హార్మూజ్ జలసంధి ప్రాంతంలో భారత నౌక కేప్టెన్ మృతి.. కారణం ఇదే..

పశ్చిమాసియాలో ఆకాశం నుంచి బాంబులు కురుస్తున్న వేళ, సముద్రం నడిబొడ్డున చిక్కుకుపోయిన ఒక భారతీయ కెప్టెన్ విషాదాంతం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది.;

Update: 2026-03-21 07:07 GMT

పశ్చిమాసియాలో ఆకాశం నుంచి బాంబులు కురుస్తున్న వేళ, సముద్రం నడిబొడ్డున చిక్కుకుపోయిన ఒక భారతీయ కెప్టెన్ విషాదాంతం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. యుద్ధం అంటే కేవలం తుపాకులు, క్షిపణులు మాత్రమే కాదు.. అది సృష్టించే ఒత్తిడి, ఆందోళన కూడా ప్రాణాలను బలితీసుకుంటాయని ఈ ఘటన నిరూపిస్తోంది. తన దేశం కోసం చమురును తీసుకువస్తూ, సరిహద్దుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా కళ్లముందే మృత్యువు దరిచేరిన ఆ 'నౌకా వీరుడి' కథ కన్నీళ్లు పెట్టిస్తోంది. హర్మూజ్ జలసంధి సమీపంలో ఈ విషాదకర పరిణామాలు, ఆ బాధిత కుటుంబం చేస్తున్న పోరాటంపై కనులను చెమ్మగిల్లేలా చేస్తున్నాయి.

హర్మూజ్ జలసంధిలో నిశ్శబ్ద మరణం

ఝార్ఖండ్‌లోని రాంచీకి చెందిన రాకేశ్‌ రంజన్‌ (43) భారతీయ కెప్టెన్, 'అవానా' అనే చమురు నౌకలో విధి నిర్వహణలో ఉండగా ప్రాణాలు కోల్పోయారు. భారత్‌కు చమురు తీసుకువస్తున్న ఈ నౌక, పశ్చిమాసియా యుద్ధం కారణంగా హర్మూజ్‌ జలసంధికి 14 నాటికల్‌ మైళ్ల దూరంలో నిలిచిపోయింది. చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, నౌకలోనే ఒక్కసారిగా కుప్పకూలిపోయిన ఆయన మరణం ఆ కుటుంబంలో శోకాన్ని నింపింది. యుద్ధ భూమిలో చిక్కుకున్న తన నౌకను కాపాడుకోవాలనే ఆందోళనే ఆయన ప్రాణం తీసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.

యుద్ధంతో సకాలంలో అందని వైద్యం

మార్చి 18న రాకేశ్ రంజన్ ఉన్నట్టుండి అస్వస్థతకు గురయ్యాడు. ఆయనను తక్షణమే ఆసుపత్రికి తరలించే ప్రయత్నాలు జరిగాయి. అయితే, ఆ ప్రాంతంలో తీవ్రమైన ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నెలకొని ఉండడంతో, విమానం లేదంటే హెలికాప్టర్ ద్వారా ఆయనను తరలించేందుకు అనుమతులు లభించలేదు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి గగనతల మార్గంలో రక్షణ లేకపోవడంతో.. చివరికి పడవలో దుబాయ్‌లోని పోర్ట్‌ రషీద్‌కు తరలించాల్సి వచ్చింది. యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో ఒక భారీ చమురు నౌకను నడిపించడం అనేది అత్యంత ప్రమాదకరమైన ఒత్తిడితో కూడిన పని. ఎప్పుడు ఏ వైపు నుంచి క్షిపణి వస్తుందో తెలియని స్థితిలో, సిబ్బంది ప్రాణాలను, నౌకను కాపాడుకోవాలనే తీవ్రమైన మానసిక ఆందోళన ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపి ఉండవచ్చు. పోస్టుమార్టం నివేదిక తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెల్లడికానున్నాయి.

ప్రభుత్వాలకు విజ్ఞప్తి!

ప్రస్తుతం రాకేశ్ రంజన్ మృతదేహం దుబాయ్‌లో ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తమ ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం, మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు సాయం చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటోంది. ఈ మేరకు ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌, రాంచీ ఎంపీ సంజయ్‌ సేథ్‌కు బాధితులు లేఖ రాశారు. అంతర్జాతీయ సరిహద్దులు, యుద్ధ ఆంక్షల మధ్య చిక్కుకున్న ఆ పార్థివ దేహాన్ని తమ సొంత గడ్డకు చేర్చాలని వారు కోరుతున్నారు.

యుద్ధం అంటే కేవలం తుపాకీ గుళ్లకు బలికావడమే కాదు.. సరిహద్దుల్లో చిక్కుకుపోయి ఆందోళనతో ప్రాణాలు వదలడం కూడా యుద్ధ నేరమే అవుతుంది. కెప్టెన్ రాకేశ్ రంజన్ మృతి భారతీయ నౌకాయాన రంగానికి పెద్ద నష్టం. యుద్ధ క్షేత్రాల్లో విధులు నిర్వహిస్తున్న వేలాది మంది భారతీయుల భద్రతపై ఈ ఘటన ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఆ కుటుంబానికి అండగా నిలవడంతో పాటు, యుద్ధ ప్రాంతాల్లో ఉన్న ఇతర భారతీయుల రక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి.

Tags:    

Similar News