భారత్ దెబ్బకు 10 శాతం పతనమైన సెల్ బీ షేర్

దాయాదితో ఉద్రిక్తతల వేళ.. పాకిస్తాన్ కు బాహాటంగా మద్దతు ఇవ్వటమే కాదు.. ఆయుధాల్ని సైతం సప్లై చేసిన తుర్కియేతో కఠినంగా వ్యవహరిస్తోంది భారత్;

Update: 2025-05-17 04:15 GMT

దాయాదితో ఉద్రిక్తతల వేళ.. పాకిస్తాన్ కు బాహాటంగా మద్దతు ఇవ్వటమే కాదు.. ఆయుధాల్ని సైతం సప్లై చేసిన తుర్కియేతో కఠినంగా వ్యవహరిస్తోంది భారత్. ఆ దేశానికి చెందిన సంస్థలతో ఒప్పందాల్ని రద్దు చేసుకోవటమేకాదు.. ఆ దేశానికి వెళ్లేందుకు భారతీయులు సైతం సిద్ధంగా ఉండటం లేదు. ఈ క్రమంలో తుర్కియేకు చెందిన సెల్ బీ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని భారత్ ఉపసంహరించుకుంది. దీంతో.. ఈ కంపెనీ షేరు విలువకు బాగానే దెబ్బ పడింది.

భారతీయ విమానాశ్రయాల్లో సరకుల రవాణాతో పాటు బహుళ సేవల్ని అందించిన ఈ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని భారత ప్రభుత్వం రద్దు చేసుకుంది. అదే సమయంలో అదానీ సంస్థ సైతం సెల్ బీతో తాను చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో.. ఈ సంస్థకు చెందిన షేరు తీవ్రంగా ప్రభావితమైంది. మే 16న ఇస్తాంబుల్ లో ఆ కంపెనీ షేరు ధర ఏకంగా పది శాతం పతనం కాగా.. గత నాలుగు సెషన్లలో ఈ షేరు విలువ 30 శాతం ఆవిరి కావటం గమనార్హం.

సెల్ బీ సబ్సిడరీ కంపెనీ ద్వారా భారతీయ విమానాశ్రయాల్లో సరకుల రవాణాతో పాటు.. పలు సేవల్ని అందించేది. వీటన్నింటితోనూ ఒప్పందాల్ని రద్దు చేశారు. ముంబయి.. అహ్మదాబాద్.. మంగళూరు.. గువహాటి.. జైపూర్.. లక్నో.. తిరువనంతపురం విమానాశ్రయాల్ని అదానీ సంస్థ నిర్వహిస్తోంది. భారత ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా అదానీతో పాటు ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ కూడా సెల్ బీతో తాను చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇదిలా ఉండగా తమది తుర్కియే కంపెనీయే కాదన్న సెల్ బీ.. ఆ దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ కుటుంబంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

తుర్కియే దేశాధ్యక్షుడు ఎర్డోగాన్ కుమార్తె తమకు బాస్ కాదని వివరణ ఇచ్చింది. తుర్కియే అధ్యక్షుడి కుమార్తె సుమెయ్యి తమ కంపెనీని నియంత్రిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని..అసలు తమది తుర్కియే సంస్థే కాదని.. తమ కంపెనీ యాజమాన్య హక్కులు సెల్ బీ యోగ్లు కుటుంబానికే పరిమితమని పేర్కొంది. తమకు ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని చెప్పింది. అయినప్పటికీ.. ఈ సంస్థతో చేసుకున్న ఒప్పందాల్నిభారత్ లోని కంపెనీలు రద్దు చేసుకుంటున్నాయి.

Tags:    

Similar News