ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా దాడి.. ఇక యుద్ధ‌మే!

ఇజ్రాయెల్ -అమెరికా దాడుల రీత్యా.. ఇరాన్ అత్యున్న‌త నేత (సుప్రీం లీడ‌ర్) ఆయ‌తుల్లా ఖ‌మేనీ ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది తెలియాల్సి ఉంది.;

Update: 2026-02-28 07:06 GMT

ప్ర‌పంచం ఆందోళ‌న చెందుతున్న‌ట్లే.. అనుకున్నంత అయింది... ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడికి దిగింది.. అది కూడా అమెరికా అండ‌తో..! త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా అన్న‌ట్లుగా.. నేరుగా క‌ల్పించుకోకుండా ఇజ్రాయెల్ ను క‌లుపుకొని శ‌త్రుదేశ‌మైన ఇరాన్ ను అమెరికా టార్గెట్ చేసింది. శ‌నివారం ఇజ్రాయెల్... ఇరాన్ రాజ‌ధాని టెహ్రాన్ పై క్షిప‌ణులు, డ్రోన్ల‌తో దాడుల‌కు దిగింది. దీన్ని ఇజ్రాయెల్ ర‌క్ష‌ణ మంత్రి క‌ట్జ్ ధ్రువీక‌రించారు. త‌మ దేశానికి ముప్పు త‌లెత్త‌కుండా ముందుజాగ్ర‌త్త‌గానే చ‌ర్య‌ల‌కు దిగిన‌ట్లు కూడా స్ప‌ష్టం చేశారు. ఇజ్రాయెల్ దాడుల‌తో టెహ్రాన్ లో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఇదంతా చూస్తుంటే, ప్ర‌పంచంలో మ‌రో యుద్ధం మొద‌లైంద‌న్న మాట‌..! ఇప్ప‌టికే ర‌ష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్- హ‌మాస్, పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ (శుక్ర‌వారం మొద‌లైంది) జ‌రుగుతున్న స‌మ‌యంలో.. ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా దాడికి దిగ‌డం ఇంకెంత సంక్షోభానికి కార‌ణం అవుతుందో?

ట్రంప్ చెప్పిన‌ట్లే..

త‌మతో అణు ఒప్పందంపై ప‌ది రోజుల్లోగా చ‌ర్చ‌ల‌కు రాకుంటే, ఇరాన్ పై చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఈ నెల 19న అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప్ర‌క‌టించారు. ఆ గ‌డువు ముగియ‌డంతోనే శ‌నివారం దాడుల‌కు దిగిన‌ట్లు తెలుస్తోంది. ఇక ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఇజ్రాయెల్ త‌మ పౌరుల‌కు హై అల‌ర్ట్ జారీచేసింది. ఇరాన్ ప్ర‌తిదాడుల ప్ర‌మాదం పొంచి ఉండ‌డంతో దేశంలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించింది. పౌరులంతా సుర‌క్షిత ప్రాంతాల‌కు వెళ్లాల‌ని ఆదేశించింది. అంతేగాక‌, ఇజ్రాయెల్ త‌మ గ‌గ‌న త‌లాన్ని మూసివేసింది. పౌర విమానాల రాక‌పోక‌ల‌ను నిలిపివేసింది.

ఖ‌మేనీ ఎక్క‌డ‌..?

ఇజ్రాయెల్ -అమెరికా దాడుల రీత్యా.. ఇరాన్ అత్యున్న‌త నేత (సుప్రీం లీడ‌ర్) ఆయ‌తుల్లా ఖ‌మేనీ ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల కింద‌ట‌న ఆయ‌న చ‌నిపోయిన‌ట్లుగా క‌థ‌నాలు వ‌చ్చాయి. కానీ, అవేమీ నిర్ధార‌ణ కాలేదు. ఇప్పుడు నేరుగా యుద్ధ వాతావ‌ర‌ణ‌మే ఉండ‌డంతో ఖ‌మేనీ సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లివెళ్లి ఉండొచ్చు. ఇప్ప‌టికే ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు పంపించార‌ని తెలుస్తోంది.

అటు ఆందోళ‌న‌లు.. ఇటు యుద్ధం..

ఇరాన్ లో డిసెంబ‌రులో ప్ర‌జా ఉద్య‌మం పెద్ద ఎత్తున చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. పౌరులు వీధుల్లోకి వ‌చ్చి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ల‌కు దిగారు. 7 వేల మందిపైగా చ‌నిపోయిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఇంకా ఈ సంఖ్య ఎక్కువే ఉంటుంద‌ని కూడా భావించారు. ఇప్పుడు ఇజ్రాయెల్-అమెరికా దాడుల‌తో ఇరాన్ ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా మార‌నుంది.

పూర్తి యుద్ధ‌మా?

ఇజ్రాయెల్-అమెరికాలు పూర్తిస్థాయిలో ఇరాన్ పై యుద్ధానికి దిగుతాయా? అన్న‌ది చూడాలి. లేదా అణుకేంద్రాలు, సైనిక స్థావ‌రాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని వ‌దిలేస్తాయా? అనేది తేలాలి. ఏది ఏమైనా.. రంజాన్ ప‌విత్ర మాసంలో ఈ విధంగా ఇరాన్ పై ఇజ్రాయెల్-అమెరికా దాడి చేస్తాయ‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. ముస్లిం ప్ర‌పంచంలో పాకిస్థాన్ త‌ర్వాత రెండో అణు శ‌క్తి దేశంగా ఆవిర్భ‌వించేందుకు ఇరాన్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. దీనిని అమెరికా, ఇజ్రాయెల్ గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తున్నాయి. అదే ఇప్పుడు దాడుల‌కు కార‌ణ‌మైంది. పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తే మాత్రం ప్ర‌పంచం పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డిన‌ట్లే.

Tags:    

Similar News