ఉద్దానానికి సరికొత్త ఉదయంగా
ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేపట్టబోయే ఈ పరిశోధనలలో భాగంగా తొలి దశలో అయిదు వేల మంది కిడ్నీ పేషంట్లని ఎంపిక చేసి వారిని పరీక్షిస్తారు అని మంత్రి తెలిపారు.;
శ్రీకాకుళం జిల్లాలో ఉద్ధానం ప్రాంతం అంటే కొబ్బరి తోటలకు ప్రసిద్ధి అన్నది ఒక మాట. అంతకు ముంది ప్రాచుర్యం పొందింది కిడ్నీ వ్యాధుల విషయంలో. భయంకరమైన ఈ జబ్బుకు కేరాఫ్ గా ఈ ప్రాంతం ఉండడం ఈ ప్రాంతీయులకు ఒక బాధ అయితే ఆ వ్యాధితో తమ వారు అంతా మృత్యు వాత పడడం అసలైన బాధ. ఎందుకు ఈ వ్యాధి వస్తుంది అన్నది అయితే పూర్తిగా ఇప్పటిదాకా పరిశీలన అయితే జరగలేదు అన్నది వాస్తవం. వ్యాధి గ్రస్తులకు ఆర్ధిక ఊరట ఇస్తున్నారు పెన్షన్ సాయం చేస్తున్నారు. ఆసుపత్రులలో డయాలసిస్ చేయిస్తున్నారు. కానీ వ్యాధి మూలాలు మాత్రం సమగ్రంగా కనుగొనలేకపోయారు.
లోతైన పరిశోధన :
ఈ నేపథ్యంలో ఐసీఎంఆర్ ఆమూలాగ్రం పరిశోధన చేసేందుకు రంగంలోకి దిగుతోంది. ఈ జిల్లా వాసులకు కిడ్నీ వ్యాధుల విషయంలో ఒక శాశ్వత పరిష్కారం కనుగొనడానికి ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ తన వంతు ప్రయత్నాలు చేయనుంది. ఇక శ్రీకాకుళం కిడ్నీ రిసెర్చ్ ప్రాజెక్ట్ పేరుతో ఒక భారీ కార్యక్రమాన్ని ఐసీఎంఆర్ చేపడుతోంది. ఈ రాజెక్ట్ కోసం భారీగానే ఖర్చు అవుతుంది. ఆ వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు. చాలా తొందరలోనే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తుందని ఆయన వివరించారు. వీరికి రక్త పరీక్షలతో పాటు యూరిన్ పరీక్షలను సైతం బయోమార్కర్స్ విధానంలో నిర్వహిస్తారు అని ఆయన తెలిపారు.
సమగ్ర పరీక్షలు :
ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేపట్టబోయే ఈ పరిశోధనలలో భాగంగా తొలి దశలో అయిదు వేల మంది కిడ్నీ పేషంట్లని ఎంపిక చేసి వారిని పరీక్షిస్తారు అని మంత్రి తెలిపారు. అలా మూడు దశలుగా ఈ పరిశోధన సాగుతుంది. మొత్తం మూడేళ్ళ పాటు సాగే ఈ పరిశోధనకు ఆరు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయిస్తోంది అని మంత్రి చెప్పారు.
ఏనాటి నుంచో సమస్య :
ఉద్ధానంలో కిడ్నీ వ్యాధుల సమస్య ఈనాటిది కాదు దానికి మూడు దశాబ్దాల చరిత్ర ఉంది. చాలా మంది ఈ జబ్బుకు బలి అయిపోయారు. అకాల మృత్యువాత పడ్డారు. ఉద్దానంలో ప్రతీ ఒక్కరి కుటుంబాన్ని కిడ్నీ వ్యాధి కబలించింది. ఏ ఇంట చూసినా కన్నీరే ఉంది, ఎన్నో విషాద గాధలు ఉన్నాయి. అనాధలైన పిల్లలు అలాగే పండుటాకులు ఏ దిక్కూ లేని ఆడ, మగ ఒంటరి వారు కనిపిస్తారు. ఈ సమస్యకు మూలాలు ఏమిటి అని కనుక్కొనే ప్రయత్నం గతంలో జరిగినా పెద్దగా సాగలేదని చెబుతారు.
ఉద్దానానికి సరికొత్త ఉదయంగా :
ఇపుడు ఏకంగా ఇండియన్ కౌన్సెల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రంగంలోకి దిగడంతో ఇక తమ కష్టాలు తొలగిపోతాయని ఈ ప్రాంత వాసులు భావిస్తున్నారు. ఈ ప్రాంతం వారికి రక్షిత మంచి నీరు ఉచితంగా అందించాల్సి ఉంది. అలాగే డయాలసిస్ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరిగేందుకు అయ్యే ఖర్చుని భరించలేక పోతున్నారు. దాంతో ఉచితంగా వాహన సౌకర్యం కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మరో వైపు ఈ వ్యాధి విషయంలో అవగాహన కల్పించడం కూడా చాలా ముఖ్యమని అంటున్నారు. ఏది ఏమైనా ఉద్దానానికి సరికొత్త ఉదయంగా ఈ పరిశోధన ఉండబోతుంది అని అంతా భావిస్తున్నారు.