స‌గానికి త‌గ్గిన 'ఇండియా' కూట‌మి

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి కీల‌క స‌మావేశం సో.. సో.. ప్రారంభ‌మైంది.

Update: 2026-06-08 22:30 GMT

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మి కీల‌క స‌మావేశం సో.. సో.. ప్రారంభ‌మైంది. సోమవారం ఢిల్లీలోని కాన్ స్టిట్యూష‌న్ క్ల‌బ్‌లో ప్రారంభ‌మైన ఈ స‌మావేశానికి `ఇండియా జ‌న్‌బంధ‌న్‌` అని పేరు పెట్టారు. అయితే. కూట‌మిలో ఉన్న పార్టీల్లో 23 రాజ‌కీయ పార్టీల‌కు చెందిన నాయ‌కులు హాజ‌ర‌వుతార‌ని తొలుత కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది. దీంతో ఆ మేర‌కు ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, చివ‌ర‌కు 9 పార్టీల నుంచి నాయ‌కులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

మ‌మ‌త రాయ‌బారం..

మ‌రోవైపు.. కేంద్రంపైనిప్పులు చెరుగుతున్న ప‌శ్చిమ బెంగాల్ మాజీ ముఖ్య‌మంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి.. మ‌మ‌తా బెన‌ర్జీ.. ఈ స‌మావేశానికి ముందు కీల‌క రాయ‌బారం చేశారు. ఢిల్లీ మాజీ ముఖ్య మంత్రి, ఆమ్‌, ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌ను ఇండియా జ‌న్‌బంధ‌న్ స‌మావేశానికి తీసుకు వ‌చ్చేందుకు ఆమె విశ్వ ప్ర‌య‌త్నం చేసిన‌ట్టు జాతీయ మీడియా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆదివారం సాయంత్రానికే ఢిల్లీ చేరుకున్న మ‌మ‌త‌.. నేరుగా కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు.

ఇండియా కూట‌మి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చామ‌ని.. ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో కేజ్రీవాల్‌తో ఆమె భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది. గ‌త విభేదాలు ప‌క్క‌న పెట్టాల‌ని.. మోడీని గ‌ద్దెదించేందుకు విప‌క్షాలు ఐక్యంగా ఉండేందుకు.. ఈ స‌మావేశం అత్యంత కీల‌క‌మ‌ని మ‌మ‌త వివ‌రించిన‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో బెట్టు వీడి స‌మావేశానికి రావాల‌ని కోరారు. అయిన‌ప్ప‌టికీ.. కేజ్రీవాల్ తిర‌స్క‌రించారు. పైగా.. ఆయ‌న కాక్రోచ్ జ‌నతాపార్టీకి మ‌ద్ద‌తుగా ఉన్నార‌న్న‌చ‌ర్చ కూడా సాగింది.

మ‌రోవైపు.. త‌మిళ‌నాడు నుంచి డీఎంకే అధినేత స్టాలిన్ వ‌స్తార‌ని కాంగ్రెస్ భావించినా.. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం.. కాంగ్రెస్ పార్టీ డీఎంకేకు షాకిస్తూ.. టీవీకేతో చేతులు క‌లిపింది. దీంతో స్టాలిన్ రాలేదు. పైగా.. ఆయ‌న‌పార్టీ నాయ‌కుల‌ను కూడా పంపించ‌లేదు. ఇక‌, టీవీకే పార్టీ అధినేత‌, సీఎం విజ‌య్ ఇండియా కూట‌మి స‌మావేశానికి వ‌స్తున్నార‌న్న స‌మాచారం వ‌చ్చినా.. ఆయ‌న‌ను ఆహ్వానించ లేద‌ని కాంగ్రెస్ పార్టీ ప్ర‌క‌టించింది.

మ‌రోవైపు మ‌హారాష్ట్ర‌కు చెందిన మిత్ర‌ప‌క్షాలు ఎన్ సీపీ, శివ‌సేన‌(యూబీటీ) వ‌ర్గాలు కూడా కూట‌మి స‌మావేశానికి దూరంగా ఉన్నాయి. ఉద్ద‌వ్ ఠాక‌రే.. కేవ‌లం వ‌ర్చువ‌ల్‌గా హాజ‌రవుతార‌ని స‌మాచారం ఇచ్చారు. ఎన్‌సీపీ నేత‌లు మౌనంగా ఉండిపోయారు. ఇలా.. ఇండియా కూట‌మి.. స‌మావేశం గ‌తంలో ఉన్నంత‌క‌ళగా అయితే సాగ‌లేదు. నాయ‌కుల గైర్హాజ‌రుతో వారి కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు బోసిపోయి ఖాళీగా క‌నిపించాయి. వాటి ముందు పేర్లు మాత్రం క‌నిపించాయి.

Tags:    

Similar News