జగన్ వార్నింగ్.. కేడర్ కు డబ్బు భయం? స్థానిక సమరంపై వైసీపీలో తర్జనభర్జన

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయని అంటున్నారు.

Update: 2026-05-30 11:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయని అంటున్నారు. ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా రాష్ట్రంలో ప్రతి స్థానం నుంచి పోటీ చేయాలని వైసీపీ బాస్ జగన్ పార్టీ కేడర్ ను ఆదేశించారు. ప్రధానంగా ఏ నియోజకవర్గంలో అయినా పోటీకి అభ్యర్థులు లేరన్న సాకు చూపకూడదని, అవసరమైతే బీసీ, ఎస్సీ కార్యకర్తలను రంగంలోకి దింపాలని జగన్ రెడ్డి సూచించారు. దీంతో స్థానిక ఎన్నికల్లో పార్టీ పట్టు నిరూపించుకోవాలని జగన్ రెడ్డి తహతహలాడుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో కేడర్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నట్లు అంతర్గత సంభాషణల్లో తెలుస్తోందని చెబుతున్నారు.

కూటమి ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తున్న వైసీపీ కార్యకర్తలు స్థానిక ఎన్నికల్లో పోటీపై మాత్రం తీవ్ర తర్జనభర్జనకు గురవుతున్నారని అంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఎన్నికల వ్యవస్థ డబ్బు మయంగా మారిపోవడమే అంటున్నారు. చిన్న పంచాయతీలో సర్పంచ్ పదవికి పోటీపడాలన్నా ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలు ఖర్చు పెట్టాల్సివుంటుందని అంటున్నారు. అంత డబ్బు పెట్టి గెలిచినా, ప్రతిపక్షంలో ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంల ప్రస్తుతం నెలకొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా దిగువస్థాయి కేడర్ ను భయపెడుతోందని అంటున్నారు.

రానున్న రెండు మూడు నెలల్లో స్థానిక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినందున ఈ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వంపై సానుకూల వాతావరణమే ఉందని ప్రభుత్వం చాటి చెప్పాలని అనుకుంటోంది. ఇదే సమయంలో వైసీపీ కూడా గట్టి వ్యూహంతోనే ముందుకు కదులుతోందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా అధికార పార్టీకి తలొగ్గామనే అభిప్రాయం వ్యక్తం కావొద్దని, ప్రతిచోట అధికార పక్షాన్ని దీటుగా ఢీకొట్టాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ఇంచార్జులను యాక్టివ్ చేసింది. ఎన్నికల్లో ప్రతి చోటా అభ్యర్థులను నిలిపే బాధ్యత నియోజకవర్గ ఇంచార్జిలకు అప్పగించింది.

అయితే సర్పంచ్, ఎంపీటీసీ వంటి పదవులకు పోటీ చేయడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నప్పటికీ డబ్బు సమస్యే వారిని ఊగిసలాటకు గురిచేస్తోందని చెబుతున్నారు. విపక్షంలో ఉండటం వల్ల గెలిచినా, గెలవకపోయినా పెద్దగా ప్రయోజనం ఉండదని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నట్లు చెబుతున్నారు. లక్షల రూపాయలు కుమ్మరించి పోటీ చేసి ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకోవడం ఎందుకు? అన్న ఆలోచనలో ఎక్కువమంది ఉన్నారని అంటున్నారు. అయితే పార్టీ అగ్ర నాయకత్వం మాత్రం ఎట్టిపరిస్థితుల్లో పోటీ చేయాల్సిందే అని పట్టుబడటం వల్ల చాలా మంది నియోజకవర్గ ఇంచార్జిలు ఏమైనా సాయం చేస్తారా? అని ఆశగా ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయంలో హైకమాండ్ స్పష్టత ఇస్తే క్షేత్రస్థాయిలో పోటీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Tags:    

Similar News