అర్థరాత్రి వేళ.. అక్రమ గ్రావెల్ ను అడ్డుకున్న మహిళా నేత
అక్రమ గ్రావెల్ తవ్వకాలకు చెక్ పెట్టేందుకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రదర్శించిన తెగింపు అందరిని ఆకర్షించింది.
ఆరోపణలు చేయటం ఒక ఎత్తు. అందుకు తగ్గ ఆధారాల్ని చూపిస్తూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించటం వేరు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మహిళా ఎమ్మెల్యే. అక్రమంగా సాగుతున్న గ్రావెల్ తవ్వకాల్నిఅడ్డుకున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. అక్రమ గ్రావెల్ తవ్వకాలకు చెక్ పెట్టేందుకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రదర్శించిన తెగింపు అందరిని ఆకర్షించింది.
అక్రమ గ్రావెల్ తవ్వకాల గురించి సమాచారం అందుకున్న ఆమె.. సోమవారం అర్థరాత్రివేళ పార్టీ నేతలతో కలిసి రాఘవాపురం కొండ వద్దకు చేరుకున్నారు. సదరు నిందితుడిపై చర్యలు తీసుకునే వరకు కదిలేది లేదంటూ.. అక్కడే ఉండిపోయారు. మంగళవారం తెల్లవారుజామునమూడు గంటల వరకు ఆమె అక్కడే ఉన్నారు. అక్రమార్జన కోసం విపరీతంగా ఇసుకను తవ్వేయటం కారణంగా.. ఎక్కడ ఎంత గొయ్యి ఉంటుందో తెలీని పరిస్థితి ఉందన్నారు.
ఇటీవల కాలంలోముగ్గురు యువకుల ప్రాణాలు పోయాయన్న ఆందోళన వ్యక్తం చేసిన ఆమె.. మరణించిన వైనంపై అధికారుల్లో చలనం లేదని మండిపడ్డారు. ఇసుక.. గ్రావెల్ అక్రమ తవ్వకాలకు చెక్ పెట్టే విషయంలో అధికారుల తీరును తప్పు పట్టిన ఆమె.. అక్రమార్కుల్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తున్న చోట ఉండిపోయారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
అర్థరాత్రి మొదలైన నిరసన తెల్లవారుజామున మూడు గంటల వరకు సాగింది. ఆ టైంలో.. ఘటనాస్థలానికి వచ్చిన ఎస్ఐ కు కంప్లైంట్ ఇచ్చిన సౌమ్య.. అక్రమంగా తవ్వకాలకు పాల్పడిన జేసీబీ.. టిప్పర్ ను అప్పగించారు. మిగిలిన తెలుగు తమ్ముళ్లతో పోలిస్తే.. మహిళా నేత అయినప్పటికీ పక్కాప్లానింగ్ తో వ్యవహరించిన తీరు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. అక్రమాలను అడ్డుకోవటానికి ఎలాంటి వ్యూహం అమలు చేయాలన్న దానికి సౌమ్య వ్యవమరించిన తీరు ఇప్పుడో మోడల్ గా మారుతుందన్న మాట వినిపిస్తోంది.