ఇల్లే నా గుర్తింపు: భారత్‌లో ఆకాశమే హద్దుగా ఇంటీరియర్ డిజైన్ మార్కెట్!
`నా ఇల్లే నా గుర్తింపుకు ప్రతిరూపం` అనే మాట ఈ రోజుల్లో పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి బారతీయ కుటుంబాలలో ఒక సాధారణ నినాదంగా మారిపోయింది.
`నా ఇల్లే నా గుర్తింపుకు ప్రతిరూపం` అనే మాట ఈ రోజుల్లో పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి బారతీయ కుటుంబాలలో ఒక సాధారణ నినాదంగా మారిపోయింది. ఒకప్పుడు సొంత ఇల్లు కొనడమే జీవిత ఆశయంగా భావించేవారు. కానీ ప్రస్తుత తరం ఆలోచనా విధానంలో ఇల్లు కొనడం అనేది ఒక ఆరంభం మాత్రమే. ఇల్లు చేతికి రాగానే దానిని తమ అభిరుచులకు తగ్గట్టుగా మార్చుకోవడం కోసం సరికొత్త ల్యాండ్‌స్కేప్స్, వెల్‌నెస్ జోన్లు, స్మార్ట్ లైటింగ్, లగ్జరీ వార్డ్‌రోబ్‌లతో హోమ్ ఇంటీరియర్స్ వైపు భారతీయులు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఈ జీవనశైలి మార్పు రియల్ ఎస్టేట్, ఫర్నిచర్ రంగాన్నే కాకుండా ఏకంగా 12 బిలియన్ డాలర్ల (దాదాపు 1 లక్షల కోట్లు) మార్కెట్ విలువ కలిగిన ఒక పెద్ద ఇంటీరియర్ సామ్రాజ్యాన్ని సృష్టించింది.
పరిశ్రమ అంచనాల ప్రకారం... ప్రస్తుతం ఇండియాలో ఇళ్ల కొనుగోలుదారులు తమ ప్రాపర్టీ మొత్తం విలువలో 10 నుండి 20 శాతం వరకు కేవలం ఇంటీరియర్ డిజైనింగ్ కోసమే కేటాయిస్తున్నారు. ఉదాహరణకు 1 కోటి విలువైన ఫ్లాట్ కొనుగోలు చేసిన వ్యక్తి కీస్ చేతికి రాగానే మరో 10లక్షల నుండి 20 లక్షలు ఇంటీరియర్స్ కోసం సులువుగా ఖర్చు పెడుతున్నారు. అలాగే ప్రీమియం ఇళ్ల బడ్జెట్ 20లక్షల నుండి 40 లక్షల వరకు ఇంటీరియర్ కే ఖర్చు పెడుతున్నారు. ఈ ట్రెండ్ కేవలం ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాలకే పరిమితం కాకుండా.. జైపూర్, లక్నో, ఇండోర్, చండీగఢ్, కోయంబత్తూర్, దక్షిణాదినా మధురై, మంగుళూరు, వైజాగ్, తిరుపతి, విజయవాడ వంటి టైర్-2 నగరాలకు కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ ఇంటీరియర్ మార్కెట్ ఏటా 8 నుండి 13 శాతం వృద్ధితో దూసుకుపోతుండగా ఇందులో నివాస గృహాల డిమాండే 60 శాతం వాటాను కలిగి ఉంది.
ఈ అసాధారణ మార్పుకు ప్రధాన కారణం నేటి జెన్ జీలో భార్యాభర్తలిద్దరూ సంపాదించడంతో మారిన మానసిక ధోరణికి అద్దం పట్టడమేనని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. పాత తరం వారు ఇంటీరియర్స్‌ను అదనపు ఆప్షన్‌గా చూస్తే.. నేటి తరం వారు దీనిని ప్రాథమిక అవసరంగా భావిస్తున్నారు. ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత ఇంటి నుంచే పని చేసే సంస్కృతి.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, పింటరెస్ట్ డిజైన్లు, సెలబ్రిటీ హోమ్ టూర్ల ప్రభావం వల్ల ఇళ్లను కేవలం నివసించే స్థలాలుగా కాకుండా తమ హోదాకు, వ్యక్తిత్వానికి నిదర్శనంగా మార్చుకుంటున్నారు. ప్రస్తుతం సాధారణ ఇంటీరియర్స్‌కు చదరపు అడుగుకు రూ.800 నుండి రూ.1,200 ఖర్చవుతుండగా లగ్జరీ ప్రాజెక్టులకు ఇది రూ.7000 దాటుతోంది.
భారతీయ ఇళ్లలో ఇంటీరియర్ డిజైన్ల ఎంపిక విషయంలో మహిళల పాత్ర అత్యంత కీలకంగా మారుతోంది. ఇంటి కలర్ ప్యాలెట్లు, కిచెన్ లేఅవుట్లు.. ఇంటి ఓవరాల్ సౌందర్యానికి సంబంధించిన నిర్ణయాలు మహిళలు తీసుకుంటుంటే.. పురుషులు బడ్జెట్, మెటీరియల్స్ మన్నికపై దృష్టి పెడుతూ ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికీ భారతదేశంలో 80-85 శాతం ఇంటీరియర్ రంగం స్థానిక కార్పెంటర్లు.. చిన్న కాంట్రాక్టర్ల వంటి అసంఘటిత విభాగం చేతిలోనే ఉంది. అయితే నాణ్యత, పారదర్శకత, బ్రాండెడ్ సొల్యూషన్స్ కోసం ఇప్పుడు ప్రజలు సంఘటిత రంగానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో కొన్ని బ్రాండెడ్ ఇంటీరియర్ కంపెనీలకు సరికొత్త వ్యాపార అవకాశాలు లభిస్తున్నాయి. మొత్తంమీద నేటి పట్టణ భారతీయుడికి ఇల్లు అనేది ఒక స్థిరాస్తి మాత్రమే కాదు.. అంతకుమించి అది వారి ఆత్మగౌరవానికి, జీవన ప్రమాణానికి ఒక నిలువెత్తు సాక్ష్యం.
గతంలో స్థానిక కార్పెంటర్లు, మేస్త్రీల నైపుణ్యంతో బడ్జెట్ పరిధిలో ఇళ్లను అలంకరించుకునే భారతీయ మధ్యతరగతి కుటుంబాలు.. నేడు సోషల్ మీడియా ఇన్‌స్టా రీల్స్ ప్రభావంతో బ్రాండెడ్ ఇంటీరియర్ కంపెనీల వైపు ఆకర్షితులవుతూ లక్షలాది రూపాయలు అదనంగా ఖర్చు చేయడం వారి జీవన ప్రమాణాల మెరుగుదలను సూచిస్తుందా లేక ఒక రకమైన సామాజిక ఆడంబరాల ఒత్తిడిని ప్రతిబింబిస్తుందా విశ్లేషించాల్సిన సమయం ఆసన్నమైంది.