నేపాల్ లోనూ కలకలం.. ప్రశాంతత లేని భారత ఇరుగు-పొరుగు
భారత్ తో భారీ సరిహద్దును కలిగి ఉంది నేపాల్. పూర్తిగా హిమాలయాల్లోని ఈ దేశంలో తాజాగా కలకలం రేగింది. భారత సరిహద్దు ప్రాంతాల్లో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి.;
బంగ్లాదేశ్ లో హిందువులు టార్గెట్ గా దాడులు.. హత్యలు..! సైనిక పాలనలోని మయన్మార్ లో ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నట్లు ఆరోపణలు.. ఏడాదిలోనే 1,500 మంది పౌరుల హత్య జరిగిందనే ఆరోపణలు..! నేపాల్ లో ఇటీవల జెన్ జీ ఉద్యమంతో పదవి దిగిపోయిన ప్రధాని..! పాకిస్థాన్ లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో మగ్గుతూ ప్రాణాలతో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి..! అఫ్ఘానిస్థాన్ ను చేతుల్లోకి తీసుకునన తాలిబన్లు... శ్రీలంకలో మూడేళ్ల కిందట అధ్యక్షుడు గొటబాయ మీద ప్రజల తిరుగుబాటు... చైనాలో జిన్ పింగ్ కు ఉద్వాసన అంటూ ఊహాగానాలు.. తమ దేశంలో భారత సైనికులు ఉండడంతో మాల్దీవుల అభ్యంతరం..! ఇదీ ప్రస్తుతం భారత దేశ ఇరుగు పొరుగున ఉన్న పరిస్థితి..! కల్లోలం ఏదో ఒక దేశంలో సహజమే.. కానీ, చుట్టూ ఉన్న దేశాలు అన్నిట్లోనూ నాయకత్వ సమస్య ఉండడమే ఇక్కడ ఆందోళనకర పరిణామం. ఇప్పుడు కాకపోయినా తర్వాతి కాలంలో వాటి ప్రభావం మన దేశంపైనా పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నేపాల్ లోనూ నిప్పు రాజుకుంది..!
భారత్ తో భారీ సరిహద్దును కలిగి ఉంది నేపాల్. పూర్తిగా హిమాలయాల్లోని ఈ దేశంలో తాజాగా కలకలం రేగింది. భారత సరిహద్దు ప్రాంతాల్లో మత ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీంతో భారత్ సరిహద్దును మూసివేసింది. అత్యవసర కార్యక్రమాలు మినహా ఇరువైపులా రాకపోకలను నిలిపివేసింది. నేపాల్ లోని ధనుశా జిల్లాలో ఉన్న ప్రార్థనా మందిరాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ మేరకు వీడియోలు వైరల్ కావడంతో ఆందోళనలు చెలరేగాయి. భారత సరిహద్దులోని పర్సా, రహౌల్ ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా మారడంతో కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి తలెత్తింది.
బంగ్లాతో ఇబ్బందులు తప్పేలా లేదు..
బంగ్లాదేశ్ లో 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయింది. హసీనా భారత్ లో తలదాచుకుంటున్నారు. ఇప్పుడు ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. కానీ, వరుసగా హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. బంగ్లాలో మైనారిటీలు అయిన హిందువులకు భారత్ లోని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున సంఘీభావం పలుకుతున్నాయి. ఈ క్రమంలో బంగ్లా క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి కూడా తప్పించారు. దీంతో టి20 ప్రపంచకప్ లో భాగంగా భారత్ లో జరగాల్సిన తమ మ్యాచ్ లను శ్రీలంకకు మార్చాలని బంగ్లా కోరుతోంది. బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం భారత్ తో రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తోంది. ముందుముందు దానితో ఏదోఒకటి తేల్చుకునే పరిస్థితి భారత్ కు ఎదురవొచ్చు.
చైనా-తైవాన్ తలనొప్పి..
ప్రపంచ శక్తిగా ఎదగాలని చూస్తున్న చైనాకు తైవాన్ తమదే అని గట్టిగా చెబుతోంది. దాని జోలికి వెళ్తే తోక తొక్కిన తాచుపాములా విరుచుకుపడుతుంది. అది అమెరికా అయిన సరే సహించదు. తైవాన్ విషయంలో ఎప్పటికైనా చైనా తీవ్ర చర్యలకు దిగుతుందనేది అంచనా. ఇకపోతే.. మూడేళ్ల కిందట చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాయం అయ్యారనే ఊహాగానాలు వినిపించాయి. ఆయన పదవి నుంచి దిగిపోయినట్లుగానూ కథనాలు వచ్చాయి. కానీ, అవేమీ నిజం కాలేదు.
-ఉక్రెయిన్ యుద్ధం మొదలుపెట్టిన రష్యాను సందర్శించి పదవిని పోగొట్టుకున్నారు పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆయన చర్య అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. దీంతో చకచకా పావులు కదిలాయి. ఇమ్రాన్ ను దించేసిన అమెరికా... పాక్ కు షాబాజ్ షరీఫ్ ను ప్రధానిని చేసింది. ఇక పాకిస్థాన్ కు తాలిబన్ల మద్దతు ఉన్న ఉగ్రవాదులతో ఘర్షణలు జరుగుతున్నాయి. బలూచిస్థాన్ స్వతంత్ర దేశం కావాలనే డిమాండ్లు గట్టిగా వస్తున్నాయి. ఇక పాక్ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే అన్న సంగతి తెలిసిందే.
-శ్రీలంక ఆర్థిక సంక్షోభంపై మూడేళ్ల కిందట పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆ తర్వాత అధ్యక్షుడు గొటబాయను తరిమివేశారు.
-నేపాల్ లో తాత్కాలిక ప్రధానిగా మహిళ సుశీల కర్కి ఉన్నారు. కొన్ని నెలల కిందట ఆందోళనల నేపథ్యంలో ప్రచండ రాజీనామా చేశారు. నేపాల్ కొన్నాళ్లుగా చైనాకు దగ్గరవుతున్నదనే కథనాలు ఉన్నాయి.
-అసలు భారత్ తో పెట్టుకునే స్థాయి లేని మాల్దీవులు.. తొడకొట్టింది. ఆ దేశం నుంచి భారత సైన్యాన్ని పంపించేశారు అధ్యక్షుడు. భారత ప్రధాని మోదీని హేళన చేస్తూ మారిషన్ మంత్రులు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆ దేశ ఆయువుపట్టయిన టూరిజంపై భారత్ దెబ్బకొట్టింది. ఇప్పుడు మాల్దీవులు మనమాట వింటున్నా.. భవిష్యత్ లో మళ్లీ పాత కథే జరగదన్న గ్యారంటీ ఏమీ లేదు.
-అఫ్ఘానిస్థాన్ తో భారత్ కు సరిహద్దు ఉంది. అయితే, అది పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉంది. అఫ్ఘాన్ ను ఐదేళ్లుగా పాలిస్తున్న తాలిబన్లు భారత్ తో సఖ్యతతోనే ఉంటున్నారు. వారు పాకిస్థాన్ పై కోపంతో మనకు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది. ముందుముందు ఎలా ఉంటారో చూడాలి.