ఢిల్లీకి జగన్.. 'పెద్దల' కోసమేనా?
వైసీపీ అధినేత జగన్ సోమ, మంగళవారాల్లో ఢిల్లీకి వెళ్లనున్నారా? రాజకీయంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను.. తమ పార్టీ నాయకులపై పెడుతున్న కేసులు.. జైళ్లకు పంపుతున్న వైనాన్ని ఆయన ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి తాడేపల్లి వర్గాలు.;
వైసీపీ అధినేత జగన్ సోమ, మంగళవారాల్లో ఢిల్లీకి వెళ్లనున్నారా? రాజకీయంగా ఏపీలో జరుగుతున్న పరిణామాలను.. తమ పార్టీ నాయకులపై పెడుతున్న కేసులు.. జైళ్లకు పంపుతున్న వైనాన్ని ఆయన ఢిల్లీ పెద్దలకు వివరించనున్నారా? అంటే.. ఔననే అంటున్నాయి తాడేపల్లి వర్గాలు. ప్రస్తుతం జగన్ బెంగళూరులో ఉన్నారు. అటు నుంచి అటే.. ఆయన ఢిల్లీకి వెళ్తారని.. ఏపీ నుంచి మరో 10 మంది వరకు నాయకులు కూడా ఢిల్లీకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. వీరిలో ముగ్గురు లోక్‌సభ ఎంపీలు.. రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారని తెలిసింది.
ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే.. ఏపీలో కూటమి ప్రభుత్వంపై ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. నిజానికి కూటమిలో బీజేపీ కూడా ఉంది. అయినప్పటికీ.. బీజేపీని డామినేట్ చేస్తున్నారని.. అంతా టీడీపీనే చక్కబెడుతోందని.. కూడా.. జగన్ ఫిర్యాదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా.. కూటమిలో చిచ్చు పెట్టి.. బీజేపీని దూరం పెట్టాలన్న వ్యూహం కూడా ఉందన్న వాదన ఇటువైపు టీడీపీ నాయకుల నుంచి కూడా వినిపిస్తోంది.
ఇదే విషయాన్ని టీడీపీ సీనియర్లు కూడా సందేహిస్తున్నారు. జగన్ ఏమైనా చేయగలడు! అంటూ.. రాజ మండ్రికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కేంద్రానికి ఉప రాష్ట్రపతి ఎన్నిక కీలకంగా మారింది. ఇది పోటీ లేకుండా జరుగుతుందని అనుకున్నా.. ఇండియా కూటమి తరఫున కాంగ్రె స్ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రంగంలోకి దిగే అవకాశం ఉంది. దీంతో లోక్‌సభలో ఈ విషయంపై పైచేయి సాధించినా.. రాజ్యసభలో వైసీపీ వంటి తటస్థ పార్టీల అవసరం కేంద్రానికి చాలా అవసరం.
ఇది జగన్‌కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మద్యం కుంభకోణంపై జరుగుతున్న విచారణ.. నమోదవుతున్న కేసులు.. ముఖ్యంగా ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్టు వంటివిషయాలను కేంద్రానికి వివరించ డం ద్వారా.. ఉపశమనం పొందేందుకు జగన్ ప్రయత్నించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రధాని మోడీ కూడా విదేశీ పర్యటన ముగించుకుని ఆదివారం దేశానికి వచ్చారు. సోమవారం నుంచి లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ జరగనుంది. ఇవన్నీ కూడా.. జగన్‌కు కలిసి వచ్చే అవకాశం ఉందని.. అందుకే ఆయన ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి.