మన నేవీ చేతికి మరో విధ్వంసకర అస్త్రం

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ దుశ్చర్యలకు చెక్ పెట్టేందుకు వీలుగా భారత సర్కారు తీసుకుంటున్న చర్యల గురించి తెలిసిందే.;

Update: 2025-05-06 04:22 GMT

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ దుశ్చర్యలకు చెక్ పెట్టేందుకు వీలుగా భారత సర్కారు తీసుకుంటున్న చర్యల గురించి తెలిసిందే. ప్రతిసారీ పాక్ కొట్టే దొంగ దెబ్బల్ని కాచుకుంటూ.. పలుమార్లు బాధితులుగా మారే పరిస్థికి చెక్ చెబుతూ.. ఆ దేశానికి తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు వీలుగా భారత్ సన్నద్ధమవుతోంది. ఇలాంటి వేళలో శత్రువులకు చుక్కలు చూపించే అస్త్రాల్ని వరుస పెట్టి సమకూర్చుకుంటోంది. ఇప్పుడు అలాంటి మరో అస్త్రం భారత నేవీకి సొంతం కానుంది. జలమార్గంలో శత్రువుల కుట్రల్ని ధీటుగా తిప్పి కొట్టేందుకు వీలుగా స్వదేశీ సాంకేతికతతో రూపొందటం ఒక విశేషంగా చెప్పాలి.

డీఆర్డీవో - నేవీ సంయుక్తంగా డెవలప్ చేసిన ఈ అధునాతన వ్యవస్థ.. శత్రువులకు చుక్కలు చూపిస్తుందని చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన పరీక్ష విజయవంతమైంది. మల్టీ ఇన్ ఫ్లూయెన్స్ గ్రౌండ్ మైన్ పొట్టిగా చెప్పాలంటే ఎంఐజీఎం వ్యవస్థను తాజాగా విశాఖపట్నంలో పరీక్షించారు. ఈ పరీక్ష సక్సెస్ అయ్యింది. దీనిపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థను డెవలప్ చేసిన నేవీ.. డీఆర్డీవోను అభినందించారు.

తాజాగా పరీక్షించిన ఎంఐజీఎం వ్యవస్థ భారత నావికాదళం సముద్ర గర్భంలో పోరాట సామర్థ్యాన్ని మరింత పెంచుతుందని చెప్పొచ్చు. ఈ సముద్రగర్భ నావల్ మైన్ ను విశాఖలోని నావల్ సైన్స్ అండ్ టెక్నోలాజికల్ లేబోరేటరీ.. భారత రక్షణ పరిశోధనాభివ్రద్ధి సంస్థ (డీఆర్డీవో) లేబోరేటరీలు.. ఫుణెలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చి లేబోరేటరీ.. చండీగఢ్ లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చి లేబోరేటరీల సహకారంతో డెవలప్ చేశారు.

ఈ వ్యవస్థతో శత్రు నౌకలు.. జలంతర్గాములకు వ్యతిరేకంగా భారత నావికా దళ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేలా ఈ వ్యవస్థను రూపొందించారు. దీన్ని హైదరాబాద్ లోని అపోలో మైక్రోసిస్టమ్స్ లిమిటెడ్.. విశాఖలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ సంస్థలు ఉత్పత్తి భాగస్వాములుగా ఉన్నాయి. తాజా పరీక్ష విజయవంతం కావటంతో.. ఇది భారత నేవీలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో దీని సేవలు దేశానికి ఎంతో ఉపయోగపడతాయని చెప్పక తప్పదు.

Tags:    

Similar News