జ‌గ‌న్.. డ‌బుల్ ప్లాన్‌.. కూట‌మికి స‌వాల్ ..!

దీంతో త్వరలోనే ప్రజల మధ్యకు వచ్చేందుకు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది.;

Update: 2025-06-26 02:30 GMT

రాజకీయంగా దూకుడు పెంచితేనే తప్ప పార్టీ పరిస్థితి అదుపులోకి రాదని గ్రహిస్తున్న వైసీపీ అధినేత జగన్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా త్వరలోనే ఆయన ప్రజల మధ్యకు వ‌చ్చే అవ‌కాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికీ రెండు నెలల కాలంలో చేపట్టిన పరామర్శ యాత్రలు, రైతుల పలకరింపు యాత్రలు సక్సెస్ అయ్యాయ‌ని ఆ పార్టీ భావిస్తోంది. విపరీతంగా జనాలు తరలిరావడం, యువత భారీ ఎత్తున చేరుకోవడం వంటివి ఆ పార్టీ సానుకూల అంశాలుగా భావిస్తుంది,

ఈ నేపథ్యంలో ఈ వేడి తగ్గకముందే ప్రజలను కలుసుకునే దిశగా పార్టీ అధినేత అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై స్పందించడం ద్వారా మళ్లీ తిరిగి సానుభూతి సొంతం చేసుకోవచ్చు అనేది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. నిజానికి జనంలోకి రావాలని జనం మధ్య ఉండాలని గత ఏడాది అక్టోబర్ లోనే జగన్ నిర్ణయించుకున్నారు. అయితే అనివార్య కారణాలవల్ల ఈ పర్యటనలు వాయిదా పడుతూ వచ్చాయి. ఇక ఇప్పుడు చేపట్టిన రెండు పరామర్శ కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన బాగుందని గుర్తించారు.

ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వచ్చేందుకు ఇదే మంచి సమయమని ఆయన లెక్కలు వేసుకున్నారు. దీంతో త్వరలోనే ప్రజల మధ్యకు వచ్చేందుకు ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నట్టు పార్టీ వర్గాల నుంచి తెలుస్తోంది. తద్వారా ఓటు బ్యాంకును తిరిగి సంపాదించుకోవడంతోపాటు బలమైన కూట‌మి స‌ర్కారుపై అధిపత్యాన్ని సంపాదించుకునే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు పుంజుకుంటే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి శ‌క్తిని కూడ‌గ‌ట్టుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో జ‌గ‌న్‌ డ‌బుల్ ప్లాన్ వేస్తున్నారని స‌మాచారం. తొలుత ఆయ‌న పార్టీని లైన్‌లో పెట్ట‌నున్నారు. పార్టీ త‌ర‌ఫున పోరాడి.. జైళ్ల‌కు వెళ్లిన వారి కుటుంబాల‌ను ప‌రామ‌ర్శిస్తారు. త‌ద్వారా పార్టీలో భ‌రోసా పెంచుతారు. ఆ త‌ర్వాత ఆయ‌న ప్ర‌భుత్వ వ్య‌తిరేక అజెండాను రెడీ చేసుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌నున్నారు. ఈ రెండు కార్య‌క్ర‌మాల ద్వారా వైసీపీని ప‌రుగులు పెట్టించాలన్న‌ది జ‌గ‌న్ యోచ‌న‌గా ఉంది. మ‌రి ఈ రెండుకార్య‌క్ర‌మాల‌కు ఎప్పుడు ముహూర్తం పెడ‌తారో చూడాలి.

Tags:    

Similar News