వైసీపీ పరిస్థితి ఏంటి...జగన్ ముందున్న నివేదిక !
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలోని మొత్తం 175 సీట్లలోని వైసీపీ ఇంచార్జిలకు ఒక అగ్ని పరీక్ష అని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి విజయాన్ని చేకూర్చాలని జగన్ గట్టిగా కోరుకుంటున్నారు. ఇక
ఏపీలో వైసీపీకి అధికారం పోయి రెండేళ్ళకు పై మాట అయింది. అదే సమయంలో దారుణంగా ఓడి విపక్షం హోదా కూడా దక్కనంతంగా దిగనారింది. దాంతో అసెంబ్లీకి వెళ్ళలేక జనంలోకి కూడా రాలేక చాలా మంది సతమతం అవుతున్నారు. అధినాయకత్వం అయితే ఈ రెండేళ్ళలో పెద్దగా తిరిగింది లేదని అంటున్నారు. ఇక వైసీపీ కేంద్ర కార్యాలయం మాత్రం పార్టీ వారికి ఆందోళనలు నిరసనలు చేపట్టాలని కార్యక్రమాలు ఇస్తోంది. అదే సమయంలో పార్టీ కమిటీలు బూత్ లెవెల్ వరకూ వేయమని కూడా ఆదేశించింది. పార్టీని పటిష్టం చేస్తూ స్థానిక సమస్యల మీద ఆందోళలను ఎవరికి వారుగా నిర్వహించాలని ఆదేశించింది. మరి ఈ రెండేళ్ళలో వైసీపీ ఏ మేరకు సక్సెస్ అయింది. నేతల పరిస్థితి ఏమిటి, ఏపీలో మూడు రీజియన్లలో వైసీపీ ప్రస్తుతం పొజిషన్ ఎలా ఉంది అన్నది అయితే చర్చ సాగుతోంది. అయితే దీని మీద పార్టీ నేతలు చెప్పే మాటలు కాకుండా అధినేత జగన్ సొంతంగా ప్రైవేట్ సర్వే చేయించారు అని అంటున్నారు.
చేతిలోనే సర్వే నివేదిక :
ఈ నేపథ్యంలో జగన్ వద్దకు సదరు ప్రైవేట్ సంస్థ చేసిన సర్వే నివేదిక ఉందని అంటున్నారు. అందులో ప్రతీ నియోజకవర్గంలో నేతల జాతకాలతో పాటు పార్టీ పరిస్థితి కూడా స్పష్టంగా ఉందని అంటున్నారు. ఇక వైసీపీ నేతలలో ఈ రెండేళ్ళలో గట్టిగా ఎక్కడ పనిచేశారు అన్నది చూస్తే కనుక రాయలసీమ నేతలే బెటర్ అని ఆ సర్వే నివేదికలో వచ్చింది అని అంటున్నారు.
ఆ మూడు చోట్లా అంతేనా :
ఏపీలో కోస్తా, గోదావరి ఉత్తరాంధ్రా జిల్లాలలో అయితే వైసీపీ నేతలు పెద్దగా పనిచేయడం లేదని ఈ సర్వే నివేదిక ఉన్నది ఉన్నట్లుగా చెప్పేసింది అని అంటున్నారు. ఎక్కడ అయినా సొంతంగా ప్రజా సమస్యలను గుర్తించి నాయకులు పనిచేయడం లేదని కూడా సర్వే ప్రకారం అధినాయకత్వానికి అర్ధం అయింది అని అంటున్నారు. అంతే కాకుండా పార్టీని పెద్దగా పట్టించుకోని వారే అధికంగా ఉన్నారని కూడా చెబుతోంది ఈ సర్వే. దాంతోనే వైసీపీ అధినాయకత్వం అప్రమత్తం అయింది అని అంటున్నారు.
ఎలాగైనా రావాలనే :
వైసీపీకి 2029 ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అని అంటున్నారు. ఎంతలా అంటే చావో రేవో అన్నట్లుగానే అని గుర్తు చేస్తున్నారు. వరుసగా రెండు సార్లు ఓటమి చెందితే వైసీపీకి రాజకీయంగా ఎంతో ఇబ్బంది అవుతుంది అని అంటున్నారు. ఆ సంగతి అధినాయకత్వానికి బాగా తెలుసు అని అందుకే నాయకులతో వరస మీటింగ్స్ ని జగన్ ఏర్పాటు చేసి వారి పనితీరు మార్చుకోవాలని ఒకటికి పది సార్లు చెబుతున్నారని అంటున్నారు. ఈ మధ్య కూడా ఒక జిల్లా సమావేశంలో నేతల పనితీరు మీద ఆయన సర్వే నివేదికలో ఉన్న వివరాలను బయటపెట్టి ప్రశ్నించారు అని అంటున్నారు.
అదే ఆఖరి చాన్స్ :
స్థానిక సంస్థల ఎన్నికలు ఏపీలోని మొత్తం 175 సీట్లలోని వైసీపీ ఇంచార్జిలకు ఒక అగ్ని పరీక్ష అని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి విజయాన్ని చేకూర్చాలని జగన్ గట్టిగా కోరుకుంటున్నారు. ఇక ఏకగ్రీవాలు అయితే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరికలు చేస్తున్నారు. ఏపీలో వైసీపీకి గట్టి ఓటు షేర్ ఉందని జగన్ నాయకులకు చెబుతున్నారు. రెండేళ్ళ వ్యవధిలోనే కూటమి పట్ల జనంలో తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ అవకాశాన్ని వాడుకుని పార్టీకి విజయాలు అందించాలని ఆయన గట్టిగానే చెబుతున్నారు. స్థానిక సమరంలో వైసీపీకి సీట్లు తెచ్చి మొనగాడు అనిపించుకున్న వారికే 2029లో టికెట్లు అని కూడా జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. మరి రెండు నెలల వ్యవధిలో జరగబోయే లోకల్ ఫైట్ లో వైసీపీ నేతలు ఎంత వరకూ నిలబడి కూటమితో కలబడి సీట్లూ ఓట్లూ తెస్తారో చూడాల్సి ఉందని అంటున్నారు. తేడా వస్తే వైసీపీలో సీటు ఆశ వదిలేసుకోవాల్సిందే అన్నట్లుగా అధినాయకత్వం హెచ్చరికలు ఉంటున్నాయని అంటున్నారు.