ఇజ్రాయెల్‌ రహస్య దాడుల వ్యూహం: బాడీగార్డుల నిర్లక్ష్యమే కీలకం..!

ఇరాన్‌పై ఇటీవల జరిగిన సీక్రెట్ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌ అత్యంత వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. ఈ దాడుల వెనుక ఉన్న నిదర్శనాలు, పద్ధతులు, మరియు లక్ష్యాల ఎంపిక ఈ చర్యను అత్యంత తీవ్రమైన దాడులలో ఒకటిగా నిలబెట్టాయి.;

Update: 2025-09-01 08:30 GMT

ఇరాన్‌పై ఇటీవల జరిగిన సీక్రెట్ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌ అత్యంత వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. ఈ దాడుల వెనుక ఉన్న నిదర్శనాలు, పద్ధతులు, మరియు లక్ష్యాల ఎంపిక ఈ చర్యను అత్యంత తీవ్రమైన దాడులలో ఒకటిగా నిలబెట్టాయి. ప్రధానంగా, ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌ దృష్టి సైనిక, రాజకీయ నాయకత్వంపై కాక, వారి రక్షక బృందాల (బాడీగార్డులు) పైనే మొదట పడింది – ఇదే ఈ వ్యూహానికి కీలకాంశం.

బాడీగార్డుల ఫోన్లే కీలక లింక్‌గా..

ఇరాన్‌ సైనిక, రాజకీయ ప్రముఖులు స్మార్ట్‌ఫోన్ల వాడకాన్ని క్రమంగా తగ్గించడంతో, వారి కదలికలను నిఘా పెట్టడం ఇజ్రాయెల్‌కు కష్టంగా మారింది. అయితే, బాడీగార్డుల వినియోగం మాత్రం మునుపటిలానే కొనసాగింది – ఫోన్లు, సోషల్ మీడియా యాక్టివిటీలు వదలకపోవడం, వారి ద్వారా ట్రాకింగ్‌కు అవకాశమిచ్చింది.

జూన్‌ 13న జరిగిన మొదటి దాడిలోనే ఇజ్రాయెల్‌ అత్యున్నత స్థాయి ఇరానియన్‌ రక్షణాధికారులను లక్ష్యంగా చేసుకొని వారిని మట్టుబెట్టింది. ఐఆర్‌జీసీ చీఫ్‌ సలామీ, ఆర్మీ చీఫ్‌ బాఘేరీ, మిసైల్స్‌ విభాగాధిపతి హజిజాదే వంటి కీలక నేతలు ఈ దాడుల్లో హతమయ్యారు.

సంకేతాల ఆధారంగా బంకర్‌ దాడి

జూన్‌ 16న జరిగిన ఓ కీలక భద్రతా సమావేశ సమయంలో, ఒక బాడీగార్డ్‌ ఫోన్‌ వాడటం ద్వారా ఇజ్రాయెల్‌కు కీలక సమాచారం లభించింది. దీని ఆధారంగా, భూమికి 100 అడుగుల లోతులో ఉన్న రహస్య బంకర్‌పై దాడి జరిగింది. ఈ బంకర్‌లో ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ సమావేశం జరుగుతుండగా, అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌తో పాటు న్యాయ, గూఢచార సంస్థల అధికారులు హాజరై ఉన్నారు.

ఈ దాడిలో పెజెష్కియాన్‌కు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతరులు సమయస్ఫూర్తితో బయటపడినప్పటికీ, రక్షణ సిబ్బందిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

అణు శాస్త్రవేత్తల జాబితాపై ప్రత్యేక దృష్టి

ఇజ్రాయెల్‌ యొక్క ఈ ఆపరేషన్‌ వ్యూహం కేవలం సైనికాధికారులకే పరిమితం కాలేదు. ఇరాన్‌ అణు శాస్త్రవేత్తలను కూడా కీలక టార్గెట్లుగా ఎంపిక చేయడం జరిగింది. 2022 నుంచే శాస్త్రవేత్తల ప్రొఫైల్స్‌ను సేకరించడం మొదలైంది. 2018లో ఇరాన్‌ నుంచి అపహరించిన అణు సమాచార ఆధారంగా, మొదటగా 400 మందిని గుర్తించారు. వీరిలో చివరకు 100 మందిని ఎంపిక చేసి, మొత్తం 13 మందిని హత్య చేసినట్లు సమాచారం.

ఆపరేషన్‌ రెడ్‌ వెడ్డింగ్‌’ లోతైన వ్యూహం

ఇరాన్‌ సైనిక నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ ఆపరేషన్‌కు 'రెడ్‌ వెడ్డింగ్‌' అనే కోడ్‌ నామం పెట్టడం గమనార్హం. ఈ దాడుల కారణంగా, ఇరాన్‌ 1980లో ఇరాక్‌తో జరిగిన యుద్ధం తర్వాత ఇదే స్థాయిలో తీవ్రమైన ఆర్థిక, సైనిక నష్టాలను ఎదుర్కొంది. యుద్ధం అనంతరం మొస్సాద్‌ కోసం పని చేస్తున్న అనేకమంది గూఢచారులను ఇరాన్‌ అరెస్టు చేసింది. వారిలో ప్రముఖ అణు శాస్త్రవేత్త రుజ్‌బెహ్‌ వాది ఉన్నారు. అతనికి మరణదండన విధించారు. మిగిలిన ఎనిమిది మందిని కూడా ప్రస్తుతం విచారిస్తున్నట్టు టెహ్రాన్‌ వెల్లడించింది.

ఏఐ నిఘా..మానవ లోపాలు

ఈ గోప్యంగా నిర్వహించిన ఆపరేషన్‌ ద్వారా, టెక్నాలజీ ఆధారిత నిఘా, మానవ లోపాలను గుర్తించి వినియోగించడం ద్వారా ఇజ్రాయెల్‌ ఎలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లిందో స్పష్టమవుతుంది. ఇదే సమయంలో, రక్షణ వ్యవస్థలలో చిన్నచిన్న లోపాలు ఎంతటి తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చో ఈ ఘటన బలమైన ఉదాహరణగా నిలుస్తుంది.

Tags:    

Similar News