బతకుజీవుడా.. 150 అడుగుల ఎత్తున ఆగిపోయిన స్కై డైనింగ్ రెస్టరెంట్.. టూరిస్టుల బాధ చూడాలి

ఆనందం ఆవిరైంది. 150 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయేలా చేసింది. ఆకాశ రెస్టారెంట్ అని 150 అడుగుల ఎత్తులో భోజనం అని గొప్పగా వెళ్లిన కుటుంబానికి పట్టపగలే చుక్కలు కనిపించాయి.;

Update: 2025-11-29 03:53 GMT

ఆనందం ఆవిరైంది. 150 అడుగుల ఎత్తులో చిక్కుకుపోయేలా చేసింది. ఆకాశ రెస్టారెంట్ అని 150 అడుగుల ఎత్తులో భోజనం అని గొప్పగా వెళ్లిన కుటుంబానికి పట్టపగలే చుక్కలు కనిపించాయి. కేరళలోని ఇడుక్కి జిల్లాలో టూరిస్టులు హడలెత్తిపోయే ఘటన చోటుచేసుకుంది. ఆకాశంలో భోజనం ఆరగిస్తూ ప్రకృతిని ఆస్వాదించేలా ఏర్పాటు చేసిన స్కై డైనింగ్‌ రెస్టారెంట్ అకస్మాత్తుగా 150 అడుగుల ఎత్తులో ఆగిపోవడంతో ఒక కుటుంబం రెండు గంటలపాటు ప్రాణ భయంతో గడిపింది. కన్నుల పండువగా ఉండాల్సిన అనుభవం ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది.

అనాచల్‌లో ఉన్న ఈ స్కై డైనింగ్‌లో శుక్రవారం మధ్యాహ్నం కొళికోడ్‌కు చెందిన ఓ కుటుంబం భోజనానికి చేరుకుంది. క్రేన్‌ ఆధారంగా పైకి ఎత్తే ఈ రెస్టారెంట్‌ 150 అడుగుల ఎత్తుకు చేరిన కొద్దిసేపటికి హైడ్రాలిక్‌ వ్యవస్థలో సమస్య తలెత్తి క్రేన్‌ పనిచేయడం పూర్తిగా ఆగిపోయింది. దీంతో ఇద్దరు చిన్నారులతో ఉన్న తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాలిలో వేలాడుతూ ఏమైపోతుందోనన్న భయంతో కుటుంబం ఆర్తనాదాలు చేసింది.

ఘటన గురించి ముందుగా సమాచారం ఇచ్చింది రెస్టారెంట్‌ యాజమాన్యం కాదు… అక్కడి స్థానికులే. స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ ప్రారంభించారు. రోప్‌ సాయంతో ముందుగా తల్లి, ఇద్దరు చిన్నారులను సురక్షితంగా కిందకు దించారు. అనంతరం తండ్రితోపాటు వారితో ఉన్న రెస్టారెంట్‌ సిబ్బందిని కూడా రక్షించారు.

క్రేన్‌ హైడ్రాలిక్‌ వ్యవస్థలో లోపం కారణంగానే ఈ ప్రమాదకర పరిస్థితి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. అంతటి ప్రమాదంలోనూ అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడం గమనార్హం. అయితే, ఇలాంటి సేవలు అందించే సంస్థలు భద్రత ప్రమాణాల విషయంలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని స్థానికులు, పోలీసులు స్పష్టంగా హెచ్చరించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ దృశ్యాలను చూసిన నెటిజన్లు "రొమాంచక అనుభవం ప్రాణాలను గుబులు పెట్టించింది" అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.




Tags:    

Similar News