23లో టాంజానియా.. 26లో నైజీరియా.. విస్తరిస్తున్న భారత్ క్యాంపస్ లు!

ఐఐటీ నైజీరియా క్యాంపస్‌ ను సులేజాలోని ఫెడరల్ గవర్నమెంట్ అకాడమీ (ఎఫ్.జీ.ఏ)లో ఏర్పాటు చేస్తారు. దీనిని 'నైజీరియన్ అకాడమీ ఫర్ ది గిఫ్టెడ్' అని కూడా పిలుస్తారు.;

Update: 2025-10-30 20:30 GMT

భారతదేశంలోని అత్యున్నత ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అంతర్జాతీయంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. భారతీయ విశ్వవిద్యాలయాలు విదేశాల్లో క్యాంపస్ లను స్థాపించడానికి ప్రోత్సహించే జాతీయ విద్యా విధానం (ఎన్.ఈ.పీ) - 2020లో భాగంగా త్వరలో పశ్చిమ ఆఫ్రికాలోనూ ఐఐటీ క్యాంపస్ ను ఏర్పాటుచేయనున్నారు.

అవును... ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లు ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతున్నాయి. ఇందులో భాగంగా... త్వరలో పశ్చిమ ఆఫ్రికాలోని నైజీరియాలో మొదటి ఐఐటీ క్యాంపస్‌ ను ఏర్పాటు చేయనుంది. ఈ చొరవ భారతదేశ అంతర్జాతీయ విద్యా విస్తరణలో ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. అన్నీ అనుకూలంగా జరిగితే 2026 నాటికి నైజీరియాలో క్యాంపస్‌ ను ఏర్పాటు చేయనుంది.

ఇండో-నైజీరియన్ విద్య బలోపేతం!:

ఐఐటీ నైజీరియా క్యాంపస్‌ ను సులేజాలోని ఫెడరల్ గవర్నమెంట్ అకాడమీ (ఎఫ్.జీ.ఏ)లో ఏర్పాటు చేస్తారు. దీనిని 'నైజీరియన్ అకాడమీ ఫర్ ది గిఫ్టెడ్' అని కూడా పిలుస్తారు. దాని బలమైన విద్యా పునాది, సైన్స్ అండ్ టెక్నాలజీకి ప్రాంతీయ కేంద్రంగా మారే సామర్థ్యం కోసం ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఈ అకాడమీని భారత్‌ సహకారంతో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'గా మార్చనున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన నైజీరియాలో భారత హైకమిషనర్ అభిషేక్ సింగ్... ఈ క్యాంపస్ ఐఐటీ మద్రాస్ - జాంజిబార్ మోడల్‌ ను అనుసరిస్తుందని.. భారతదేశం అధ్యాపకులు, శిక్షణను అందిస్తుందని.. నైజీరియా మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్‌ లను అందిస్తుందని అన్నారు. ఇండో-నైజీరియన్ల ఉమ్మడి బృందం ఫ్యాకల్టీని నియమిస్తుంది, కోర్సుల డిజైన్ ను నిర్వహిస్తుంది.

ఇండియా గ్లోబల్ ఎడ్యుకేషన్ డ్రైవ్..!:

విద్యను ప్రపంచీకరించాలనే భారతదేశ విస్తృత ప్రణాళికలో ఐఐటీ నైజీరియా ఓ భాగం. వాస్తవానికి 2023 నవంబర్ లోనే టాంజానియాలో ఐఐటీ మద్రాస్–జాంజిబార్ క్యాంపస్ ప్రారంభించబడింది. ఇదే క్రమంలో 2 సెప్టెంబర్ 2024లో ఐఐటీ ఢిల్లీ–అబుదాబి కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. ఈ క్రమంలో 2026లో నైజీరియాలో ఐఐటీ క్యాంపస్ ప్రారంభం కాబోతోంది!

తగ్గనున్న బ్రెయిన్ డ్రెయిన్ సమస్య!:

ఈ క్యాంపస్ ద్వారా భారత్, నైజీరియా మధ్య విద్యా, సాంకేతిక రంగాల్లో సహకారం మరింత పెరుగుతుందని అంటున్నారు. నైజీరియా విద్యార్థులకు స్వదేశంలోనే నాణ్యమైన ఇంజినీరింగ్, సాంకేతిక విద్యను అందించడానికి భారత ఐఐటీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇది 'బ్రెయిన్ డ్రెయిన్' సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. కాగా.. ఉన్నత విద్య, పరిశోధన సౌకర్యాలు, వృత్తిపరమైన ఎదుగుదల కోసం విదేశాలకు వెళ్లడాన్నే బ్రెయిన్ డ్రెయిన్ అంటారు!

Tags:    

Similar News