డేటా వాడంలో ప్రపంచంలో నె. 2 భారత్.. నోకియా సర్వేలో ఆసక్తికర విషయాలు..
ఒకప్పుడు కేవలం ఫోన్ కాల్స్, మెసేజ్‌కే పరిమితమైన మన మొబైల్ వాడకం, ఇప్పుడు డేటాతోనే ప్రపంచాన్ని చుట్టేస్తోంది.;
ఒకప్పుడు కేవలం ఫోన్ కాల్స్, మెసేజ్‌కే పరిమితమైన మన మొబైల్ వాడకం, ఇప్పుడు డేటాతోనే ప్రపంచాన్ని చుట్టేస్తోంది. నోకియా తన 13వ వార్షిక మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ ఇండెక్స్ లో వెల్లడించిన గణాంకాలు చూస్తుంటే భారతీయులు డేటా వాడకంలో ప్రపంచానికే పాఠాలు చెబుతున్నారని అనిపించకమానదు. సగటున ఒక భారతీయుడు నెలకు 31 జీబీ కంటే ఎక్కువ డేటాను ఖర్చు చేస్తున్నారంటే, మన డిజిటల్ విప్లవం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 5జీ సేవల విస్తరణ, చవకైన స్మార్ట్‌ఫోన్ల లభ్యతపై నోకియా నివేదికలోని ఆసక్తికరమైన అంశాలు కనిపించాయి.
31 జీబీ మార్కు దాటేశాం..
భారత్‌లో నెలవారీ డేటా వినియోగం ఐదేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో పెరిగింది. 2024లో సగటున 27.5 జీబీగా ఉన్న డేటా వినియోగం, 2025లో 31 జీబీ దాటిపోయింది. ఐదేళ్లలో 18 శాతం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటును సూచిస్తోంది. దేశంలో మొత్తం మొబైల్ డేటా రద్దీ నెలకు 27 ఎక్సాబైట్స్ దాటిపోయింది. అంటే భారతీయులు ఇంటర్నెట్‌లో గడుపుతున్న సమయం, చూస్తున్న వీడియోల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని అర్థం.
ప్రపంచంలోనే రెండో స్థానం!
5జీ సేవల రాకతో డేటా వేగం పెరగడమే కాకుండా, వినియోగం కూడా ఊహించని రీతిలో పెరిగింది. 5జీ వినియోగదార్ల సంఖ్యలోనూ, 5జీ డేటా వినియోగంలోనూ భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మొత్తం మొబైల్ డేటా రద్దీలో 5జీ వాటా దాదాపు 47 శాతానికి చేరుకుంది. 5జీ డేటా రద్దీ ఏడాదిలోనే 70 శాతం పెరిగి 12.9 ఎక్సాబైట్స్‌కు చేరడం విశేషం. ఇళ్లలో వైఫై లాగా వాడే 5జీ ఎఫ్‌డబ్ల్యూఏ వినియోగం ఏటా రెట్టింపుగా పెరుగుతోంది. మొత్తం 5జీ డేటాలో దీని వాటా 25 శాతం దాటేసింది.
స్మార్ట్‌ఫోన్ల విప్లవం!
డేటా వాడకంలో మెట్రో నగరాలు ఇంకా అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాయి. దేశంలోని మొత్తం మొబైల్ డేటా రద్దీలో 58 శాతం వాటా మెట్రో నగరాల నుంచే వస్తోంది. 100 డాలర్ల (సుమారు రూ. 8,500) లోపు లభించే 5జీ ఫోన్ల అమ్మకాలు పదింతలు పెరిగాయి. గతేడాది విడుదలైన స్మార్ట్‌ఫోన్లలో 90 శాతానికి పైగా 5జీ సపోర్ట్ చేసేవే కావడం గమనార్హం. దేశంలో ప్రస్తుతం 38.3 కోట్ల మంది 5జీ సేవలను నిరాటంకంగా వినియోగిస్తున్నారు.
100 కోట్ల మైలురాయి!
భారత్‌లో డేటా వినియోగం ఇక్కడితో ఆగేలా లేదు.., నోకియా నివేదిక ప్రకారం భవిష్యత్తు మరింత డిజిటల్‌గా ఉండబోతోందని తెలుస్తోంది. దేశంలో 5జీ వినియోగదార్ల సంఖ్య 100 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధస్సు (AI) వినియోగం పెరగడం, ఆన్‌లైన్ గేమింగ్, స్ట్రీమింగ్ సేవలు విస్తరించడం వల్ల డేటా అవసరాలు మరింత ఎక్కువగా పెరుగుతాయి.
నెలకు 31 జీబీ డేటా అంటే అది కేవలం వినోదం కోసమే కాదు.., విద్య, వైద్యం, బ్యాంకింగ్, వ్యాపారాలు అన్నీ ఇప్పుడు అరచేతిలోకి వచ్చేశాయని అర్థం. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద డేటా వినియోగదారుగా ఎదగడం మన టెక్నాలజీ అభివృద్ధికి నిదర్శనం. అయితే, ఇంత డేటా వాడుతున్న క్రమంలో మన సైబర్ భద్రతపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.