మొబైల్ డేటా వాడకంలో మనమే మొనగాళ్లం..

సెల్ ఫోన్లు వచ్చాక మన దేశ పరిస్థితే మారిపోయింది. బడా కోటీశ్వరుడి మొదలు వీధి బిచ్చగాడి దాకా మొబైల్ వాడని వారే లేరు.;

Update: 2025-12-04 05:27 GMT

సెల్ ఫోన్లు వచ్చాక మన దేశ పరిస్థితే మారిపోయింది. బడా కోటీశ్వరుడి మొదలు వీధి బిచ్చగాడి దాకా మొబైల్ వాడని వారే లేరు. అయినవాళ్ళు, బంధువులు లేకున్నా బతకగలమేమో గానీ మొబైల్...అందులో డేటా లేకుంటే అస్సలు బతకలేని స్థితికి వచ్చేశాం. మొబైల్ వాడకం గిరిజన గూడేల దాకా వెళ్ళిపోయింది. సిగ్నల్ దొరకని ప్రాంతాల్లో కూడా స్తంభాలెక్కి, చెట్లెక్కి సిగ్నల్ కోసం పాకులాడే సగటు మనిషి చిత్రం మన దేశంలోనే కనిపిస్తుంది. మరి డేటాను మంచినీళ్ళలెక్క ఖర్చు చేస్తున్న మనం నెలకు ఎంత డేటా వాడుతున్నాం? డేటా వాడకంలో ప్రపంచంలో అందరికంటే మనమే మొనగాళ్ళమా? అంటే ఔననే తాజా లెక్కలు చెబుతున్నాయి.

ప్రపంచంలో అందరికన్నా అధికంగా మొబైల్ డేటా వాడేది ఇండియాలోనే. ప్రతి మనిషి సగటున నెలకు 36 జీబీ లెక్కలేకుండా వాడేస్తున్నారు. స్వీడిష్ నెట్వర్క్ కంపెనీ ఎరిక్సన్ ప్రపంచంలో వంద పెద్ద ప్రాంతాల నుంచి లైవ్ నెట్వర్క్ ల కవరేజీని పరిశీలించింది. అమెరికా, పశ్చిమ యూరోప్, చైనాలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఇండియాలో సగటున ప్రతి ఒక్కరు 36 జీబీ దాకా డేటా వాడుతున్నట్లు తేలింది. తక్కువ ధరకు దొరికే డేటా ప్లాన్ వాడుతున్న చిన్న ఫోన్లు మొదలు...అధిక ధరల డేటా ప్లాన్ వాడుతున్న స్మార్ట్ ఫోన్ల దాకా గణాంక వివరాలు తీస్తే ఇండియాలో మొబైల్ డేటా వాడే వారి సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా ఉందని తెలుస్తోంది. మనుషుల్లో ఈ మార్పు చూస్తే ఇండియా డిజిటల్ ప్రపంచంలో ఎంతగా మమేకమైపోయిందో అర్థమవుతోంది.

ఒకప్పుడు రేడియో...ఆ తర్వాత టీవీ...ఇప్పుడు మొబైల్...ఇదీ మన సగటు భారతీయుడి డిజిటల్ ప్రయాణంగా గుర్తించవచ్చు. ఒక మొబైల్ మన చేతిలో ఉంటే అన్నీ అందులో ఉన్నట్లే...ఆర్థిక లావాదేవీలు...సినిమాలు, పాటలు, టీవీ సీరియళ్ళ, వార్తలు,సోషల్ మీడియా అన్నీ ...అదో అరచేతిలో మరో ప్రపంచంగా మారిపోయింది. మరి ఇన్ని ఫీచర్లు ఉన్నప్పుడు మొబైల్ వాడకం కూడా అంతే అధికంగా ఉంటుంది కదా. అందుకే ఇపుడు మొబైల్ డేటా అలా ఖర్చయిపోతోంది అంతే. ఇంట్లో అయిదుగురుంటే...అయిదుగురికి ఫోన్లు...అవీ స్మార్ట్ ఫోన్లు. ఇక ఒకరికొకరు మాటామంతీ, మంచే చెడ్డ ముచ్చట్లు పెట్టుకోవడం అంటూ ఉండదు. సగటు స్క్రీన్ టైమ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. పొద్దున్న లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా...మన పక్కన ఆత్మబంధులా ఫోన్ ఉండాల్సిందే. ఫోన్ లేదంటే మనం ఏమీ కాదన్నపరిస్థితి వచ్చేసింది. అందుకే 2031 నాటికి మొబైల్ డేటా వాడకం 36 జీబీ నుంచి రెట్టింపు అంటే 65జీబీకి పెరిగే అవకాశముందని...ఏటా పదిశాంత పెరుగుదల ఉంటుందని ఎరిక్సన్ కంపెనీ అంటోంది.

ఇండియా, నేపాల్,భూటాన్ ప్రాంతాల ప్రజలు నెలకు సగటున 36 జీబీ మొబైల్ డేటా ఖర్చు చేస్తుండగా...ప్రపంచం మొత్తమ్మీద నెలకు సగటు డేటా వాడకం 21జీబీ వద్ద ఉందని నివేదికలో పేర్కొన్నారు. గతేడాది ఈ ప్రాంతాల్లో నెలవారీ వాడకం 33జీబీల దాకా ఉంది. 2031 నాటికి ప్రపంచవ్యాప్తంగా డేటా వాడకం 39జీబీ దాకా ఉండవచ్చని ఆ సమయంలో ఇండియా తదితర ప్రాంతాల్లో డేటా వాడకం 65 జీబీల దాకా ఉంటుందని నివేదికలో ప్రస్తావించారు. ప్రస్తుతం పశ్చిమ యూరోప్ నార్త్ అమెరికా ప్రాంతాల్లో నెలవారీ డేటా 25జీబీలుగా ఉంటే...చైనాలో 23జీబీ, లాటిన్ అమెరికాలో 14జీబీలుగా ఉంది.

అలాగే రానున్న కాలంలో 5జీబీ వాడకం దారుల సంఖ్య 2025 ముగింపు నాటికి 394 మిలియన్ల మంది దాకా ఉంటుంది. ఈ దశాబ్దం చివర్లో వాడకం దారులు 1బిలయన్ సంఖ్యలో ఉంటారు. అంటే మార్కెట్ లో 79శాతం దాకా అన్నమాట. ఈ పెరుగుదల చూస్తుంటే భవిష్యత్తులో ప్రపంచానికే ఇండియా టెలికమ్యూనికేషన్ హబ్ గా అవతరిస్తోందని తెలుస్తోంది. సో చూశారుగా మనదేశం మొబైల్ వాడకంలో ఎలా దూసుకెళుతోందో...

Tags:    

Similar News