రాజధానిపై జగన్ ఆలోచన మరి మారదా? చర్చిస్తామన్న బొత్స మాటలకు విలువలేనట్లేనా?

ఏపీ రాజధాని అమరావతి.. భవిష్యత్తులో ఎవరు వచ్చినా అమరావతి నుంచి రాజధానిని కదిలించలేరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే స్పష్టం చేస్తున్నారు.;

Update: 2025-05-23 13:20 GMT

ఏపీ రాజధాని అమరావతి.. భవిష్యత్తులో ఎవరు వచ్చినా అమరావతి నుంచి రాజధానిని కదిలించలేరు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే స్పష్టం చేస్తున్నారు. వైసీపీ పాలనలోని ఐదేళ్లు రాజధానిని అమరావతి నుంచి తరలించాలని విశ్వప్రయత్నం చేశారు. అయితే రాష్ట్రంలోని వైసీపీ మినహా మిగిలిన అన్నిపార్టీలు అమరావతి రాజధానికే కట్టుబడి పోరాటాలు చేశాయి. ఇక గత ఎన్నికల్లో వైసీపీ మూడు పార్టీల సిద్దాంతాన్ని ప్రజలు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. 151 సీట్ల నుంచి ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ పరిస్థితుల్లో అమరావతి పనుల పునఃప్రారంభానికి కొద్ది రోజుల ముందు వైసీపీలోని సీనియర్ నేత మండలిలోని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఓ కీలక ప్రకటన చేశారు. ‘‘అప్పటికి మా పార్టీ సిద్ధాంతం మూడు రాజధానులు.. ఇప్పుడు విధానమేంటో పార్టీలో చర్చించి చెబుతాం’’ అంటూ స్పష్టం చేశారు.

ఇలా బొత్స ప్రకటనతో రాజధానిపై వైసీపీ ఆలోచన మారుతుందా? అనే చర్చ జరిగింది. బొత్స ప్రకటన వచ్చి దాదాపు నెలరోజులు పైనే సమయం గడిచింది. వైసీపీలో రాజధానిపై ఎలాంటి చర్చ జరిగిందో లేదో కానీ, మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజధానిపై తన ఆలోచన మారలేదని సంకేతాలిచ్చారు. రాజధాని అమరావతి పునఃనిర్మాణంపై ప్రతిపక్ష నేత హోదాలో జగన్ ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేయొచ్చు. రాజధాని భూ కేటాయింపులు, నిధుల వినియోగం, ప్రణాళిక లోపాలు ఇలా ఆయన ఏది మాట్లాడినా ప్రజలు సానుకూలంగా అర్థం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కానీ, ఆయన ఇప్పటికీ అమరావతిలో రాజధాని అవసరం లేదన్నట్లే మాట్లాడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన జగన్ తన పాలన కాలంలో రాజధానిపై పూర్తి వ్యతిరేకత కనబరిచారని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. అదే జగన్ గురువారం మీడియాతో మాట్లాడుతూ చేసిన పలు వ్యాఖ్యలు ఆయన ద్వంద్వ నీతిని బయటపెడుతోందని ఆరోపిస్తున్నారు. తెలంగాణ సచివాలయానికి రూ.600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, అమరావతి కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరమేంటని జగన్ నిలదీస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు రూ.600 కోట్లు ఖర్చు చేశారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఐకానిక్ భవనాలు కడతామంటున్నారని, అలాంటి సమయంలో ఇప్పుడున్న భవనాలను ఏం చేస్తారని జగన్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ప్రశ్నలను ఆయన వేసేముందు జగన్ కూడా కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అంతేకాకుండా రాజధానికి నాగార్జున యూనివర్సిటీ వద్ద 500 ఎకరాలు సరిపోదా? అంటూ జగన్ నిలదీస్తున్నారు. అయితే జగన్ ప్రశ్నలన్నీ రాజధానిపై తన వ్యతిరేకతను వ్యక్తం చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జగన్ చెబుతున్నట్లు ప్రభుత్వం ఐకానిక్ భవనాలు నిర్మించి ప్రస్తుతం ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టును వృథాగా వదిలేస్తారా? అంటే దానికి ముందు తన పాలనకు ముందే రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు ఉన్నప్పుడు మూడు రాజధానుల రాగం ఆలపించడంలో వైసీపీ ఆలోచన ఏంటో చెప్పాల్సివుంటుందని అంటున్నారు. అంతేకాకుండా నాగార్జున వర్శిటీలో అందుబాటులో ఉన్న 500 ఎకరాల్లో రాజధాని నిర్మిస్తే సరిపోతుంది? కదా అంటూ జగన్ ఇచ్చిన సలహాపైనా విమర్శకులు మండిపడుతున్నారు. గుంటూరు-విజయవాడ మధ్యలో నాలుగు భవనాలు నిర్మిస్తే ఆ తర్వాత ఆ రెండు నగరాలు అభివృద్ధి చెందుతాయనే జగన్ వ్యాఖ్యను తీవ్రంగా తప్పుబడుతున్నారు. జగన్ ఆలోచనలో నిజాయితీ ఉంటే తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చు అవుతుందని చెబుతూ కాలక్షేపం చేసే బదులు.. నాగార్జున వర్సిటీ ఆ నాలుగు భవనాలు నిర్మించి రాజధాని ఇక్కడే కొనసాగేలా చేసివుండాల్సిందని అంటున్నారు. ఇప్పుడు ఈ తాజా ప్రతిపాదన తేవడం వెనుక తన అమరావతి వ్యతిరేక అజెండాయే ప్రధానమైనది కనిపిస్తోందని అంటున్నారు.

