పాక్ కు రూ.7,500 కోట్ల సాయం... ఇచ్చిపడేసిన ఒమర్ అబ్దుల్లా!

ఈ వ్యవహారంపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు.;

Update: 2025-05-10 06:07 GMT

మంచికంటే చెడుకు మనుగడ, మద్దతు ఎక్కువ, అవకాశాలు ఎక్కువే అని అంటుంటారు. తాజాగా అంతర్జాతీయంగా జరిగిన ఓ ఘటన పైవాక్యాన్ని మరింత బలపరుస్తుంది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ.. వారికి దత్త తండ్రిగా ఉంటూ.. వారిని భారత్ పైకి ఉసిగొల్పుతూ.. రాక్షసానందం పొందుతున్న పాకిస్థాన్ కు తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది ఐ.ఎం.ఎఫ్!

అవును... ఆర్థిక పరిస్థితి మొత్తం చిన్నాభిన్నమై, అన్ని రకాలుగా కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్ కు చుక్కానీ దొరికింది! ఇందులో భాగంగా... అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐ.ఎం.ఎఫ్) ను 7 బిలియన్ల యూఎస్ డాలర్ల సాయం అడగ్గా.. తాజాగా ఒక బిలియన్ డాలర్స్ సాయాన్ని ప్రకటించింది. అంటే అక్షరాలా రూ.7,500 కోట్లన్నమాట!

దీనిపై స్పందించిన పాక్ ప్రధాని కార్యాలయం.. ఐ.ఎం.ఎఫ్. తమకు 1 బిలియన్ యూఎస్ డాలర్ల అప్పు ఇచ్చిందని.. వాస్తవానికి తాము 7 బిలియన్ యూఎస్ డాలర్ల రుణం అడిగామని.. ప్రస్తుతానికి 1 బిలియన్ యూఎస్ డాలర్లు ఇచ్చారని పేర్కొంది. ఏది ఏమైనా.. ఐఎంఎఫ్ తాజా నిర్ణయం సంతృప్తికరంగానే ఉందని పాక్ ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు.

అయితే... ఐఎంఎఫ్ తీసుకున్న నిర్ణయంపై భారత్ మండిపడింది. పాక్ ఈ సాయాన్ని ఉగ్రవాదాన్ని ప్రేరేపించేందుకే వాడుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే విషయాన్ని వరల్డ్ బ్యాంక్ ముందు లేవనెత్తింది. ఇదే సమయంలో.. ఐఎంఎఫ్ లో పాకిస్థాన్ కు రుణం ఇచ్చే ఓటింగ్ ను భారత్ బహిష్కరించింది.

ఒమర్ అబ్ధుల్లా కీలక వ్యాఖ్యలు!:

ఈ వ్యవహారంపై జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పాకిస్థాన్ కు 1 బిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించడం అనేది అనేక ప్రాంతాలను నాశనం చేయడానికి ఆ దేశం ఊపయోగిస్తున్న ఆయుధాలకు 'రీయింబర్స్ మెంట్' అని అన్నారు. ఇదే సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... భారత్ - పాక్ లు ఉద్రిక్తతలను తగ్గించాలని నిరంతరం విజ్ఞప్తి చేస్తున్న ప్రపంచ దేశాలు... ఐఎంఎఫ్ రుణ ఆమోదం వంటి తాజా చర్యలు ఉద్రిక్తతలు తగ్గడానికి ఎలా సహాయపడాతాయో చెప్పాలని అన్నారు. పెరుగుతున్న అప్పుల భారం మధ్య నాశనమైన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టుకోవడానికి పాక్ కు ఈ రుణం ఓ జీవనాడి లాంటిదని అంటున్నారు.

కాగా ఐఎంఎఫ్ లో ఉన్న కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, యూ.ఎస్.ఏ. దేశాల్లో మెజారిటీ దేశాలు.. భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు త్వరగా చల్లబడాలని కోరుకుంటూ ప్రకటనలు ఇస్తున్న సంగతి తెలిసిందే! అలాంటి ప్రకటనలు ఇస్తూ, ఇలాంటి సహాయాలు చేస్తే ఉద్రిక్తతలు ఎలా తగ్గుతాయనేది ఒమర్ అబ్దుల్లా ప్రశ్న!

Tags:    

Similar News