నెలకు 31 జీబీ.. డేటా అంతలా వాడేస్తున్నారు

తిండి తిన్నా.. తినకున్నా రోజువారీ డేటా వినియోగం మాత్రం భారీగా పెరుగుతోంది. రోజువారీ జీవితంలో డేటా వినియోగం అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది.;

Update: 2026-04-01 15:30 GMT

తిండి తిన్నా.. తినకున్నా రోజువారీ డేటా వినియోగం మాత్రం భారీగా పెరుగుతోంది. రోజువారీ జీవితంలో డేటా వినియోగం అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. డేటా వినియోగంలో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకున్న భారతీయుల డేటా వినియోగంపై నోకియా తన తాజా రిపోర్టులో పలు ఆసక్తికర అంశాల్ని పేర్కొంది. 2025లో భారత స్మార్ట్ ఫోన్ యూజర్లు నెలవారీగా వినియోగిస్తున్న డేటా ఎంతన్న విషయంపై ఆశ్చర్యానికి గురి చేసే అంశాల్ని వెల్లడించింది. 2025లో ముగిసిన ఏడాదికి స్మార్ట్ ఫోన్ వినియోగదారుల డేటా వినియోగం సరాసరిన నెలకు 31 జీబీలుగా తేల్చింది.

2024లో ఈ వినియోగం 27.5 శాతంగా ఉండేది. ఏడాదిలో డేటా వినియోగం దాదాపు 18 శాతం పెరగటం గమనార్హం. గడిచిన ఐదేళ్లలో డేటా వినియోగం అంతకంతకూ పెరుగుతున్న విషయాన్ని ప్రస్తావించిన నివేదిక.. 2025లో దేశ వ్యాప్త నెలసరి 5జీ డేటా రద్దీ వార్షిక ప్రాతిపదికన 70 శాతం పెరిగినట్లు పేర్కొంది. దీంతో 12.9 ఎక్సాబైట్స్ కు చేరుకుందని.. దేశ వ్యాప్త మొత్తం డేటా రద్దీ 27 ఈబీలో 5జీ వాటా దాదాపు 47 శాతానికి పెరిగినట్లుగా వెల్లడించింది. మొత్తం డేటా రద్దీ గడిచిన ఐదేళ్లలో ఏటా 21.7 శాతం చొప్పున పెరుగుతున్నట్లుగా పేర్కొంది.

2025లో మార్కెట్ లోకి సరఫరా అయిన మొత్తం ఫోన్లలో 90 శాతం 5జీ సామర్థ్యం కలిగినవే. గత ఏడాది దేశంలోయాక్టివ్ 4జీ ఫోన్ల సంఖ్య 89.2 కోట్లుగా ఉంటే.. అందులో 38.3 కోట్ల ఫోన్లు 5జీ సేవల వినియోగ సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది మార్కెట్ లో రూ.10వేల కంటే తక్కువ ధర కలిగిన 5జీ బడ్జెట్ ఫోన్ల సరఫరా పది రెట్లు పెరిగినట్లుగా పేర్కొన్నారు. మొత్తం 5జీ డేటా రద్దీలో 58 శాతం మెట్రో నగరాల వాటానే ఉంది. భారత్ లో 2031 నాటికి 5జీ వినియోగదారుల పెరుగుదల 100 కోట్లు ఉంటుందని అంచనా.

ప్రపంచంలో అత్యధిక 5జీ వినియోగదారులు.. అత్యధిక 5జీ డేటా వినియోగం.. అత్యధిక 5జీ ఫిక్స్ డ్ వైర్ లెస్ యాక్సెస్ యూజర్ల పరంగా భారత్ రెండో స్థానంలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తం 5జీ డేటా రద్దీలో ఫిక్స్ డ్ వైర్ లెస్ యాక్సెస్ వాటా 25 శాతం కాగా.. 5జీఎఫ్ డబ్ల్యూఏ వినియోగదారులు వార్షిక ప్రాతిపదికన రెట్టింపు అయినట్లుగా పేర్కొంది.

Tags:    

Similar News