శత్రువు అయినా దాయాదిని అలెర్టు చేసిన భారత్

శత్రువు అయితే మాత్రం సమాధి కావాలనుకోవటం పొరపాటు. అందునా.. శత్రుదేశంతో శత్రుత్వం ఉండొచ్చు.;

Update: 2025-08-25 15:30 GMT

శత్రువు అయితే మాత్రం సమాధి కావాలనుకోవటం పొరపాటు. అందునా.. శత్రుదేశంతో శత్రుత్వం ఉండొచ్చు. అంత మాత్రాన ఆ దేశంలోని ప్రజల విషయంలో మానవత్వంతో వ్యవహరించాలన్న సందేశాన్ని చేతలతో చేసి చూపించింది భారత్. విపత్తు వేళ.. ముంచుకొస్తున్న ఆపద వివరాల్ని అందజేయటం ద్వారా అప్రమత్తం చేసిన భారత్.. అంత సాయం చేసి మరీ ప్రచారం చేసుకోకుండా ఉండటం విశేషం. అంతర్జాతీయంగా భారత్ అంటే ఏమిటో అందరికి అర్థమయ్యేలా వ్యవహరించిన ఈ ఉదంతం లోకి వెళితే..

కశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రచర్య.. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ - పాక్ మధ్య చోటు చేసుకున్న పరిణామాలు.. ఉద్రిక్తతల గురించి తెలిసిందే. ఈ సందర్భంగా పాక్ దాహార్తిని తీర్చే సింధూ నదీ జలాల ఒప్పంద అమలును నిలిపి వేస్తూ భారత్ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. భారీ వర్షాల కారణంగా జమ్మూకశ్మీర్ లోని తావి నది ఉప్పొంగే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అంచనా వేసింది.

తావి నది కారణంగా చోటు చేసుకునే వరదలతో పాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పాక్ అధికారులకు ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ సమాచారాన్ని అందించింది. ఈ విషయాన్ని పాక్ లోని జియో న్యూస్.. ది న్యూస్ ఇంటర్నేషనల్ లాంటి మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. గతంలో ఇలాంటి పరిస్థితికి సంబంధించిన సమాచారాన్ని సింధూ నది జలాల ఒప్పంద కమిషనర్ పాక్ కు తెలియజేసేవారు. మారిన పరిస్థితుల్లోనూ.. మానవత్వంతో పాక్ ప్రజలకు ఇబ్బందులు కలగకూడదన్నట్లుగా భారత్ వ్యవహరించింది.

భారత్ అందించిన సమాచారంతో పాక్ యంత్రాంగం స్పందించి తమ ప్రజలకు వరద హెచ్చరికల్ని జారీ చేసింది. దీంతో భారీ నష్టం వాటిల్లకుండా భారత్ వ్యవహరించిందని చెప్పాలి. జూన్ 26 నుంచి ఇప్పటివరకు 780 మందికి పైగా ప్రజలు ప్రాణలు కోల్పోయారు. వెయ్యికి పైగా ప్రజలు గాయపడిన పరిస్థితి. మానవత్వంతో వ్యవహరించిన భారత్ తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Tags:    

Similar News