కేసు మీదు కేసు.. వైసీపీ బాసుకు పోలీసుల షాక్
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.;
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ బాస్ వైఎస్ జగన్మోహనరెడ్డి పర్యటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల ఉల్లంఘనల పేరిట వరుస కేసులు నమోదు చేస్తున్నారు. గత నెలలో చేపట్టిన పల్నాడు జిల్లా పర్యటనలో నిబంధనలు పాటించలేదన్న కారణంతో సుమారు 113 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇక తాజాగా నిర్వహించిన మామిడి రైతుల పరామర్శ యాత్రలోనూ పోలీసు ఆంక్షలను అతిక్రమించారనే కారణంగా నాలుగు కేసులు నమోదయ్యాయి.
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో మామిడి రైతుల పరామర్శకు మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 9న వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు పోలీసులు కేవలం 500 మందికి మాత్రమే అనుమతిచ్చారు. అదేవిధంగా రోడ్ షో నిర్వహణకు అనుమతివ్వలేదు. మరోవైపు హెలిపాడ్ వద్దకు కేవలం 30 మంది మాత్రమే వెళ్లాలని షరతు విధించారు. అయితే వైసీపీ శ్రేణులు పోలీసు ఆంక్షలను కనీసం పట్టించుకోలేదు. దీంతో ఆయా అంశాలపై పోలీసు కేసులు నమోదవుతున్నాయి.
జగన్ బంగారుపాళ్యం పర్యటనపై ఇప్పటివరకు మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకపోయినా రోడ్ షో నిర్వహించారని ఓ కేసు, హెలిపాడ్ వద్ద వందల మంది గుమిగూడారని మరో కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ చిత్తూరు వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డితోపాటు మరికొందరు నేతలు, కార్యకర్తలను నిందితులుగా చేర్చారు. అదేవిధంగా రోడ్డుపై మామిడికాయలు పారబోసి షరతులు అతిక్రమించారని కూడా ఓ కేసు నమోదు చేశారు. పూతలపట్టు నియోజకవర్గ ఇన్చార్జి సునీల్, మరో ఐదుగురు నేతలను ఈ కేసులో నిందితులుగా గుర్తించారు. వీటితోపాటు ఆంధ్రజ్యోతి ఫొటో గ్రాఫర్ పై దాడి చేశారని మరికొందరు కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో సీసీ పుటేజ్ విశ్లేషిస్తూ నిందితులను గుర్తిస్తున్నారు.