కృష్ణా తీరానికి జగన్... ఇంట్రెస్టింగ్ టూర్

జగన్ విషయానికి వస్తే చాలా కాలం తరువాత క్రిష్ణా తీరానికి వస్తున్నారు. ఆయన వైసీపీ ఓటమి తరువాత ఉమ్మడి క్రిష్ణా జిల్లా పర్యటనకు రావడం అందునా మచిలీపట్నం వైపుగా రావడం ఇదే తొలిసారి అని అంటున్నారు.;

Update: 2025-11-03 05:04 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కృష్ణా తీరం వైపు చూస్తున్నారు. ఆయన ఈ నెల 4న కృష్ణా జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో ఏపీ మొత్తం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఏపీలోని కేవలం ఒకటి రెండు జిల్లాలలో తప్ప మొత్తం అంతా కూడా మొంథా కవర్ చేసి పారేసింది. మొంథా తుఫాన్ దెబ్బకు పంట నష్టం భారీగా జరిగింది. ముఖ్యమంగా ఏపీకి గుండె కాయ లాంటి కోస్తా ప్రాంతం అంతా తీవ్రంగా నష్టం పాలు అయింది. ప్రభుత్వం తరఫున వారికి సహాయం అందించే యత్నాలు అయితే జరుగుతున్నాయి, అదే సమయంలో విపక్ష వైసీపీ మాత్రం రైతులకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తోంది. తుఫాన్ ముగిసిన తరువాత తాడేపల్లికి వచ్చిన జగన్ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరీ కూటమి ప్రభుత్వంపైన విమర్శలు చేశారు. రైతులకు బీమా ధీమా రెండూ లేకుండా పోయాయని ఆయన మండిపడ్డారు. మొత్తం 15 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగింది అని వైసీపీ లెక్క చెబుతోంది.

ఆ రెండు చోట్ల :

ఇక క్రిష్ణా జిల్లాలో పెడన, మచిలీపట్నం నియోజకవర్గాలలో జగన్ పర్యటించనున్నారు. ఇక్కడ పంట పొలాలను సందర్శించి రైతులతో ఆయన స్వయంగా మాట్లాడుతారు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పంట నష్టం ఏ మాత్రం అన్నది జగన్ రైతుల ద్వారానే తెలుసుకుంటారు అని అంటున్నారు. అయితే ఇప్పటికే వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఈ ప్రాంతాలను సందర్శించారు, ఆయన రైతులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. జగన్ అబద్ధాల విమర్శలు చేస్తున్నారు అని కూడా మండిపడ్డారు.

చాలా కాలం తరువాత :

జగన్ విషయానికి వస్తే చాలా కాలం తరువాత క్రిష్ణా తీరానికి వస్తున్నారు. ఆయన వైసీపీ ఓటమి తరువాత ఉమ్మడి క్రిష్ణా జిల్లా పర్యటనకు రావడం అందునా మచిలీపట్నం వైపుగా రావడం ఇదే తొలిసారి అని అంటున్నారు. మచిలీపట్నం రాజకీయంగా ఇపుడు కీలకంగా ఉంది. మంత్రి కొల్లు రవీంద్ర వర్సెస్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత పేర్ని నానిల మధ్య పొలిటికల్ వార్ నిరంతరం సాగుతూ వస్తోంది. ఇక తుఫాన్ సందర్భంగా కూడా ప్రభుత్వం సహాయం చేయలేదని వైసీపీ అంటూంటే రైతులకు తెలుసు ఎవరేమిటి అన్నది కూటమి నుంచి జవాబు వస్తోంది.

అగ్గి రాజేస్తుందా :

ఇక జగన్ గత నెలలో ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన చేశారు. ఆ తరువాత సరిగ్గా నెల తరువాత ఆయన మళ్ళీ జనంలోకి వస్తున్నారు. జగన్ పర్యటనలు అంటే భారీగానే ఉంటుంది, దాంతో పోలీసులు అనుమతులు ఆ మీదట ఆంక్షలు వంటివి కూడా ఉంటాయా ఉంటే ఏమి జరుగుతుంది అన్నది చర్చగా ఉంది. ఇక మచిలీపట్నం పొలిటికల్ గా వేడిగానే ఉంటుంది, దాంతో పాటు జనసేన టీడీపీ కూటమి అక్కడ బలంగా ఉంది, దాంతో ఈ పరామర్శ రాజకీయంగా ఏ రకమైన రచ్చ రేపుతుంది అన్నది కూడా ఆసక్తిగానే ఉందని అంటున్నారు.

జోగి అరెస్టుతో :

ఇక జగన్ పెడన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇది జోగి రమేష్ సొంత ప్రాంతం, ఆయనను తాజాగా అరెస్టు చేశారు. దానితో రాజకీయంగా ఆ ప్రకంపనలు ఏమైనా ఉంటాయా అన్నది కూడా చూడాల్సి ఉంది. మొత్తం మీద చూస్తే చాలా కాలం తరువాత జగన్ పర్యటించడం అది కూడా ఉమ్మడి క్రిష్ణా జిల్లా తీరంలో రాజకీయ కోలాహలం నిరంతరం ఉన్న ప్రాంతంలోనే జరగడంతో ఆయన టూర్ మీద అయితే ఫోకస్ ఉంది అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News