ఇదేమైనా స్కూటరా? ఇండిగో ఫ్లైట్ లో ఇంధనం అయిపోవటమేంది సామీ?
అందరూ కాదు కానీ కొందరికి ఎదురయ్యే అనుభవం.. బైక్ నడుపుతున్న వేళ పెట్రోల్ అయిపోవటం. ముందస్తు జాగ్రత్తలు లేనప్పుడే ఇలా జరుగుతుంది.;
అందరూ కాదు కానీ కొందరికి ఎదురయ్యే అనుభవం.. బైక్ నడుపుతున్న వేళ పెట్రోల్ అయిపోవటం. ముందస్తు జాగ్రత్తలు లేనప్పుడే ఇలా జరుగుతుంది. స్కూటర్ అంటే రోడ్డు మీద ఆగుతుంది. దాన్ని పక్కన తీసుకెళ్లి పెడితే సరిపోతుంది. గాల్లో ఎగిరే విమానం.. తన గమ్యస్థానానికి ముందే ఆకాశంలో విమానంలో ఇంధనం అయిపోతే సంగతేంటి? అసలు అలా ఆలోచించగలమా? అలా జరిగే అవకాశం ఉంటుందా?
కానీ.. అలాంటి షాకింగ్ అనుభవాన్ని మిగిల్చింది ఇండిగోకు చెందిన ఒక విమానం. గువాహటి నుంచి చెన్నై వెళ్లాల్సిన ఇండిగో విమానం మార్గమధ్యంలో బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. దీనికి కారణం.. ఇంధనం తగినంత లేకపోవటమే. 168 మంది ప్రయాణికులు.. సిబ్బందితో బయలుదేరిన విమానంలో ఇంధనం వేగంగా తగ్గిపోతున్నట్లు గుర్తించిన పైలెట్ వెంటనే స్పందించి అధికారులకు తెలియజేశారు.
ఇంధనం కొరత ఉన్న పరిస్థితుల్లో చెన్నైలో ఫ్లైట్ ను అత్యవసరంగా దించేందుకు వీలు కాదని సదరు ఎయిర్ పోర్టు అథారిటీ స్పష్టం చేయటంతో బెంగళూరుకు విమానాన్ని తీసుకెళ్లాలని సూచన చేశారు. దీంతో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా విమానాన్ని దించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తీవ్రమైన టెన్షన్ నేపథ్యంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పైలట్ విమానాన్ని సురక్షితంగా బెంగళూరులో ల్యాండ్ చేయటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో మరో విమానంలో ప్రయాణికుల్ని చెన్నైకు పంపారు. ఇంధనం త్వరగా అయిపోవటానికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్న పరిస్థితి. ఇదేమైనా బైకా? ఇంధనం తగ్గితే రోడ్డు పక్కన ఆపి.. పెట్రోల్ కొట్టించుకోవటానికి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. విమానం బయలుదేరటానికి ముందు తగినంత ఇంధనం ఉందా? లేదా? అన్నది చూసుకోలేరా? అన్నది ప్రశ్న. అయితే.. తాజా ఉదంతంపై ఇండిగో వర్గాలు సైతం అంతర్గత విచారణ చేపట్టాయి.తక్కువ ఇంధనంతో విమానం బయలుదేరిందా? మార్గమధ్యంలో లీకేజీ సమస్య ఏర్పడిందా? లాంటి వివరాల్ని సేకరిస్తున్నారు.