జగన్ పాదయాత్ర.. పోలీసుల అధ్యయనం!
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సమాయత్తం అవుతున్న విషయం తెలిసిందే. స్వయంగా ఆయనే వచ్చే ఏడాది నుంచి దాదాపు ఏడాదిన్నర కాలం పాటు తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించారు.
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సమాయత్తం అవుతున్న విషయం తెలిసిందే. స్వయంగా ఆయనే వచ్చే ఏడాది నుంచి దాదాపు ఏడాదిన్నర కాలం పాటు తాను పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఎన్నికల వరకు కూడా పాదయాత్ర ఉంటుందని చెప్పారు. తద్వారా ప్రజల్లో తిరిగి వైసీపీ ప్రభావాన్ని పెంచాలని.. అధికారమే లక్ష్యంగా అడుగులు వేయాలని జగన్ నిర్ణయించా రు. దీనిపై పార్టీ తరఫున పెద్ద ఎత్తున కసరత్తు కూడా చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న జగన్.. పార్టీ పరిస్థితిని తెలుసుకుంటున్నారు. తద్వారా ఏయే నియోజకవర్గాల మీదుగా తన పాదయాత్ర ఎలా ఉండాలన్న విషయంపై ఒక అవగాహనకు వస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం వీక్‌గా ఉన్న నియోజకవర్గాల సంఖ్య భారీగానే ఉంది. ముఖ్యంగా నాయకుల మధ్య సఖ్యత లోపంతోపాటు.. పార్టీ పరంగా కూడా కుమ్ములాటలు జరుగుతున్న నియోజకవర్గాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. ప్రస్తుత ఆయా నియోజకవ ర్గాలపై జగన్ దృష్టి పెడుతున్నారు. వాటిని సరిచేస్తూ.. పాదయాత్ర నాటికి పార్టీ పరంగా ఆయా నియోజకవర్గాలు పుంజుకునేలా చేయాలన్న ప్లాన్‌తో ఉన్నారు. ముఖ్యంగా యువతకు ప్రాధాన్యం పెంచే దిశగా కూడా జగన్ అడుగులు ముమ్మరం చేస్తున్నా రు. అలానే.. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య పెరిగితే.. ఆదిశగా కూడా పార్టీపరంగా పుంజుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలపైనా అధ్యయనం చేస్తున్నారు.
జగన్ ఇలా పాదయాత్రపై ముమ్మరం కసరత్తు చేస్తుంటే.. మరోవైపు, పోలీసులు కూడా జగన్ చేపట్టబోయే పాదయాత్రపై అధ్య యనం చేస్తున్నారు. పాదయాత్ర ద్వారా.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్న దరిమిలా.. పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై పోలీసులు కన్నేశారు. ముఖ్యం గా సీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు వంటి ఉమ్మడి జిల్లాల్లో వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. నేతలు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఇటీవల కూడా వాహన దహనాలు చోటు చేసుకున్నాయి.
ఇక, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని పోలీసులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో జగన్ పాదయాత్ర కారణంగా.. ఈ ఉద్రిక్తతలు మరింతపెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్న పోలీసులు.. వాటిని ఎలా ఎదుర్కొనాలి.. పాదయాత్ర కు ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్కు ఎలాంటి భద్రత కల్పించాలి.. పాదయాత్రకు పరిమితులు విధించే పరిస్థితి ఉంటుందా? జన సమీకరణ విషయంలో ఏమైనా జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందా? అనే అంశాలపై పోలీసులు న్యాయనిపుణులను కూడా సంప్రదిస్తున్నట్టు హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి. ``పాదయాత్రను అడ్డుకోలేం. న్యాయస్థానాల నుంచిఆర్డర్లు తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగని శాంతి భద్రతలు గాడితప్పకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది`` అని ఐజీ స్తాయి అధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతం పాదయాత్ర పై తమ శాఖ అధికారులు అధ్యయనం చేస్తున్నది వాస్తవమేనన్నారు.