ఇరాన్..అణు ఉరుములు..ఉరి ఉరుకులు.. 9 నెలల్లో వెయ్యిశిక్షలు
అప్పట్లో అమెరికా కూడా జోక్యం చేసుకుంది. ఇరాన్ తన అణు కార్యక్రమాలను నిలిపివేయాలని హెచ్చరించింది.;
పశ్చిమాసియాలో అత్యంత కీలకమైన దేశం ఇరాన్...! పాకిస్థాన్ తర్వాత ముస్లిం దేశాల్లో అణుబాంబు కలిగిన రెండో దేశంగా ఆవిర్భవించాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది..! కానీ, ఓవైపు అమెరికా ఆంక్షలు.. మరోవైపు ఇజ్రాయెల్ దాడులతో దాని లక్ష్యాలు నెరవేరడం లేదు. కొన్ని నెలల కిందట ఇరాన్ అణు కార్యక్రమాలను ధ్వంసం చేసిందనే కథనాలు వచ్చాయి. అప్పట్లో అమెరికా కూడా జోక్యం చేసుకుంది. ఇరాన్ తన అణు కార్యక్రమాలను నిలిపివేయాలని హెచ్చరించింది.
అంతా ఆయన చేతుల్లోనే...
ఇరాన్ కు అధ్యక్షుడు ఉన్నప్పటికీ.. సుప్రీం లీడర్ అలీ ఖమేనీనే. అందుకే ఇజ్రాయెల్ దాడుల సమయంలో ఖమేనీని టార్గెట్ చేసింది. అప్పట్లో ఖమేనీ అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారు. మళ్లీ ఆయన వాయిస్ వినిపించలేదు. తాజాగా ఖమేనీ తన గళం వినిపించారు. అణు కార్యక్రమాలను నిలిపివేయాలంటూ అమెరికా చేస్తున్న బెదిరింపుల మధ్య ఆ దేశంతో చర్చలు కొనసాగించి ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో యురేనియం నిల్వలు అత్యధికంగా ఉన్న పది దేశాల్లో ఇరాన్ ఒకటి అని ఖమేనీ అన్నారు. అయితే, మిగతా 9 దేశాల వద్ద అణుబాంబులు ఉన్నాయని, తమ వద్దనే లేదని పేర్కొన్నారు. యురేనియం శుద్ధి ప్రక్రియ కొనసాగిస్తున్నామని... అణ్వాయుధాలు వాడే ఉద్దేశం లేదని మాత్రం స్పష్టం చేశారు.
అమెరికాకు లొంగం..
ఖమేనీ ప్రస్తుత వ్యాఖ్యలను బట్టి చూస్తే.. అమెరికా హెచ్చరికలను పట్టించుకోకుండా ఇరాన్ తన అణు శుద్ధి కార్యక్రమాలను కొనసాగించే అవకాశమే ఉన్నట్లు భావించాలి. తద్వారా అణ్వస్త్ర దేశంగానూ అవతరించే ప్రయత్నం చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, అది ఎంతవరకు ముందుకెళ్తుంది? అన్నది చూడాలి.
రోజుకు 9... వారంలో 64 ఉరిశిక్షలు
ఇరాన్ సంప్రదాయ దేశంగా మారాక కఠిన శిక్షలు అమలు చేస్తోంది. ఇలానే కొన్ని సంవత్సరాలు ఉరి శిక్షలను పెద్ద సంఖ్యలో విధిస్తోంది. తాజాగా అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల లెక్కల ప్రకారం ఇరాన్ రోజుకు 9, వారంలో 64 ఉరిశిక్షలు అమలు చేస్తోంది అని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇరాన్ మానవ హక్కుల బృందమే వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటికే వెయ్యిమందిని ఉరితీసిందట.
-మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని రీతిలో ఇరాన్ లో మరణ శిక్షలు అమలవుతున్నట్లు హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిరుడు 975 మంది ఉరి వేయగా... ఈ ఏడాది 9 నెలల్లోనే ఆ సంఖ్య వెయ్యి దాటిందనే కథనాలు వస్తున్నాయి. ఇంకా బయటకు రాని లెక్కలు చాలా ఉన్నాయని హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి.
-ఇదివరకు ఇరాన్ వేర్వేరు రకాలుగా మరణ శిక్షలు అమలు చేసేది. ఇప్పుడు మాత్రం ఎక్కువ శాతం ఉరి శిక్షలేనని తెలుస్తోంది. బహిరంగ ఉరి కూడా ఉందని చెబుతున్నారు. వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక మరణ శిక్షలు చైనా అమలు చేస్తోంది. కానీ, దీని లెక్కలు బయటకు రావడం లేదు. ఆ తర్వాతి స్థానం ఇరాన్ ది అని చెబుతున్నారు. ఈ లెక్కన చైనాలో ఏటా వెయ్యి పైగా మరణ శిక్షలు విధిస్తున్నట్లు అంచనా వేయొచ్చు.