భారత బ్యూటీ మార్కెట్ రూ.2 లక్షల కోట్లు.. ఇప్పుడేం జరుగుతుందంటే?
మిగిలిన అంశాలు ఎలా ఉన్నా... తమ మార్కెట్ పరిధిని విస్తరించాలని భావించే ఏ కంపెనీకి అయినా భారతదేశం ఒక బంగారు బాతుగుడ్డు లాంటిది;
మిగిలిన అంశాలు ఎలా ఉన్నా... తమ మార్కెట్ పరిధిని విస్తరించాలని భావించే ఏ కంపెనీకి అయినా భారతదేశం ఒక బంగారు బాతుగుడ్డు లాంటిది. ఇక్కడి మార్కెట్ లో పాగా వేస్తే.. వారికి తిరుగు ఉండదు. మొన్నటి వరకు భారతీయుల కొనుగోలు శక్తి మీద అంతర్జాతీయ బ్రాండ్లకు కొన్ని సందేహాలు ఉండేవి.కానీ.. గడిచిన రెండు దశాబ్దాల్లో భారత మార్కెట్ విస్తరించుకుంటూ వెళుతున్న వైనం.. భారతీయుల్లో పెరిగినకొనుగోలు శక్తి.. అంతర్జాతీయంగా ఉన్న ఎన్నో కంపెనీల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇందులో భాగంగా పలు గ్లోబల్ బ్రాండ్స్ భారత మార్కెట్ మీద కన్నేస్తున్నాయి.
బ్యూటీ బ్రాండ్లకు సంబంధించి అంతర్జాతీయంగా పేరున్న ఎన్నో బ్రాండ్లు ఇప్పుడు భారత మార్కెట్ ను ఆసక్తిగా చూస్తున్నాయి. దీనికి తగ్గట్లే సౌందర్య.. వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్స్ లోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. మన బ్యూటీ మార్కెట్ తక్కువేం కాదు. ప్రస్తుతం రూ.2.1 లక్షలకోట్ల మార్కెట్ ఉంది. 2030 నాటికి ఈ మార్కెట్ కాస్తా.. రూ.4 లక్షల కోట్లకు పైనే మార్కెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇంతటి భారీ అవకాశాల్ని ఏ కంపెనీ మాత్రం వదులుకుంటుంది?
దీనికి తోడు బ్యూటీ కేటగిరిలో పెట్టే పెట్టుబడులపై సగటున 10 నుంచి 25 రెట్ల రాబడులు వస్తున్న వేళ.. భారీగా వచ్చే మార్జిన్లను సొంతం చేసుకోవటానికి వీలుగా కంపెనీలు పోటెత్తుతున్నాయి. లగ్జరీ స్కిన్ కేర్ రంగంలోకి తమ మార్కెట్ వాటాను విస్తరించుకోవటం కోసం యూనిలీవర్ వెంచర్స్ దాదాపు 5మిలియన్ డాలర్లు (సుమారు రూ.50 కోట్ల వరకు), ఆయుర్వేదిక్ బ్యూటీ బ్రాండ్ ఇండి వైల్డ్ కూడా మరో రూ.50 కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధమవుతున్నాయి.
ఒక్క ఆగస్టులోనే రెనీ కాస్మెటిక్స్ సంస్థ సిరీస్ సీ విడత కింద ప్లేబుక్.. మిడాస్ పార్టనర్స్. . ఇతర పెట్టుబడిదారుల నుంచి 5.8 మిలియన్ డాలర్లను సేకరించింది. ఫాక్స్ టేల్ సంస్థ సైతం వివిధ సంస్థల నుంచి ఏకంగా 30 మిలియన్ డాలర్లు (రూ.266 కోట్లు) పెట్టుబడుల్ని దక్కించుకుంది. ఇవి కాకుండా బేర్ అనాటమీ.. కెమిస్ట్ ఎట్ ప్లే.. సన్ సూకప్ లాంటి బ్రాండ్స్ 16 మిలియన్ డాలర్లను సమకూర్చుకోవటం చూస్తే.. భారత బ్యూటీ మార్కెట్ మీద గ్లోబల్ స్థాయిలో వివిధ సంస్థలు ఎంతలా ఫోకస్ పెట్టాయో అర్థమవుతుంది.
ప్రస్తుతం భారతీయ బ్యూటీ.. పర్సనల్ కేర్ ఉత్పత్తుల మార్కెట్ సైజు రూ.2 లక్షల కోట్ల వరకు ఉంటే.. 2030 నాటికి ఏకంగా రూ.4 లక్షలకోట్ల మేరకు పెరిగే వీలుందని అంచనాలు వేస్తున్నారు. ఈ మార్కెట్లకు సంబంధించి ఆన్ లైన్ కేటగిరీ వాటా 2023లో 13 శాతం ఉంటే.. 2024 నాటికి 17 శాతం విస్తరించటంతో.. ఆన్ లైన్ మార్కెట్ ను తేలిగ్గా సొంతం చేసుకోవటానికి పలు బ్రాండ్లు ప్రయత్నిస్తున్నాయి.
ఈ వాదనకు బలం చేకూరేలా దిగ్గజ సంస్థలు సైతం ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు మార్కెట్ ఎలా ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దిగ్గజ యూనీ లివర్ సంస్థ దేశీ స్కిన్ కేర్ బ్రాండ్ అయిన మినిమలిస్ట్ లో 90.5 శాతం వాటాను కొనుగోలు చేస్తే.. మరో దిగ్గజ సంస్థ మారికో దాదాపు రూ.400 కోట్లతో బియర్డోను కొనుగోలు చేసింది. ఇమామీ సంస్థ ది మ్యాన్ సంస్థను సొంతం చేసుకుంది. స్వీడిష్ బ్రాండ్ హెచ్అండ్ఎం ఇటీవల భారత బ్యూటీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వగా.. రిలయన్స్ కు చెందిన టీరాతో కలిసి పాప్ ఐకాన్ రిహానా తన ఫెంటీ బ్రాండ్ ను భారత్ లోకి తీసుకొచ్చింది.
ఇదే రీతిలో పలు అంతర్జాతీయ బ్రాండ్లు (ఎంఏసీ, హుడా, అనస్టాసియా బెవర్లీ హిల్స్, స్మాష్ బాక్స్, చార్లొట్ టిల్ బరీ) భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. గడిచిన ఐదేళ్లలో భారత్ లో కొరియన్ చిత్రాలు.. వెబ్ సిరీస్ లకు పెరిగిన ఆదరణ ఎంతో తెలిసిందే. దీంతో.. బ్యూటీ రంగంలో ప్రీమియం రంగానికి చెందిన కొరియన్ బ్రాండ్లు (ఇన్నిస్ ఫ్రీ, కాస్ ఆర్ ఎక్స్, బ్యూటీ ఆఫ్ జోసియోన్) తదితర బ్రాండ్లు భారత మార్కెట్ లో పాగా వేసేందుకు వీలుగా ప్లానింగ్ చేస్తుండటమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు.