మమత స్టాలిన్ గెలిస్తే అభిషేక్ ఉదయ్ లకు గోల్డెన్ చాన్స్

మూడు దశాబ్దాలకి పైగా వయసు కలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాలుగవ సారి వరసగా గెలిస్తే కనుక మరింతగా పటిష్టం అయినట్లే.;

Update: 2026-04-10 02:30 GMT

ఇపుడు దేశంలో రెండు కీలక రాష్ట్రాల ఎన్నికలు మిగిలి ఉన్నాయి. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడింటికి ఏప్రిల్ 9న పోలింగ్ ముగిసింది. పార్టీల జాతకాలు ఈవీఎంలలో నిక్షిప్తం అయి ఉన్నాయి. అయితే అసలైన రాజకీయ సమరం ఈ నెల 23న ఉంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడులలలో జరిగే శాసన సభ ఎన్నికల్లో ఢీ అంటే ఢీ అంటూ సీఎంలు మమతా బెనర్జీ, స్టాలిల్ లతో ఎన్డీయే పోటీ పడుతోంది. ఇక రెండోసారి సీఎం అయ్యేందుకు స్టాలిన్ చూస్తూంటే ఏకంగా నాలుగవ సారి సీఎం కావాలని మమత భారీ స్కెచ్ తోనే సమాయత్తం అయ్యారు. నిజం చెప్పాలంటే ఈ ఇద్దరు నాయకులు ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి అత్యంత కీలకమైనవి.

పాగా వేయాలని :

పశ్చిమ బెంగాల్ లో పాగా వేయాలన్న బీజేపీ కోరిక 2021 నాటిది. అప్పట్లో సాధ్యం కానిది 2026లో నెరవేర్చుకోవాలని బీజేపీ ఆరాటపడుతోంది. పశ్చిమాన గెలుపుతో కాషాయం విస్తరణకు లోటు తీరుతుందని లెక్క వేస్తోంది. ఇక తమిళనాడు మరో కీలక రాజకీయ స్థావరంగా బీజేపీ చూస్తోంది. అక్కడ గెలిస్తే సౌత్ లో మంచి పట్టు దక్కుతుందని కూడా అంచనా కడుతోంది. తమిళనాడు మీదుగా తెలంగాణా వయా కర్ణాటకలలో కాషాయ ప్రభంజనం ఆగించాలని కూడా బీజేపీ టార్గెట్లు పెట్టుకుంది.

ఇండియా కూటమికి బలం :

ఇక పరికిస్తే కనుక స్టాలిన్ కానీ మమతా బెనర్జీ ఇండియా కూటమికి అసలైన బలంగా ఉన్నారు. ఈ ఇద్దరి చేతిలో దాదాపుగా వందదాకా ఎంపీ సీట్లు ఉన్నాయి. పెంచిన సీట్లు కలుపుకుంటే అది 125 దాకా అయ్యే అవకాశం ఉంది. ఈ నంబరే ఇపుడు బీజేపీని కలవరపెడుతోంది. అందుకే ఇక్కడ అధికారం సాధించడం బీజేపీకి అత్యవసరం అని వేరేగా చెప్పాల్సిన పని లేదు. అయితే మమత కానీ స్టాలిన్ కానీ ఉద్దండ పిండాలు. వారి రాజకీయ వ్యూహాలు ఎంతో పదును తేరి ఉంటాయి. పైగా ఈ ఇద్దరు నేతలూ లోకల్ లీడర్స్ గా పాపులర్. వారే అతి పెద్ద సెంటిమెంట్ గా మారిపోయారు. అదే రక్షణ కవచంగా ఆయా పార్టీలకు మారుతోంది.

గెలిస్తే మరింత పటిష్టం :

మూడు దశాబ్దాలకి పైగా వయసు కలిగిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాలుగవ సారి వరసగా గెలిస్తే కనుక మరింతగా పటిష్టం అయినట్లే. దాంతో పాటు మమత తర్వాత తరానికి కూడా దారులు తెరచుకుంటాయి అని అంటున్నారు. మమత 2029 ఎన్నికల కోసం జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు అని వార్తలు ఊపందుకుంటున్నాయి. ఆమె లక్ష్యం ప్రధాని పీఠం మీద ఉందని అంటున్నారు. దాంతో మమత బెంగాల్ సీఎం గా నాలుగవ సారి ప్రమాణం చేసినా 2029లోగా తన వారసుడికి పగ్గాలు అప్పగిస్తారు అని అంటున్నారు. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్ అన్నీ తానై వ్యవహరిస్తున్న ఆమె మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ బెంగాల్ కి తదుపరి సీఎం అవుతారు అని అంటున్నారు. ఆయన కూడా ఈ మధ్య ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ప్రధాని అభ్యర్థిగా మమతను పేర్కొనడం విశేషం. అంటే బెంగాల్ సీఎం గా ఆయన ముందు వరసలోకి వచ్చేస్తారు అన్న మాట.

ఉదయనిధికి కిరీటం :

ఇక తమిళనాడులో కూడా అదే వారసత్వ రాజకీయానికి తెర లేవనుంది. తన తండ్రి కరుణానిధి వారసుడిగా ఇరవై ఏళ్ళకే రుజువు చేసుకున్న స్టాలిన్ సీఎం కావడానికి మాత్రం అయిదు దశాబ్దాల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. అయితే తన కుమారుడు ఉదయ నిధి స్టాలిన్ కి ఆ ఇబ్బంది లేకుండా స్టాలిన్ తెర వెనక పూర్తి కసరత్తు చేసి ఉంచారు. ఆయనను రెండేళ్ళ క్రితమే ఉప ముఖ్యమంత్రిగా చేశారు ఇక మరోసారి డీఎంకే గెలిస్తే స్టాలిన్ సీఎం గా రెండవసారి ప్రమాణం చేస్తారు. కానీ 2029 నాటికి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు అని అంటున్నారు. ఇండియా కూటమి గెలుపు కోసం స్టాలిన్ మరింతగా టైం కేటాయిస్తారని అదే సమయంలో కుమారుడిని సీఎం సీట్లో కూర్చోబెట్టి భావి వారసత్వాని బలోపేతం చేస్తారు అని అంటున్నారు. మొత్తం మీద ఈసారి గెలుపు మమత స్టాలిన్ ల కంటే అభిషేక్ ఉదయనిధిలకు ఎంతో ముఖ్యం అని అంటున్నారు.

Tags:    

Similar News