ఇదే సమయంలో తెలంగాణ సచివాలయానికి రూ.600 కోట్లు ఖర్చు చేసిన అంశాన్ని జగన్ ప్రస్తావించడం అవగాహనలోపంగా వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ సచివాలయం భవనాలను కూల్చివేసి అక్కడే కొత్త భవనాలు నిర్మించారు. అంతేకాకుండా అప్పటికే అక్కడ రోడ్లు, కాలువలు, కరెంటు, రవాణా వంటి మౌలిక వసతులు ఉన్న విషయాన్ని మరచిపోకూడదని అంటున్నారు. కానీ ప్రస్తుతం రాజధాని అంటే మూడు భవనాలు నిర్మించడం ఒక్కటే కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి స్థాయి ఉన్న నేత మరచిపోతే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజధాని అంటే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ మాత్రమే కాదని ఓ ప్రపంచ స్థాయి నగరాన్ని, భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే నవనగరాలను నిర్మించాలన్న ప్రతిపాదన విస్మరించకూడదని అంటున్నారు.

ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న పనులపై అభ్యంతరాలు ఉంటే వాటిని సూటిగా ప్రశ్నించడం ప్రతిపక్ష నేతగా జగన్ హక్కుగా భావించడంలో తప్పులేదని, కానీ ప్రజలు కావాలని కోరుకుంటున్న అమరావతిపై ఆయన ఆలోచన ఇంకా మారకపోవడమే విస్మయాన్ని కలిగిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మండలిలో ప్రతిపక్ష నేత బొత్స చెప్పినట్లు అమరావతిపై వైసీపీలో చర్చ జరిగిందా? లేదా? అన్నది తాజాగా చర్చకు వస్తోంది. వైసీపీ అధినేతగా జగన్ ఏం చెబితే అదే ఫైనల్, అయితే పార్టీలో ఓ ప్రధాన నేత తమ పార్టీలో ఒక అంశంపై చర్చిస్తామని చెప్పినప్పుడు ఆ కార్యక్రమం నిర్వహించిందీ? లేనిదీ? కూడా ప్రజలకు తెలియజేయాల్సివుంటుందని అంటున్నారు. ఇప్పటికీ, ఎప్పటికీ అమరావతిని వ్యతిరేకిస్తామనే ఆలోచనే ఉంటే నేరుగా పార్టీ సమావేశంలో ఆ మేరకు తీర్మానం చేసి తాము రాజధాని అమరావతి నిర్మాణానికి వ్యతిరేకం అన్న ప్రకటన ఇప్పటికైనా చేస్తే బాగుంటందని, రాష్ట్ర ప్రజల అభిమతం అదే అయితే 2029 ఎన్నికల్లో అదే అజెండాగా ప్రజా తీర్పు ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News