గవర్నర్‌తో జగన్ భేటీ.. రాజకీయ దుమారం.. !
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.;
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. అసలు ఎలాంటి ప్రకటన లేకుండా ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మీడియా కంట్లో పడకుండా జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలుసుకున్నారు. దీనిపై టిడిపి వర్గాల్లోనూ.. రాజకీయంగా కూడా భారీ చర్చ జరుగుతోంది. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా గవర్నర్ను కలుసుకునేందుకు జగన్‌కు అవకాశం ఉంది. దీన్ని ఎవరు కాదని కూడా అనరు. కానీ ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు నేపథ్యంలో అనూహ్యంగా ఈ భేటీ నిర్వహించడం గమనార్హం.
కనీసం మీడియాకు సమాచారం కూడా ఇవ్వకుండా జగన్ గవర్నర్‌తో భేటీ కావడం వంటివి మాత్రం రాజకీయంగా చర్చకు దారి తీసాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మద్యం కుంభకోణం సహా ఇతర కేసులు జోరుగా విచారణ సాగుతున్నాయి. మరోవైపు డిజిటల్ పేమెంట్ ల వ్యవహారం కూడా వివాదాస్పదంగా మారింది. ల్యాండ్ రీ సర్వే అంశం కూడా చర్చకు దారితీసింది. వీటన్నింటిపైనా ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది. దీనిలో ప్రధానంగా మద్యం కుంభకోణం వైసీపీని ఇరుకాటంలోకి నెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఎంపీ మిధున్ రెడ్డి అరెస్టయి జైల్లో ఉన్నారు.
తదుపరి అరెస్టు కీలక నాయకుడు దేనని.. ఆయన జగనేనని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో అనూహ్యంగా గవర్నర్ను కలుసుకోవడం సుమారు 40 నిమిషాలకు పైగా చర్చలు జరపటం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీనిపై అధికారికంగా వైసిపి నుంచి ఎట్లాంటి ప్రకటన రాలేదు. పైగా ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. దీంతో గవర్నర్ దగ్గరికి జగన్ వెళ్లడం వెనుక మద్యం కుంభకాణంలో తన వారిని కాపాడుకునేందుకు ముఖ్యంగా ఎంపీ మిధున్ రెడ్డికి దీంతో సంబంధం లేదని అనవసరంగా ఇరికించారని ఫిర్యాదు చేసేందుకే వెళ్లారన్నది టిడిపి నాయకులు చెబుతున్న మాట.
వైసిపి అంతర్గతంగా జరుగుతున్న చర్చల్లో మాత్రం రాష్ట్రంలో ఉన్న సమస్యలు రైతులకు చెల్లించాల్సిన ధాన్యం నిధులు అదేవిధంగా మామిడి రైతులకు ఇవ్వాల్సిన సొమ్ముల విషయాన్ని చర్చించేందుకు మాత్రమే గవర్నర్ వద్దకు వెళ్లారని అంటున్నారు. ఏదేమైనా గవర్నర్ ను కలుసుకోవడం తప్పు కాకపోయినప్పటికీ ఏం చర్చించారు అన్నది కనీసం చెప్పకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్రంలో ప్రస్తుతం ఆపరేషన్ సింధూరపై చర్చ జరుగుతోంది. ఈ విషయంలో వైసీపీ నుంచి కేంద్రానికి మద్దతు అవసరం ఉంది. అదేవిధంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఉంది. దానికి కూడా వైసిపి రాజ్యసభ సభ్యుల మద్దతు అవసరం ఉంది. ఈ పరిణామాలు గమనిస్తే తెరవెనుక ఏదో జరుగుతుందన్నది టిడిపి నాయకులు వేస్తున్న అంచనా. మరి ఏం జరుగుతుంది? ఏంటి? అనేది తెలియాల్సి ఉంది.