స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఎంత ఉందంటే?

స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డబ్బు ఆశ్చర్యకరంగా మూడు రెట్లు పెరిగింది.;

Update: 2025-06-20 06:30 GMT

స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకున్న డబ్బు ఆశ్చర్యకరంగా మూడు రెట్లు పెరిగింది. స్విస్ నేషనల్ బ్యాంక్ (SNB) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, 2024 నాటికి భారతీయుల డిపాజిట్లు రూ.37,600 కోట్ల (3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్)కు చేరుకున్నాయి. గత ఏడాది ఇది 1.04 బిలియన్ ఫ్రాంక్స్‌ వద్ద ఉండగా, ఒక్క ఏడాదిలోనే 2.5 బిలియన్ ఫ్రాంక్స్‌ పెరగడం గమనార్హం.

ఈ మొత్తంలో పెద్ద భాగం వ్యక్తిగత ఖాతాల నుండి కాకుండా, బ్యాంకింగ్ ఛానెల్స్, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా వచ్చిందని SNB స్పష్టం చేసింది. అంటే ఇది నేరుగా వ్యక్తుల నల్లధనం కాదని తెలిపింది.

-చారిత్రక నేపథ్యం

2006లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు ఆల్‌టైమ్ హైగా 6.5 బిలియన్ సీహెచ్.ఎఫ్ (స్విస్ ఫ్రాంక్స్) నమోదు కాగా, ఆ తర్వాతి సంవత్సరాల్లో ఈ మొత్తం క్రమంగా తగ్గింది. 2018లో భారత్, స్విట్జర్లాండ్ మధ్య పన్ను సమాచారం ఆటోమెటిక్ మార్పిడి ఒప్పందం వచ్చిన తర్వాత డేటా మరింత పారదర్శకంగా మారింది. అప్పటి నుండి స్విస్ ప్రభుత్వం, స్విస్ బ్యాంకుల్లో ఉన్న భారతీయుల ఖాతాల పూర్తి వివరాలను భారత్‌కు అందిస్తోంది.

- డిపాజిట్ల వివరాలు

ప్రస్తుతం భారతీయ ఖాతాదారుల డైరెక్ట్ డిపాజిట్లు 346 మిలియన్ సీహెచ్.ఎఫ్ (దాదాపు రూ.3,675 కోట్లు)గా ఉన్నాయి, ఇది మొత్తం డిపాజిట్లలో కేవలం 10 శాతం మాత్రమే. మిగిలిన నిధులు సంస్థల ఖాతాలు, ఇతర ఆర్థిక వ్యవహారాల రూపంలో ఉన్నాయి.

-ప్రపంచ ర్యాంకింగ్

ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో నిధుల పరంగా భారత్ 48వ స్థానానికి చేరుకుంది. గతేడాది ఇది 67వ స్థానంలో ఉండగా, 2022 చివర్లో 46వ ర్యాంక్‌లో నిలిచింది. బ్రిటన్ (222 బిలియన్ CHF), అమెరికా (89 బిలియన్ CHF), వెస్టిండీస్ (68 బిలియన్ CHF) టాప్‌లో కొనసాగుతున్నాయి. మన పొరుగు దేశాలైన పాకిస్తాన్ (272 మిలియన్ CHF), బంగ్లాదేశ్ (589 మిలియన్ CHF) కూడా గణనీయమైన డిపాజిట్లను కలిగి ఉన్నాయి.

ఈ గణాంకాలు భారత ఆర్థిక రంగానికి, అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి ఆసక్తికర పరిణామాలుగా మారాయి. ఇటువంటి సమాచారం ద్వారా విదేశాల్లో ఉన్న భారతీయ సంపదపై మరింత స్పష్టత లభిస్తుంది.

Tags:    

Similar News