బోండీ బీచ్ లో ఉగ్రదాడి ఘటన... భారత్ కీలక నిర్ణయం!

ఈ సమయంలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో సాజిద్ అక్కడికక్కడే మృతి చెందగా.. అతడు భారత్ పాస్ పోర్టు కలిగి ఉన్నాడని, అతడికి హైదరాబాద్ తో సంబంధాలున్నాయనే విషయం తెరపైకి వచ్చింది.;

Update: 2025-12-18 07:55 GMT

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గల బోండీ బీచ్ లో ఆదివారం సాయంత్రం యూదులు హనుక్కా ఉత్సవం చేసుకుంటుండగా సాజిద్ అక్రం, అతడి కుమారుడు నవీద్ అక్రం లు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో సాజిద్ అక్కడికక్కడే మృతి చెందగా.. అతడు భారత్ పాస్ పోర్టు కలిగి ఉన్నాడని, అతడికి హైదరాబాద్ తో సంబంధాలున్నాయనే విషయం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో భారత సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది!

అవును... బోండీ బీచ్ లో యూదులే లక్ష్యంగా జరిగిన ఉగ్రదాడిలో అక్కడికక్కడే మృతి చెందిన సాజిద్ అక్రం.. భారత పాస్ పోర్టు కలిగి ఉన్నాడని.. దానితోనే పాలస్థీనాలో పర్యటించాడని.. సుమారు గడిచిన పాతికేళ్లలో అతడు ఆరుసార్లు హైదరాబాద్ వచ్చాడనే విషయం తెరపైకి రావడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా... ఉగ్రదాడి దర్యాప్తులో భాగం కావాలని భారత్ భావిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్రదాడి దర్యాప్తులో ఆస్ట్రేలియా అధికారులకు సాయం చేసేందుకు ఓ బృందాన్ని అక్కడికి పంపించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి. ఈ దర్యాప్తు బృందంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు విభాగాలతో పాటు కేంద్ర నిఘా సంస్థలకు చెందిన అధికారులు ఉంటారని అంటున్నారు.

సుమారు 27 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయిన సంగతి అటుంచితే.. ప్రధానంగా సుమారు నాలుగేళ్ల క్రితం నిందితుడు సాజిద్ తన తల్లిని కలిసేందుకు చేసిన భారత పర్యటనపై దృష్టిసారించనున్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా.. అతడు భారత్ కు వచ్చిన అసలు ఉద్దేశ్యం, తిరిగిన ప్రదేశాలు, కలిసి వ్యక్తులు, చేసిన పనులు మొదలైన వాటి గురించి దర్యాప్తు బృందం తెలుసుకోనుందని అంటున్నారు.

ఇదే సమయంలో.. సాజిద్ కు ఉగ్రవాద సంస్థలతో ఉన్న సంబంధాలపైనా దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు అతడు భారత్ లో ఏమైనా స్లీపర్ సెల్స్ నియమించాడా అనే కోణంలోనూ దర్యాప్తు సాగనుందని సమాచారం. ఇదే క్రమంలో... అక్రం సైద్ధాంతిక దృక్పథాలను అంచనా వేయడం కూడా భారత బృందం ప్రధాన లక్ష్యం అని అంటున్నారు.

ఇందులో తీవ్రవాద రాడికలైజేషన్, ఆన్ లైన్ బోధనా మార్గాలు, ప్రపంచ ఇస్లామిస్ట్ కథానలతో ఏదైనా సమన్వయానికి అవకాశాన్ని పరిశీలించడం ఉంటుందని చెబుతున్నారు. ఈ దాడి వ్యవస్థీకృత యూదు వ్యతిరేక ద్వేషంతో నడించిందా లేక ఇజ్రాయెల్ వ్యతిరేక ఉద్యమాలతో ముడిపడి ఉందా.. అంతర్జాతీయ నెట్ వర్క్ ల నుంచి ఏ మేరకు ప్రేరణ పొందింది మొదలైన విషయాలను పరిశీంచనున్నారని అంటున్నారు.

Tags:    

Similar News