కాపులు - దళితులు వర్సెస్ సునీల్.. !
వాస్తవానికి సునీల్ విషయాన్ని ఒకింత పక్కన పెడితే.. కాపులకు రాజ్యాధికారం.. దళితులకు రాజ్యాధికారం అనే మాటలు మనకు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రానికి కొత్తకాదు.;
ప్రస్తుతం సోషల్ మీడియాలో పలువురు మేధావుల నుంచి వర్ధమాన జర్నలిస్టులు, సెల్ఫ్ స్టైల్డ్ జర్నలిస్టుల వరకు.. మొత్తంగా.. ఏకైక అజెండానా అన్నట్టుగా ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై చర్చోపచర్చలు చేస్తున్నారు. ``దళితులు-కాపులు ఏకం కావాలి. తద్వారా రాజ్యాధికారం దక్కించుకోవాలి!`` అన్నది ఐపీఎస్ అధికారి సునీల్ చేసిన వ్యాఖ్య. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కీలక అంశంగా మారింది. దాని చుట్టూనే భారీ చర్చలు జరుగుతున్నాయి.
వాస్తవానికి సునీల్ విషయాన్ని ఒకింత పక్కన పెడితే.. కాపులకు రాజ్యాధికారం.. దళితులకు రాజ్యాధికారం అనే మాటలు మనకు ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రానికి కొత్తకాదు. 2007లో ప్రజారాజ్యం పునాదులు ఎక్కడ నుంచి పడ్డాయో తెలుసు. దీనికి ముందు.. వంగవీటి మోహన్ రంగా 1980లలోనే ఉద్యమం తీసుకువచ్చి.. `కాపు నాడు` పేరుతో నిర్వహించిన సమావేశాలు.. సభలు.. గుర్తుండే ఉంటుంది. అంతకు ముందు కూడా.. ముద్రగడ పద్మనాభం, దాసరి నారాయణరావు వంటివారు.. చేసిన ప్రయత్నాలు కూడా తెలిసిందే.
వీరంతా ఎవరికోసం ఉద్యమించారు? ఎవరి కోసం.. రోడ్డెక్కారో.. కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక, దళితుల విషయాన్ని తీసుకుంటే.. తొలినాళ్లలో మందకృష్ణ మాదిగ నుంచి శివాజీ వరకు.. దీని కి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కాకా(వెంకట స్వామి) వంటి వారు కూడా.. రాజ్యాధికార నినాదాన్ని వినిపించిన వారే. సో.. నాడైనా ఇప్పుడైనా.. ఈ రెండు సామాజిక వర్గాలు.. రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్నాయి. కాకపోతే.. ఇప్పుడు ఈ రెండు సామాజిక వర్గాలను ఏకం చేయాలన్నది.. ఒక ప్రయత్నం.
అయితే.. సునీల్ కుమార్ ఐపీఎస్ కావడం, ఆయన గతంలో వివాదాల చుట్టూ పెనవేసుకుని తన కెరీర్‌ను ముందుకు తీసుకువెళ్లడంతో ఆయన చేసిన వ్యాఖ్యలు.. వివాదం అయ్యాయి. ఇదిలావుంటే.. దళితులు-కాపుల ఐక్యత సాధ్యమయ్యేనా? అనేది ప్రశ్న. ఏ సామాజిక వర్గం అయినా ప్రధానంగా అధికారమే ధ్యేయం గా పనిచేస్తుందన్నది వాస్తవం. అయితే.. అప్పట్లోనే కాపులు ఏకం కాలేకపోయారన్నది చరిత్ర చెబుతున్న విషయం. ఇక, దళితుల్లోనూ ఇప్పటికీ విభజన ఉంది. ఈ నేపథ్యంలో అసలు.. ఈ రెండు సామాజిక వర్గాలు కలిసి కట్టుగా ఎలా ముందుకు సాగుతాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సో.. సునీల్ వాదన ఎలా ఉన్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం దీనికి భిన్నంగానే ఉంది.