ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల్లో మాజీ సీఎం!
ఈ నెల 12న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించిన సంగతి తెలిసిందే.;
ఈ నెల 12న అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించిన సంగతి తెలిసిందే. మృతుల్లో గుజరాత్ రాష్ట్ర మాజీ సీఎం కూడా ఉన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటి నుంచి విమానాలకు సంబంధించిన ఏ చిన్న ఘటన తెరపైకి వచ్చినా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండిగో విమానం టెన్షన్ పెట్టింది.
అవును... ఢిల్లీ నుంచి రాయ్ పూర్ కు చేరుకున్న ఇండిగో విమానంలో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. ఇందులో భాగంగా.. విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయినపటికీ తలుపు తెరుచుకోలేదు. గేట్ లాక్ చేయబడి ఉండటంతో.. సుమారు 40 నిమిషాల పాటు ప్రయాణికులు విమానంలోనే చిక్కుకుపోయారు. దీంతో.. తీవ్ర ఆందోళన వ్యక్తమయ్యింది!
ఈ విమానంలోనే ఛతీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్, కాంగ్రెస్ ఎమ్మెల్యే చతురి నంద్, రాయ్ పూర్ మేయర్ మీనల్ చౌబే తో పాటు అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. ఇలా విమానం సేఫ్ గా ల్యాండ్ అయినప్పటికీ డోర్ ఓపెన్ కాకపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే సుమారు 40 నిమిషాల తర్వాత డోర్లు తెరుచుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే.. అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా విమాన ఘోర ప్రమాదం తర్వాత ప్రజలు కొంత భయపడుతున్నారని.. ఆ షాక్ నుంచి ఇంకా చాలా మంది తేరుకోలేకపోతున్నారని.. అందువల్ల డోర్లు తెరుచుకోకపోవడంతో విమానంలోని కొందరు ప్రయాణికులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారని అన్నారు.