అద్దె ఇంట్లో పెళ్లి ముహూర్తం.. గిల్గిట్‌లో పాక్ ‘కార్డ్‌బోర్డ్’ ప్రజాస్వామ్యం!

ఇంట్లో అద్దెకు ఉంటూ యజమాని గదిలోనే పెళ్లి ముహూర్తం పెట్టేసుకుని... ఆ యజమానికే శుభలేఖ పంపే టైపు మనుషులను ఎప్పుడైనా చూశారా?

Update: 2026-06-05 23:30 GMT

ఇంట్లో అద్దెకు ఉంటూ యజమాని గదిలోనే పెళ్లి ముహూర్తం పెట్టేసుకుని... ఆ యజమానికే శుభలేఖ పంపే టైపు మనుషులను ఎప్పుడైనా చూశారా? సరిగ్గా ఇలాంటి వింత కాన్సెప్ట్‌తోనే ఇప్పుడు మన పక్కింటి పాకిస్థాన్ గిల్గిట్-బాల్టిస్థాన్‌లో ఎన్నికల జాతర చేయడానికి సిద్ధమైంది. దశాబ్దాలుగా భారత భూభాగాన్ని అక్రమంగా గుప్పిట్లో పెట్టుకుని.. ఇప్పుడు అక్కడ ‘ప్రజాస్వామ్య పండుగ’ జరుగుతోందంటూ ప్రపంచ దేశాల ముందు కాలర్ ఎగరేయడానికి ఇస్లామాబాద్ ఒక అద్భుతమైన స్క్రిప్ట్‌తో కొత్త డ్రామాకు తెరలేపింది.

జూన్ 7న గిల్గిట్-బాల్టిస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ పాక్ బోర్డు తిప్పేయగానే భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. "బాబూ... 1947లోనే జమ్మూ-కశ్మీర్, లదాఖ్‌లతో పాటు గిల్గిట్-బాల్టిస్థాన్ కూడా చట్టబద్ధంగా భారత్‌లో విలీనం అయ్యాయి. మీరు అక్రమంగా చొరబడి టెంటు వేసుకున్నంత మాత్రాన అక్కడ ఓట్ల పెట్టెలు పెట్టినా యాజమాన్య హక్కులు మారవు" అని విదేశాంగ శాఖ గట్టిగానే క్లారిటీ ఇచ్చింది.

సినిమా సెట్టింగ్ లాంటి రాజ్యాంగం

అయినా పాకిస్థాన్ లాజిక్ చాలా విచిత్రంగా నవ్వు తెప్పించేలా ఉంటుంది. అక్కడ స్థానిక ప్రజలకు కనీస రాజ్యాంగ హక్కులు ఉండవు, కనీస సదుపాయాలు ఉండవు. కానీ "చూడండి.. మా దగ్గర ఎంత గొప్ప ప్రజాస్వామ్యం ఉందో!" అని ప్రపంచానికి చూపించడానికి మాత్రం తెగ ఆరాటపడిపోతుంటుంది. ఇది ఎలా ఉందంటే... సినిమా సెట్‌లో కార్డ్‌బోర్డ్‌తో ఒక పెద్ద రాజభవనం కట్టేసి దాన్నే అసలైన కోట అని నమ్మించడానికి చూస్తున్నట్లు ఉందని రాజకీయ విశ్లేషకులు నవ్వుకుంటున్నారు. మైకుల్లో ప్రజాస్వామ్యం అని అరుస్తూ వెనుక మాత్రం ఆర్మీ బూట్ల కింద ప్రజలను అణచివేయడం ఇస్లామాబాద్‌కే చెల్లింది.

ఎన్నికల తెర వెనుక అసలు కథ

భారత్ ఈ ఎన్నికల తంతును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆక్రమిత ప్రాంతాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, అక్కడి వనరులను దోచుకోవడం వంటి దారుణాలను ఈ ఎన్నికల రంగుల తెర వెనుక దాచలేరని స్పష్టం చేసింది. ఢిల్లీ నుంచి ప్రపంచానికి వెళ్లిన సందేశం ఒక్కటే "మీరు ఎన్ని ఎన్నికలు పెట్టుకున్నా ఎన్ని అసెంబ్లీలు ఏర్పాటు చేసినా మీ మ్యాప్‌లపై ఎలాంటి కొత్త గీతలు గీసుకున్నా వాస్తవం మారదు. ఆక్రమిత భూమి ఎప్పటికీ ఆక్రమిత భూమే!" అని భారత్ స్పష్టం చేసింది.

జులైలో మరో ‘ట్విస్ట్’

ఇదిలా ఉంటే కథ ఇక్కడితో అయిపోలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కూడా జులై 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు అక్కడి అధికారులు డేట్ ఫిక్స్ చేశారు. అయితే విచిత్రం ఏంటంటే ఈ ఎన్నికలు జరిగేది ప్రజల కోసం కాదు.. ఆర్మీ పారామిలిటరీ బలగాల పర్యవేక్షణలో.. దీన్ని చూస్తుంటే ప్రజాస్వామ్య పండుగ కంటే మిలిటరీ వాళ్ల పరేడ్ లాగా భద్రతా విన్యాసాల ప్రదర్శనలాగా కనిపిస్తోందని స్థానికులే గుసగుసలాడుకుంటున్నారు. ఓటు వేయడానికి వెళ్లే వాడి కంటే తుపాకీ పట్టుకుని నిలబడే వాడే అక్కడ ఎక్కువ అన్నమాట!

మొత్తానికి గిల్గిట్-బాల్టిస్థాన్‌లో ఎన్నికల పేరుతో పాకిస్థాన్ మరోసారి తన ఆక్రమణకు "ప్రజాస్వామ్య మేకప్" వేసి సరికొత్తగా ముస్తాబు చేయాలని చూస్తోంది. కానీ భారత్ మాత్రం చాలా కూల్‌గా... "నాయనా మేకప్ ఎంత దట్టంగా వేసినా లోపల ఉన్న అసలు ముఖం, ఆక్రమణ బుద్ధి మారవు కదా!" అని గట్టిగానే గుర్తుచేస్తోంది. చూద్దాం, ఈ కార్డ్‌బోర్డ్ ఎన్నికల డ్రామా ఇంకెంత కాలం సాగుతుందో!

Tags:    

Similar News