ఉగ్రవాదులు సరిహద్దు మీరకుండా... మూడంచెల నిఘా *కళ్లు*
సరిహద్దుల్లో ఇప్పటికే భారత సైన్యం అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థలను మోహరించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు ఎలాంటి దాడులూ చేపట్టకుండా ఈ ఏర్పాటు.;
మరొక్క రోజులో పంద్రాగస్టు.. ఎర్రకోటపై జాతీయ జెండా సగర్వంగా రెపరెపలాడే రోజు.. కానీ, ఎప్పటిలాగానే ఉగ్రవాద ముప్పుపై ఓ కన్నేసి ఉంచాల్సిన సమయం.. ఇటీవలి కొన్ని సంవత్సరాల్లో పంద్రాగస్టు ముందర ఉగ్రవాదుల ప్లాన్ ను భద్రతా దళాలు భగ్నం చేశాయన్న కథనాలు సహజంగా మారాయి. ఇక ఈ ఏడాది పెహల్గాం దాడి తర్వాత మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలో భారత సైన్యం నిఘా కళ్లతో పర్యవేక్షణ సాగిస్తోంది.
సరిహద్దుల్లో ఇప్పటికే భారత సైన్యం అత్యంత అధునాతన భద్రతా వ్యవస్థలను మోహరించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉగ్రవాదులు ఎలాంటి దాడులూ చేపట్టకుండా ఈ ఏర్పాటు. ఇందులోభాగంగా మూడంచెల్లో పనిచేసే రోబోటిక్ గ్రిడ్ ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీర్ లోని కుప్పారా జిల్లా తాంగ్ దర్ వద్ద నెలకొల్పారు. పాక్ వైపు నుంచి ఒక్కరు కూడా సరిహద్దు దాటొద్దంటూ భద్రతా దళాలకు ఆదేశాలు వెళ్లాయి.
ఏమిటీ గ్రిడ్...?
భూమిపై కదలికలను గమనించేలా ఒకటో దశలో ప్రత్యేక రాడార్లు.. థర్మల్ ఇమేజింగ్ సిస్టమ్.. మానవ రహిత విమానాలు ఉంటాయి. ఇక రెండో అంచెలో ప్రత్యేక మందుపాతరలతో కూడిన బ్యారియర్లు, ప్రత్యేకమైన ఆప్టికల్ వ్యవస్థలను మోహరించారు. వీటిని దాటుకుని వచ్చినా మూడో దశలో బలగాల గస్తీలు ఉంటాయి.
ఆపరేషన్ సిందూర్ లోనూ...
కొత్త ఉపకరణాలను ఈ ఏడాది మేలో పాకిస్థాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మన సైన్యం విస్తృతంగా పరీక్షించి, విజయవంతమైంది. ఇప్పటికే భారత్.. పాక్, బంగ్లా, మయన్మార్ సరిహద్దుల్లో కంచె నిర్మిస్తోంది. వీటికి సీసీ కెమెరాలు, టెలిస్కోప్ లు, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఉంటాయి.