ఢీ కొట్టింది జగన్ వాహనమే.. పోలీసుల తాజా అప్‌డేట్

వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా ఈ నెల 18న గుంటూరు శివార్లలోని ఏటుకూరు వద్ద జరిగిన ప్రమాదం మిస్టరీ వీడింది.;

Update: 2025-06-22 12:30 GMT

వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా ఈ నెల 18న గుంటూరు శివార్లలోని ఏటుకూరు వద్ద జరిగిన ప్రమాదం మిస్టరీ వీడింది. జగన్ కాన్వాయ్ ఢీకొని వైసీపీ కార్యకర్త సింగయ్య మరణించాడని గతంలో ప్రచారం జరిగింది. అయితే ఢీకొట్టింది జగన్ ప్రయాణిస్తున్న కారేనంటూ ఈ రోజు పోలీసులు వీడియో విడుదల చేయడం సంచలనం రేకెత్తిస్తోంది. అధినేత వాహనానికి ఎదురుగా వెళ్లి పూలు జల్లేందుకు ప్రయత్నించిన సింగయ్య ప్రమాదవశాత్తూ జగన్ కారు కింద పడినట్లు పోలీసులు విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాదం జరిగిన విషయం జగన్ కు తెలుసా? లేదా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

ఏటుకూరు వద్ద అభిమానులు వందలాదిగా గుమిగూడి ఉండటంతో జగన్ కారు నుంచి బయటకు వచ్చి అభివాదం చేశారు. జగన్ ఓ వైపు కార్యకర్తలకు అభివాదం చేస్తుండగా, డ్రైవర్ వైపు ఎదురుగా వచ్చి సింగయ్యను కారు ఢీకొట్టింది. ఆ తర్వాత ఆపకుండా అతడిపై నుంచి కారు వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో సింగయ్య తీవ్రంగా గాయపడినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ ప్రమాదానికి కారణం జగన్ కాన్వాయ్ కాదంటూ ఘటన జరిగిన నాడే పోలీసులు ప్రకటించడం విశేషం.

ప్రమాదానికి జగన్ కాన్వాయ్ కారణం కాదని, విజయవాడకు చెందిన AP26CE0001 నెంబరు గల టాటా సఫారీ వాహనమంటూ గుంటూరు ఎస్పీ సతీశ్ కుమార్ వెల్లడించారు. అయితే ముందుగా నిర్ధారించుకోకుండా ఎస్పీ ఇలా ఎలా ప్రకటించారని అంటున్నారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత వీడియో బయటకు రావడం, జగన్ వాహనం కిందే సింగయ్య పడినట్లు ఆ వీడియోలో కనిపిస్తుండటం సంచలనంగా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఘటనకు బాధ్యులను గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. అయితే ఘటన జరిగిన తర్వాత సింగయ్య కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించకపోవడంపైనా టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటివరకు జగన్ కాన్వాయ్ ఢీకొట్టడంతోనే సింగయ్య మరణించడాని చెబుతున్న టీడీపీకి తాజాగా బయటకు వచ్చిన వీడియో మరింత బలాన్ని చేకూర్చింది. ఈ ఘటనపై వైసీపీ ఎలాంటి వివరణ ఇస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

Tags:    

Similar News