ఎంపీ కి జీతంతో పాటు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా?
ఇక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం కోసం వీరికి ఆఫీస్ ఖర్చుల కింద నియోజకవర్గ అలవెన్స్ లభిస్తుంది.
భారతదేశంలో పార్లమెంట్ సభ్యుడు కావడం అనేది కేవలం అధికారం, బాధ్యతలతో కూడుకున్నది మాత్రమే కాదు. దేశ ప్రజల సేవ కోసం ఎన్నికయ్యే వీరికి ప్రభుత్వం తరపున భారీగా జీతభత్యాలు, రకరకాల ప్రయోజనాలు అందుతాయి. కేవలం నెలకు వచ్చే శాలరీ మాత్రమే కాకుండా ఉచిత నివాసం, ప్రయాణ సౌకర్యాలు, పెన్షన్, వైద్యం, ఉచిత విద్యుత్ వంటి ఎన్నో రకాల పన్ను రహిత సదుపాయాలు వీరికి లభిస్తాయి. సామాన్య ప్రజలకు ఆశ్చర్యం కలిగించే ఆ పూర్తి వివరాలు ఇలా వున్నాయి..
అదిరిపోయే నెలవారీ జీతం:
మన దేశంలో ఒక ఎంపీకి నెలకు బేసిక్ శాలరీ 1,24,000 రూపాయల వరకు ఉంటుంది. దీనితో పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు ప్రతిరోజూ హాజరైనందుకు అదనంగా డైలీ అలవెన్స్ కూడా ఇస్తారు. వీటన్నింటితో కలిపి ఒక ప్రజాప్రతినిధికి ప్రతి నెలా చేతికి వచ్చే అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఉచిత ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం:
ఇక ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం కోసం వీరికి ఆఫీస్ ఖర్చుల కింద నియోజకవర్గ అలవెన్స్ లభిస్తుంది. అంతేకాక దీనితో పాటు ప్రతి సంవత్సరం లక్షకు పైగా ఉచిత ఫోన్ కాల్స్ మాట్లాడుకునే సదుపాయం, హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ వుంటుంది ,వీటి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా డబ్బులు సుమారు 1,50,000 రూపాయలు చెల్లిస్తుంది.
ఉచిత విమాన, రైలు ప్రయాణాలు:
ఎంపీలు తమ విధుల కోసం దేశవ్యాప్తంగా ప్రయాణించడానికి భారీగా రాయితీలు ఉంటాయి. ప్రతి సంవత్సరం వీరికి నిర్దేశిత సంఖ్యలో ఉచిత విమాన టికెట్లు లభిస్తాయి. అంతేకాదు, ఇండియన్ రైల్వేస్‌లో ఫస్ట్ క్లాస్ ఏసీలో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉచితంగా ప్రయాణించే గోల్డెన్ ఛాన్స్ వీరికి ఉంటుంది.
ఉచిత విద్యుత్, వాటర్ సప్లై:
ఢిల్లీ లేదా వారి సొంత నియోజకవర్గాల్లో ప్రభుత్వం కల్పించే క్వార్టర్స్ లేదా బంగ్లాలలో వీరు నివసిస్తారు. ఈ ఇళ్లకు ప్రతి సంవత్సరం ఒక లిమిట్ వరకు ఉచితంగా కరెంట్ దాదాపు 50,000 యూనిట్లు, అలాగే ఉచితంగా వాటర్ సప్లై వాడుకునే వీలుంటుంది. ఇక దీనివల్ల వీరికి పవర్ బిల్లుల భారం అస్సలు ఉండదు.
మెడికల్ కేర్, లైఫ్ టైమ్ పెన్షన్:
కేవలం పదవిలో ఉన్నప్పుడే కాకుండా, పదవీ కాలం ముగిసిన తర్వాత కూడా వీరికి బెనిఫిట్స్ అందుతాయి. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ కింద వీరికి, వీరి ఫ్యామిలీకి బెస్ట్ హాస్పిటల్స్‌లో ఉచిత వైద్యం లభిస్తుంది. అంతేకాదు, కేవలం ఒక్కసారి ఎంపీగా గెలిచినా కూడా జీవితాంతం నెలవారీ పెన్షన్ పొందే హక్కు వీరికి ఉంటుంది. అది సుమారు నెలకి 31,000 రూపాయలు వుంటుంది.
దేశ ప్రజల కోసం రేయింబవళ్లు కష్టపడే ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం ఈ స్థాయి సదుపాయాలు కల్పించడం అవసరమే అయినప్పటికీ.. పన్నులు కట్టే సామాన్య జనానికి మాత్రం ఈ లిస్ట్ చూస్తే ముక్కున వేలేసుకోవడం ఖాయం. మరి మన టాక్స్ మనీతో వీరు పొందుతున్న ఈ విలాసవంతమైన బెనిఫిట్స్ వీరికి కలుగుతున్నాయి అని తెలిసి సామాన్య జనం ఆశ్చర్య పోతున్నారు.