్తి అయిదేళ్ళ టెర్మ్ సీఎం గా మాత్రం పనిచేయలేకపోయారు.

Read more!

ఇక 1995 సెప్టెంబర్ లో సీఎం అయిన చంద్రబాబు ఆ మిగిలిన కాలాన్ని పాలించినా మొదటి టెర్మ్ లో పూర్తి కాలం సీఎం కాలేకపోయారు. ఇక 1999లో రెండవసారి సీఎం అయిన చంద్రబాబు 2004లో లోక్ సభతో పాటు అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అలా ఆరు నెలల అధికారం చేతిలో ఉండగా ఆయన ఎన్నికలకు వెళ్ళి ఓటమి పాలు అయ్యారు. దాంతో అయిదేళ్ల ఫుల్ టెర్మ్ ఆయన ఉమ్మడి ఏపీలో పూర్తి చేయలేకపోయారు.

ఇక వైఎస్సార్ మాత్రమే ఆ ఘనతను జలగం వెంగళరావు తరువాత నలభయ్యేళ్ళకు సాధించారు. విభజన ఏపీలో మాత్రం చంద్రబాబు పూర్తి అయిదేళ్ల కాలం సీఎం గా ఉన్నారు. ఆయన 2014 నుంచి 2019 దాకా ముఖ్యమంత్రిగా పనిచేసి ఎన్నికల ఫలితాల తరువాతనే తన పదవికి రాజీనామా చేశారు. ఇక జగన్ 2019 మే 30న ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చెపట్టారు. ఆయన ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.

ఇంతటి భారీ మెజారిటీలతో వచ్చిన ప్రభుత్వాలు అయిదేళ్ళూ ఉండవని రాజకీయ విశ్లేషకులు చెబుతూ వచ్చారు. దానికి భిన్నంగా జగన్ ఒడుదుడుకులను ఎదుర్కొంటూ వచ్చారు. కరోనా తరువాత ఆర్ధికంగా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్తారని వార్తలు వచ్చినా జగన్ ధీటుగానే ఎదుర్కొన్నారు. ఇక 2023 లో తెలంగాణాతో పాటే ఏపీ అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారు అని ప్రచారం జరిగినా అవన్నీ తప్పు అని రుజువు అయింది.

మొత్తానికి జగన్ అయిదేళ్ల పూర్తి కాలం సీఎం గా పనిచేస్తూ ఎన్నికలకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే జలగం వెంగళరావు అయిదేళ్ల టెర్మ్ తరువాత కాంగ్రెస్ గెలిచినా సీఎం గా మళ్లీ పదవిని చేపట్టలేకపోయారు. కానీ 2009లో వైఎస్సార్ రెండవమారు మరోసారి సీఎం అయ్యారు. పైగా వరసగా రెండు సార్లు కాంగ్రెస్ ని గెలిపించిన రికార్డుని సాధించారు. చంద్రబాబు ఎన్నికల రాజకీయం చూస్తే వరసగా రెండు సార్లు నెగ్గిన దాఖలాలు లేవు. ఆయన 1999లో గెలిచారు. 2004, 2009లలో ఓడారు.

ఇపుడు చూస్తే 2014లో గెలిచారు, 2019లో ఓడారు, మరి యాంటీ సెంటిమెంట్ తో వరస రెండు సార్లు చంద్రబాబు ఓటమి పాలు అవుతారు అని ప్రత్యర్ధులు అంటున్నారు. అలాగే వైఎస్సార్ సెంటిమెంట్ జగన్ కి కూడా ఉందని ఆయన వరసగా రెండు సార్లు గెలిచి చూపిస్తారు అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ద్వితీయ విఘ్నం అన్నది వైఎస్సార్ ఫ్యామిలీలో లేదని అంటున్నారు. చూడాలి మరి 2024 ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో.

Tags:    

Similar News