అమెరికా F-1 వీసా ఇంటర్వ్యూలకు గ్రీన్ సిగ్నల్.. కానీ భారతీయులకు మాత్రం నిరాశే!

అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎఫ్-1 (F-1) వీసా ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించినప్పటికీ.. భారతీయ విద్యార్థులకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు.;

Update: 2025-06-20 18:30 GMT

అమెరికా ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎఫ్-1 (F-1) వీసా ఇంటర్వ్యూలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించినప్పటికీ.. భారతీయ విద్యార్థులకు మాత్రం నిరీక్షణ తప్పడం లేదు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశిస్తున్న వేలాది మంది భారతీయ విద్యార్థులు ఇప్పటికీ వీసా ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ల కోసం నిరంతరం ఎదురుచూస్తున్నారు.

ఢిల్లీకి చెందిన ఒక విద్యార్థి తెలిపిన వివరాల ప్రకారం.. అధికారికంగా ఇంటర్వ్యూలు ప్రారంభించినట్లు ప్రకటన వెలువడినప్పటికీ, అమెరికా వీసా అపాయింట్‌మెంట్ల అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త స్లాట్‌లు అందుబాటులో లేవు. ఇది విద్యార్థుల్లో మరింత ఆందోళన కలిగిస్తోంది.

సోషల్ మీడియాపై కఠిన నిబంధనలు

వీసా అపాయింట్‌మెంట్‌ల కొరత ఒకవైపు ఉండగా, అమెరికా ప్రభుత్వం సోషల్ మీడియా ఖాతాలపై కఠిన నిబంధనలు విధించిందని తెలుస్తోంది. ప్రైవేట్ ప్రొఫైల్‌లు, అకస్మాత్తుగా పోస్ట్‌లను తొలగించడం, లేదా అనుమానాస్పద కంటెంట్ వంటివి ఇప్పుడు వీసా నిరాకరణకు దారితీసే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఇప్పటికే అపాయింట్‌మెంట్‌ల కోసం తీవ్రంగా శ్రమిస్తున్న విద్యార్థులు, తమ సోషల్ మీడియా ఖాతాలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఎటువంటి అనుమానాస్పద కంటెంట్ లేకుండా పరిశుభ్రం చేయడం ప్రారంభించారు.

అస్పష్టత, ఆందోళన

వీసా ఇంటర్వ్యూలు ప్రారంభించినట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, భారతీయ వీసా దరఖాస్తుదారులకు ఎప్పుడు పూర్తి స్థాయిలో అపాయింట్‌మెంట్‌లు అందుబాటులోకి వస్తాయో స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. కాలేజీల తరగతులు ప్రారంభమయ్యే తేదీలు దగ్గరపడుతున్న నేపథ్యంలో వేలాది మంది భారతీయ విద్యార్థులు ప్రతిరోజూ వీసా అపాయింట్‌మెంట్ వెబ్‌సైట్‌ను తనిఖీ చేస్తూ కాలం వెచ్చిస్తున్నారు. ఈ అస్పష్టత విద్యార్థులలో తీవ్రమైన గందరగోళానికి, ఆందోళనకు దారితీస్తోంది.

అమెరికా రాయబార కార్యాలయం నుండి స్పష్టత ఆశిస్తున్న విద్యార్థులు

ప్రస్తుత పరిస్థితుల్లో, అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ యువత ఆశలు వదలకుండా ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. వీసా ప్రక్రియపై స్పష్టత లేకపోవడం వల్ల విద్యార్థులు భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించుకోలేకపోతున్నారు. భారతీయ విద్యార్థులు ఎదుర్కొంటున్న ఈ ఆందోళనను తొలగించడానికి అమెరికా రాయబార కార్యాలయం తక్షణమే స్పష్టమైన సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

Tags:    

Similar News