వైఎస్‌ జగన్‌ Vs సునీత.. నాంపల్లి సీబీఐ కోర్టులో ఆసక్తికర సన్నివేశం

హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ప్రాంగణంలో గురువారం ఆసక్తికర సన్నివేశం కనిపించింది.;

Update: 2025-11-20 10:00 GMT

హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ప్రాంగణంలో గురువారం ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి, ఆయన సోదరి వైఎస్ సునీత ఒకే సమయంలో కోర్టుకు హాజరుకావడం ఉత్కంఠ రేపింది. ఇద్దరూ వేర్వేరు కేసుల విషయంలో కోర్టుకు వచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ఈ ఇద్దరి మధ్య కొంతకాలంగా గ్యాప్ ఏర్పడింది. జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో సునీతకు మద్దతుగా నిలవలేదని అన్నపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు ప్రాంగణంలో ఇద్దరు ఎదురెదురు పడితే ఎలాంటి స్పందనలు వ్యక్తమవుతాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు.

అయితే అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు హాజరైన జగన్.. కోర్టులో సునీతను చూసి చూడనట్లు వెళ్లిపోయారు. ఆమెతో ఒక్క మాట కూడా ఆడలేదు. అదే సమయంలో సునీత కూడా సోదరుడిని చూసి ముఖం తిప్పేశారు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లు కోర్టులో ఎదురుపడితే కనీసం పలకరించుకోకపోవడంపై అక్కడున్న వారు అవాక్కయ్యారు. అయితే ఆ ఇద్దరి మధ్య సత్సంబంధాలు లేకపోవడం వల్లే మాట్లాడేందుకు ఏ ఒక్కరూ చొరవ చూపలేదని అంటున్నారు.

అక్రమాస్తుల కేసులో జగన్ గురువారం కోర్టుకు వస్తారని అందరికీ తెలిసినా, అదే సమయంలో సునీత వస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే జగన్ కేసు వాయిదా ఉన్న రోజునే.. యాధృచ్చికంగా వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తును కొనసాగించమని సునీత వేసిన పిటీషన్ విచారణకు రావడం గమనార్హం. వివేకా కేసులో దర్యాప్తు ఎప్పుడో ముగిసిందని సీబీఐ గతంలోనే సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అసంపూర్తిగానే ముగించారని, వివేకా మరణించారన్న సమాచారం మాజీ ముఖ్యమంత్రి జగన్ కు ముందే తెలుసన్న అనుమానంతో.. ఆ విషయం ఆయనకు ఎవరు చేరవేశారన్నది తేల్చాలనే డిమాండ్ తో సునీత పునర్విచరణకు డిమాండ్ చేస్తూ కేసు వేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా అన్నాచెల్లెళ్లు ఎదురెదురు పడటం ఉత్కంఠకు గురిచేసింది. అయితే ఆ ఇద్దరూ మట్లాడుకునేందుకు ఆసక్తి చూపకపోవడం చర్చనీయాంశమైంది. వివేకా కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీతకు జగన్ సొంత చెల్లెలు షర్మిల సైతం మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఇద్దరు చెల్లెళ్లతో ఏర్పడిన వైరం పతాకస్థాయికి చేరింది.

Tags:    

Similar News