ఇరాన్ లో అగ్నికిలలు... 11 భారీ గ్యాస్ నిల్వల ట్యాంకులు ఒకేసారి పేలితే...!
పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావారణం గంటగంటకూ పెరిగిపోతోంది. ఏ క్షణం ఏమి జరుగుతుందోనని ఇరు దేశాల ప్రజలు వణికిపోతున్నారు.;
పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావారణం గంటగంటకూ పెరిగిపోతోంది. ఏ క్షణం ఏమి జరుగుతుందోనని ఇరు దేశాల ప్రజలు వణికిపోతున్నారు. ప్రధానంగా ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ లో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నారు. వారాంతంలో సైతం ఇళ్లల్లోనుంచి బయటకు వచ్చే ధైర్యం చేయలేకపోతున్నారు! ఈ సమయంలో మరో షాకింగ్ ఘటన జరిగింది.
అవును... ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు ఏమాత్రం తగ్గకుండా.. ఇరు దేశాల మనుగడను ప్రశ్నార్థకం చేసే యుద్ధంగా భావిస్తున్న ఈ పోరాటంలో ఫైట్ చేస్తున్నారు. ఈ సమయంలో.. ఇరాన్ దేశ ప్రధాన ఆర్థిక జీవనాడి అయిన 'ది సౌత్ పార్స్' క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది.
వాస్తవానికి "ది సౌత్ పార్స్" అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. ఇదే సమయంలో టెహ్రాన్ లోని ఇరాన్ అణు కేంద్రాలు సహా 150కి పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో.. ఒక్కసారిగా టెహ్రాన్ లో అగ్నికిలలు ఆకాశానికి అంటాయని చెబుతున్నారు. ప్రస్తుతానికి జనావాసాలపై ఈ దాడులు జరగలేదని అంటున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఇరాన్ చమురు మంత్రిత్వ శాఖ అధికారులు.. ఇజ్రాయెల్ దాడుల్లో షహ్రాన్ లోని భారీ గ్యాస్ క్షేత్రం ధ్వంసమయ్యిందని తెలిపారు. ఇందులోని 11 గ్యాస్ నిల్వ ట్యాంకులు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోయాయని తెలిపారు. దీంతో... భారీగా అగ్నికీలలు ఎగసిపడుతున్నాయని.. దీనివల్ల సమీప నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అన్నారు.
ఈ గ్యాస్ క్షేత్రాలు ఇరాన్ కు ఆర్థికంగా అత్యంత కీలకమైన వాటిలో ఒకటని అంటారు. అలాంటి గ్యాస్ క్షేత్రాలు ధ్వంసమవ్వడంతో.. అది ఆ దేశ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. తాజాగా.. ఓ నివాస భవనాన్ని ఇజ్రాయెల్ క్షిపణి లక్ష్యంగా చేసుకోవడంతో 29 మంది పిల్లలతో సహా 60 మంది మరణించినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు.
కాగా... గురువారం మొదలైన ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య దాడులు శనివారం మరింత తీవ్రంగా కొనసాగాయి. ఈ సమయంలో టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు, క్షిపణులతో ఇజ్రాయెల్ విరుచుకుపడగా.. టెల్ అవీవ్ పై ఇరాన్ వందల క్షిపణులతో విరుచుకుపడింది. ఇందులో కొన్ని ప్రత్యేక క్షిపణులు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ను ఛేదించుకుని వెళ్లినట్లు చెబుతున్నారు.