కావ్య కృష్ణారెడ్డి అప్పుడలా.. ఇప్పుడిలా.. ఎందుకలా ..!
కావలి ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు కావ్య కష్ణారెడ్డి (దగ్గుమాటి వెంకట కృష్నారెడ్డి)పై టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. ఆ పార్టీ నేత, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర అసహనంతో ఉన్నారు.;
కావలి ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు కావ్య కష్ణారెడ్డి (దగ్గుమాటి వెంకట కృష్నారెడ్డి)పై టీడీపీ అధినేత చంద్రబాబు సహా.. ఆ పార్టీ నేత, పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ విష యాన్ని నేరుగా బయటకే చెబుతు న్నారు. అంతేకాదు.. తీవ్ర స్థాయిలోఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలా ఎందుకు జరిగింది? విషయం ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. పార్టీ వర్గాల్లో ఈ విషయంపై చర్చ సాగుతోంది.
2024 ఎన్నికల్లో టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుని పారిశ్రామిక వేత్త, కాంట్రాక్టర్‌గా ఉన్న కావ్య కృష్ణారెడ్డికి టికెట్ ఇచ్చింది. అయితే.. వాస్తవానికి ఈ టికెట్‌ను సుబ్బానాయుడు ఆశించారు. ఆయనకే టికెట్ వస్తుంద ని అందరూ అనుకున్నారు. కానీ, చివరి నిముషంలో పోటీని గుర్తించిన చంద్రబాబు.. కావ్యకు అవకాశం కల్పించారు. ఆయన గెలుపునకు సుబ్బానాయుడు కూడా కృషి చేయాలని అప్పట్లో చంద్రబాబు చెప్పారు. ఆయన అలానే సహకరించారు.
అయితే.. తర్వాత పరిణామాల్లో సుబ్బానాయుడును పక్కన పెట్టేసినట్టు కావ్య కృష్ణారెడ్డిపై విమర్శలు వచ్చాయి. అంతేకాదు.. తమకు కనీసం అప్పాయింట్‌మెంటు కూడా ఇవ్వడం లేదని సుబ్బానాయుడు ఆరోపించారు. ఈ పరిణామాలు ఇరు వర్గాల మధ్య తీవ్ర వివాదాలకు దారితీశాయి. అంతేకాదు.. కొందరు పొరుగు పార్టీల నాయకులతోనూ కావ్యకు సంబంధాలు ఉన్నాయన్న చర్చ కూడా తెరమీదికి వచ్చింది. ఒక సందర్భంగా మంత్రి నారాయణ జోక్యం చేసుకుని సరిదిద్దినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిణామాల క్రమంలోనే సుబ్బానాయుడు అనారోగ్యం బారిన పడి మృతి చెందారు. అయితే.. ఆ సమయంలోనూ కావ్య కృష్ణారెడ్డి ఆయనను పట్టించుకునేందుకు ప్రయత్నించలేదన్న వాదన ఉంది. ఈ విషయాన్ని తాజాగా నారా లోకేష్ ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వడమే కాకుండా.. గెలుపు కోసం కూడా ప్రయత్నించిన.. సుబ్బానాయుడిని గాలికి ఎలా వదిలేస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారమే కావ్యకు.. పార్టీ అధిష్టానానికి దూరం పెంచింది. ఈ పరిణామం ఒక్క కావలిలోనే కాదు.. అనేక నియోజకవర్గాల్లో ఉంది. ఇప్పటికైనా నాయకులు మారితేనే వచ్చే ఎన్నికల్లో తిరిగి టికెట్ దక్కించుకుంటారన్న చర్చ సాగుతుండడం గమనార్హం.