అమెరికాకు ఇరాన్ గట్టి షరతులు
ఒకవైపు అమెరికాతో అణు ఒప్పందం అంశంపై చర్చలు సాగుతుండగానే.. మరోవైపు ఇరాన్ గట్టి షరతులు విధించింది.;
ఒకవైపు అమెరికాతో అణు ఒప్పందం అంశంపై చర్చలు సాగుతుండగానే.. మరోవైపు ఇరాన్ గట్టి షరతులు విధించింది. అణు చర్చలు అర్థవంతంగా కొనసాగాలంటే తమపై భవిష్యత్తులో ఎలాంటి దురాక్రమణలు జరగవు అనే హామీ అవసరమని స్పష్టం చేసింది. భారత్‌లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు తెలిపారు. “భవిష్యత్తులో ఇజ్రాయెల్ లేదా అమెరికా ఇరాన్‌పై ఎలాంటి దాడులకు పాల్పడబోమని బలమైన, విశ్వసనీయ హామీ ఇచ్చినపుడే చర్చలకు అర్థం ఉంటుంది” అని ఎలాహి తెలిపారు. ఇటీవల ఇజ్రాయెల్ చేపట్టిన "ఆపరేషన్ రైజింగ్ లయన్" పేరిట జరిగిన దాడులను ఆయన ప్రస్తావించారు. ఈ దాడుల్లో అనేకమంది శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, సైనికాధికారులు, సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు.
- ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు
ఇజ్రాయెల్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఎలాహి వ్యాఖ్యానించారు. “టెల్ అవీవ్ వద్ద ఇప్పటికీ అణ్వాయుధాలు ఉన్నాయి. అయినప్పటికీ వారు అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందానికి (NPT) సంతకం చేయలేదు. అలాంటి దేశం అణ్వాయుధాలు కలిగి ఉండటమే అన్యాయం.. అదే సమయంలో ఇరాన్‌పై దాడులు చేయడం ద్వంద్వ ధోరణి.” అని స్పష్టం చేశారు. ఇరాన్‌పై జరిపిన దాడులు ఐక్యరాజ్యసమితి చట్టాలకు విరుద్ధమని ఎలాహి పేర్కొన్నారు. మూడు అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను ఆయన “దుందుడుకు చర్య”గా అభివర్ణించారు. ఇజ్రాయెల్‌తో చేతులు కలిపి ఈ దాడులు జరగడం దౌత్య సంబంధాలను దెబ్బతీసే చర్యగా అభిప్రాయపడ్డారు.
- శాంతియుత దృక్పథాన్ని మళ్లీ స్పష్టం చేసిన ఇరాన్
చరిత్రలో ఇరాన్ ఎప్పుడూ ఎలాంటి దేశంపైనా దాడికి పాల్పడలేదని ఎలాహి స్పష్టం చేశారు. గాజా విషయంలో కూడా తాము శాంతియుతంగా స్పందించామన్నారు. “ఇరాన్ ఎల్లప్పుడూ దౌత్యానికి సిద్ధంగా ఉంది. కానీ ఆ దౌత్యం గౌరవం పొందాలంటే, ముందుగా భద్రత హామీలు ఇవ్వాలి,” అని ఆయన అన్నారు.
ఈ ప్రకటనలతో అమెరికా-ఇరాన్ సంబంధాలు మళ్లీ వేడెక్కే అవకాశం ఉంది. ఒకవైపు చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెబుతూనే, మరోవైపు కఠినమైన షరతులు పెట్టడం ద్వారా ఇరాన్ తన భద్రతపై గట్టి ఆందోళనలున్నట్టు వెల్లడించింది. భవిష్యత్తులో ఈ చర్చలు ఏ దిశలో సాగుతాయో చూడాలి.