5 నెలలు.. రూ.7వేల కోట్లు.. భారత్ లో చేయించింది ఎవరో తెలుసా?
సైబర్ నేరగాళ్ల బారిన భారతీయులు ఏ స్థాయిలో పడుతున్నారో, మరే స్థాయిలో దెబ్బతింటున్నారో చెప్పే ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది.;
సైబర్ నేరగాళ్ల బారిన భారతీయులు ఏ స్థాయిలో పడుతున్నారో, మరే స్థాయిలో దెబ్బతింటున్నారో చెప్పే ఓ షాకింగ్ ఘటన తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో కేవలం 5 నెలల వ్యవధిలో ఏకంగా రూ.7వేల కోట్లను దేశ ప్రజల నుంచి కొట్టేశారు. ఈ నేరాలు చేసే వారంతా ఆగ్నేయాసియా దేశాల వాళ్లు కాగా చేయించేది మాత్రం చైనీయులేనని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) అంచనా వేసింది.
అవును.... ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో ఆన్ లైన్ మోసాల వల్ల భారతీయులు సుమారు రూ.7,000 కోట్లు నష్టపోగా.. అందులో సగానికి పైగా మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ నుండి పనిచేస్తున్న నెట్ వర్క్ కారణమని ఎంహెచ్ఏ పేర్కొంది. దీనిని బట్టి చూస్తే మే – జూలై మధ్యలో సైబర్ నేరగాళ్లు కొట్టేసిన మొత్తం రూ.10వేల కోట్ల వరకు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఒక విభాగమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ డేటా ప్రకారం.. ఈ సైబర్ మోసాలను చైనీస్ ఆపరేటర్లు ఎక్కువగా నియంత్రిస్తారని నివేదించబడింది. ఇక్కడ భారతీయులతో సహా వివిధ ప్రాంతాల నుంచి అక్రమ రవాణా చేయబడిన వ్యక్తులతో బలవంతంగా ఈ పని చేయిస్తున్నారని తెలిపింది.
ఈ సందర్భంగా... జనవరిలో ఆగ్నేయాసియా దేశాలకు రూ.1,192 కోట్లు, ఫిబ్రవరిలో రూ.951 కోట్లు, మార్చిలో రూ.1,000 కోట్లు, ఏప్రిల్ లో రూ.731 కోట్లు, మేలో రూ.999 కోట్లు నష్టం వాటిల్లిందని 'సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీ.ఎఫ్.సీ.ఎఫ్.ఆర్.ఎం.ఎస్) డేటాను ఉటంకిస్తూ ఒక అధికారి తెలిపారు.
ఈ నేపథ్యంలో.. ఆగ్నేయాసియా నుండి పనిచేస్తున్న మూడు రకాల ప్రధాన సైబర్ క్రైమ్ మోసాలను ఓ దర్యాప్తులో గుర్తించినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... స్టాక్ ట్రేడింగ్/పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, టాస్క్ ఆధారిత - పెట్టుబడి ఆధారిత మోసాలు ఉన్నట్లు చెబుతున్నారు. అమాయకుల నుంచి డబ్బు కొట్టేసేందుకు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మనవాళ్లను ఏజెంట్లుగా నియమించుకొన్నారని చెబుతున్నారు.
ఇందులో భాగంగా... మహారాష్ట్ర (59), తమిళనాడు (51), జమ్మూ కాశ్మీర్ (46), ఉత్తరప్రదేశ్ (41), ఢిల్లీ (38) నుండి అత్యధికంగా ఏజెన్సీలు పనిచేస్తున్నాయని అంటున్నారు. ఇదే క్రమంలో... లావోస్, మయన్మార్, కంబోడియా కోసం వారు ఎక్కువగా వ్యక్తులను నియమించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు. సైబర్ నేరాల విషయంలో వీలైనంత ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.