ఎబోలా ముంచుకొస్తోంది.. భారత్ లో హైఅలెర్ట్.. విమానాశ్రయాల్లో పెద్ద నిఘా!
ఎబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో ప్రాథమికంగా కింది లక్షణాలు కనిపిస్తాయి.
ఆఫ్రికా దేశాల్లో మళ్లీ ఎబోలా వైరస్ విజృంభణ ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో , ఉగాండా, సౌత్ సూడాన్ దేశాల్లో ఎబోలా కేసులు వేగంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా పెట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో హెల్త్ డెస్క్‌లను యాక్టివేట్ చేస్తూ ఉన్నతాధికారులకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక.. వైరస్ లక్షణాలు ఇవే!
ఎబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో ప్రాథమికంగా కింది లక్షణాలు కనిపిస్తాయి. తీవ్రమైన జ్వరం, నీరసం.. తలనొప్పి, కండరాల నొప్పులు.. గొంతు నొప్పి, వాంతులు, విరోచనాలు.. పరిస్థితి మరింత విషమిస్తే బాధితుల్లో అంతర్గత, బాహ్య రక్తస్రావం కూడా సంభవించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా సంక్రమిత రోగి యొక్క శరీర ద్రవాలైన రక్తం, లాలాజలం, చెమట మొదలైనవి ద్వారా ఈ వైరస్ ఆరోగ్యవంతులకు అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. అందుకే కోవిడ్ తరహాలోనే దీని విషయంలోనూ తీవ్ర జాగ్రత్తలు అవసరమని వైద్య శాఖ స్పష్టం చేసింది.
విమానాశ్రయాల్లో కఠిన నిబంధనలు.. 21 రోజుల క్వారంటైన్!
కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం.. ఆఫ్రికా దేశాల నుంచి ముఖ్యంగా ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా విమానాశ్రయాల్లోని హెల్త్ డెస్క్‌లలో తమ ఆరోగ్య పరిస్థితిని, ప్రయాణ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇటీవల ఆఫ్రికా దేశాలకు వెళ్లివచ్చిన వారు లేదా అక్కడి ప్రజలతో సన్నిహితంగా ఉన్నవారికి జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. అనుమానిత లక్షణాలు ఉన్న ప్రయాణికులను విమానాశ్రయాల నుంచే నేరుగా 21 రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించనున్నారు. ఈ కాలంలో వారిని ప్రత్యేక వైద్య పర్యవేక్షణలో ఉంచి, ఐసోలేషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మరణాలు
అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల నివేదికల ప్రకారం.. ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 600 ఎబోలా కేసులు నమోదు కాగా వారిలో 139 మంది మరణించారు. గతంలో కూడా ఆఫ్రికా ఖండంలో ఎబోలా మహమ్మారి వేలాది మంది ప్రాణాలను బలిగొన్న చేదు అనుభవాలు ఉన్నాయి. ప్రస్తుతం మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అంతర్జాతీయ సమాజం రక్షణ చర్యలు ప్రారంభించింది.
ఆందోళన వద్దు, అప్రమత్తత ముద్దు
భారత్‌లో ఇప్పటివరకు ఒక్క ఎబోలా కేసు కూడా నమోదు కాలేదని, కాబట్టి ప్రజలు అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. అన్ని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎబోలా అనుమానిత కేసుల కోసం ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలి. వైరస్ సోకిన వారికి చికిత్స అందించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ఆస్పత్రుల్లో అవసరమైన పీపీఈ కిట్లు, గ్లోవ్స్, ఇతర అత్యవసర మందులను అందుబాటులో ఉంచుకోవాలి.
వైరస్ నియంత్రణకు విమానాశ్రయాలు, రేవు పట్టణాల్లో స్క్రీనింగ్ ప్రక్రియను మరింత ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు కూడా ప్రస్తుత పరిస్థితుల్లో స్వయం నియంత్రణ పాటించాలని.. ఆరోగ్య నియమాలను గౌరవించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.