ఇండిగో సంక్షోభం: ఢిల్లీ ఆర్థిక వ్యవస్థకు రూ.1000 కోట్ల భారీ నష్టం!
సీటీఐ చైర్మన్ బ్రిజేశ్ గోయల్ ఈ పరిస్తితిపై స్పందిస్తూ.. విమానాల రద్దు కారణంగా ఢిల్లీకి వచ్చే వ్యాపారులు (ట్రేడర్స్), పర్యాటకులు , బిజినెస్ ట్రావెలర్స్ సంఖ్య తీవ్రంగా తగ్గిందని తెలిపారు.;
దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో ఇటీవల తలెత్తిన సంక్షోభం కారణంగా ఢిల్లీ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడింది. కేవలం వారం రోజుల్లోనే ఢిల్లీలోని వివిధ వ్యాపార రంగాలు దాదాపు రూ.1000 కోట్ల నష్టాన్ని చవిచూశాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ఆందోళన వ్యక్తం చేసింది.
ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన సుమారు 900 మంది ఉద్యోగులు ఒకేసారి సెలవు పెట్టడం.. దాని ఫలితంగా అనేక విమానాలు రద్దు లేదా ఆలస్యం కావడం ఈ సంక్షోభానికి ప్రధాన కారణం. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థల్లో ఒకటైన ఇండిగో సేవల్లో అంతరాయం కలగడంతో ఢిల్లీకి రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
*తగ్గిన ట్రేడర్స్, పర్యాటకుల సంఖ్య
సీటీఐ చైర్మన్ బ్రిజేశ్ గోయల్ ఈ పరిస్తితిపై స్పందిస్తూ.. విమానాల రద్దు కారణంగా ఢిల్లీకి వచ్చే వ్యాపారులు (ట్రేడర్స్), పర్యాటకులు , బిజినెస్ ట్రావెలర్స్ సంఖ్య తీవ్రంగా తగ్గిందని తెలిపారు. వారం రోజుల్లోనే ఢిల్లీలోని హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్టుల్లో చాలా బుకింగ్స్ రద్దయ్యాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో జరిగే ఆటోమొబైల్స్ ప్రదర్శనలు, హోం నీడ్స్ ఎగ్జిబిషన్లు, చేనేత వస్త్రాల ప్రదర్శనలకు సందర్శకులు కరువయ్యారు అని వివరించారు.
విమానయాన రంగంలో సమస్యలు తలెత్తడం , సరైన సమయంలో గమ్యస్థానాలకు చేరుకోలేకపోవడం వంటి భయాలతో అనేక మంది ప్రయాణాలు, బుకింగ్ లు రద్దు చేసుకున్నారు. దీని ప్రభావం కేవలం విమానయాన సంస్థపైనే కాకుండా దానిపై ఆధారపడిన ట్రేడ్ అండ్ హాస్పిటాలిటీ రంగాలపై కూడా స్పష్టం గా పడింది.
తక్షణమే ఈ సంక్షోభం పరిష్కారమై, విమాన సేవలు సాధారణ స్థితికి రావాలని ఢిల్లీ వ్యాపార వర్గాలు కోరుకుంటున్నాయి.
ఇండిగో సేవల్లో ఈ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఉండేందుకు సంస్థ కార్యకలాపాలను క్రమబద్ధీకరించేందుకు అన్ని మార్గాల్లో విమాన సర్వీసులను తగ్గించాలని 10 శాతం కోత విధిస్తూ నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి తెలిపారు.అయితే ఈ కోత ఉన్నప్పటికీ మునుపటిలానే అన్ని గమ్యస్థానాలను కవర్ చేయాలని విమానయాన సంస్థను ఆదేశించారు. చార్జీలపై పరిమితి, ప్రయాణికుల సౌకర్యానికి సంబంధించి మంత్రిత్వశాఖ ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఇండిగో యాజమాన్యాన్ని మంత్రి రామ్మోహన్ నాయుడు నిన్న కఠినంగా ఆదేశించారు.