గుజరాత్ ప్రమాదం: రంగంలోకి అమెరికా నిపుణులు!
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొన్నినిమిషాలకే కుప్ప కూలిన బోయింగ్ 171 విమానం ప్రమాదానికి గల కారణాలు అంతుచిక్కలేదు.;

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొన్నినిమిషాలకే కుప్ప కూలిన బోయింగ్ 171 విమానం ప్రమాదానికి గల కారణాలు అంతుచిక్కలేదు. దేశంలోని వైమానిక నిపుణులు.. ఇతర సాంకేతిక నిపుణులు కూడా.. ఈ ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించలేక పోతున్నారు. ప్రమాద తీవ్రత తెలుస్తున్నా.. ప్రమాదానికి కారణాలను మాత్రం అన్వేషించలేకపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. గంటలు గడిచిన తర్వాత.. కూడా బోయింగ్ విమానం ఎందుకు కుప్పకూలిందో తెలియని పరిస్థితి నెలకొంది.
అటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, ఇటు విమానాయాన శాఖలు కూడా ఈ విషయంపై తీవ్ర ఆవేదన, ఆందో ళన వ్యక్తం చేస్తున్నాయి. పైకి చెబుతున్నట్టు సాంకేతిక వైఫల్యం అంటున్నా.. సదరు సాంకేతిక వైఫల్యం పైనా క్లారిటీ లేదు. అదేవిధంగా పక్షులు ఢీకొట్టాయని తాజా సమాచారం ఇస్తున్నా.. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లేవు. దీంతో ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ అటు నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండి యా విమానం ప్రమాద వ్యవహారం ఉత్కంఠగా మారింది.
దేశంలో ఉన్న పౌరులకు ఎలాంటి సమాధానం చెప్పినా.. ఏమీ కాదు. కానీ.. ఈ ప్రమాదంలో విదేశాలకు చెందిన వారు కూడా చనిపోయారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ నుంచి భారత్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో ఇప్పుడు హుటాహుటిన బోయింగ్ విమాన ప్రమాదం కారణాలను అన్వేషించేందుకు భారత ప్రభుత్వం అమెరికా నుంచి నిపుణులను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
బోయింగ్ విమానాలు.. అమెరికా నుంచే దిగుమతి చేసుకున్న నేపథ్యంలో అక్కడి నిపుణులను తీసుకువచ్చి.. కారణాలు అన్వేషిస్తే.. ఫలితం ఉంటుందని సర్కారు నిర్ణయించుకుంది. దీంతో ఇప్పటికే విదేశాంగ శాఖ అమెరికాకు అభ్యర్థన పంపించింది. అయితే.. ప్రస్తుతం ట్రంప్ సుంకాల బెడద నేపథ్యంలో ఈ ప్రమాదానికి గల కారణాలు అన్వేషించేందుకు ఏమేరకు సహకరిస్తారన్నది ప్రశ్న.