భారత సైన్యంలో సరికొత్త కవచం... ఏమిటీ ‘భైరవ్’ స్పెషాలిటీ..!
రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారత్.. అధునాతన క్షిపణి వ్యవస్థలపై దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే.;
రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారత్.. అధునాతన క్షిపణి వ్యవస్థలపై దృష్టి సారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది. తన అంబులపొదిలో సరికొత్త ఆయుధాలను సమకూరుస్తుంది. మరోవైపు సైన్యంలో కొత్త బెటాలియన్స్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా "బైరవ్" బెటాలియన్లపై ఇండియన్ ఆర్మీ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు.
అవును... పోరాట సంసిద్ధతను పెంచే.. సాంప్రదాయ పదాతిదళం, ప్రత్యేక దళాల మధ్య అంతరాన్ని తగ్గించే చర్యలో భాగంగా.. భారత సైన్యం కొత్తగా పెంచబడిన 'భైరవ్' బెటాలియన్లను వేగంగా అమలు చేయడం ప్రారంభించింది. ఇందులో భాగంగా... ఐదు భైరవ్ బెటాలియన్లు ఇప్పటికే క్షేత్ర శిక్షణ పొందుతున్నాయని, రాబోయే ఆరు నెలల్లో మొత్తం 25 బెటాలియన్లు సిద్ధం చేయనున్నట్లు భారత సైన్యం ధృవీకరించింది. ఒక్కో యూనిట్ లో 250 మంది సుశిక్షిత జవాన్లు ఉండనున్నట్లు తెలిపింది.
లెఫ్టినెంట్ అజయ్ కుమార్ స్పందిస్తూ...!:
తాజాగా ఈ విషయాలపై డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ అజయ్ కుమార్ స్పందించారు. ఇందులో భాగంగా... ఇప్పటికే ఐదు భైరవ్ బెటాలియన్లు ఏర్పాటయ్యాయని.. అక్టోబర్ 1 నుంచి శిక్షణ కొనసాగుతోందని.. ఈ నెల చివరి నాటికి శిక్షణ పూర్తవనుండగా.. తొలి బెటాలియన్ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని తెలిపారు. మరో నాలుగు బెటాలియన్ల ప్రక్రియ కొనసాగుతోందని.. రానున్న ఆరు నెలల్లో ఇలాంటివి 25 బెటాలియన్లను ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు.
ఈ భైరవ్ యూనిట్ లో ఒక్కోదానిలో 250 మంది జవాన్లు, ఏడు నుంచి ఎనిమిది మంది అధికారులు ఉండనున్నారు. సంఖ్యాపరంగా ఈ యూనిట్స్ చిన్నగా ఉన్నప్పటికీ చాలా శక్తిమంతమని చెబుతున్నారు. సాధారణ పదాతిదళ బెటాలియన్లు చేపట్టలేని, ప్రత్యేక బలగాల అవసరం లేని ఆపరేషన్లను భైరవ్ యూనిట్లు చేపడతాయని అంటున్నారు.
డైరెక్టర్ జనరల్.. భైరవ్ బెటాలియన్ పాత్ర, దాని అవసరాన్ని వివరిస్తూ... భారత సైన్యం తన పదాతిదళ బెటాలియన్లలో అష్ని ప్లాటూన్లను కూడా ఏర్పాటు చేస్తోందని ఆయన అన్నారు. డ్రోన్ కార్యకలాపాలలో ఇవి సహాయపడతాయని తెలిపారు. ఇది సైన్యం యొక్క పోరాట సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని.. 380 ఏ.ఎస్.ఎన్.ఐ. ప్లాటూన్లు ఇప్పటికే పనిచేస్తున్నందున, భారత సైన్యం తన డ్రోన్ యుద్ధ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు.
ఇదే సమయంలో... అష్ని ప్లాటూన్ల ఏర్పాటుతో పాటు, భారత సైన్యం తన ఫిరంగి సామర్థ్యాలను ఆధునీకరిస్తున్నదని.. 12 లాంచర్లు, 104 జావెలిన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను ఇప్పటికే పైప్ లైన్ లో ఉంచుతున్నామని అజయ్ కుమార్ పేర్కొన్నారు.